Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Mango. Show all posts
Showing posts with label Mango. Show all posts

Mango Dal - మామిడికాయ పప్పు


Mango Dal - మామిడికాయ పప్పు



 కావలసినవి:
 కందిపప్పు - కప్పు; మామిడికాయ - 1; పచ్చి మిర్చి - 4; ఎండు మిర్చి - 4; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; కారం - టీ స్పూను

 తయారి:
 ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి  మునగకాడను ముక్కలు చేయాలి

 కందిపప్పుకి తగినంత నీరు చేర్చి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి

 బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి

 కరివేపాకు వేసి వేగాక, మామిడికాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి

 ఉడికించిన పప్పు జత చేసి బాగా కలపాలి

 పసుపు, కారం వేసి మరో మారు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి.

Summer Drinks - వేసవి పానీయాలు

తేనియ రుచుల పానీయాలు!


వేసవి వేడితో జీవితం రసహీనమవుతుంటే
 దాన్ని మళ్లీ రసభరితం చేసేవే పానీయాలు.
 నిమ్మకాయ మొజిటోతో వదులుతుంది నీరసం.
 క్రమం తప్పక తాగితే ఊరుతుంది జఠర రసం.
 అప్పటివరకూ తోటకూర కాడల్లా సోలిపోయినా...
 ఆ తర్వాత మాత్రం ఒళ్లంతా చురుకు నిండిన పాదరసం.
 అందుకే ఈ మొజిటోను గెజిట్లో చేర్చాలనిపించకపోతే మీలో ‘రస’హృదయం అంతగా లేదనుకోవాల్సిందే.
 ఇక ఎండల వేడికి, మంటల గాడ్పుకు మీరు డస్సిపోతేసేద దీర్చే పానీయమవుతుంది పంజాబీ లస్సీ!
 మహా ఫ్రూట్‌పంచ్ మహత్యం అంతా ఇంతా కాదు...
 నిస్తేజాలకూ, నిరుత్సాహాలకూ అది ఇంచుకు ఒకటి చొప్పున ఇస్తుందో పంచ్.
 వెరసి...
 పానీయాలంటే మరేమిటో కాదు...
 స్వరూపం మార్చుకున్న తేనియలు.


 మొజిటో
 కావలసినవి:  
 నిమ్మకాయ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
 పుదీనా ఆకులు - 20 (రసం చేయడానికి, గార్నిషింగ్‌కి)
 పంచదార - 2 టేబుల్ స్పూన్లు
 ఐస్ - కొద్దిగా
 సోడా - 100 మి.లీ.
 పంచదార - 2 టీ స్పూన్లు

 తయారీ:
 ఒక గిన్నెలో పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, పంచదార వేయాలి.

 కవ్వం లాంటి దానితో వాటి మీద గట్టిగా ఒత్తి, కవ్వం తీసేసి, ఐస్ ముక్కలు జత చేయాలి.

 సోడా పోసి బాగా కలపాలి.

 పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 పార్టీ ఫ్రూట్ పంచ్

 కావలసినవి:  
 ఆపిల్ - 2
 పుచ్చకాయ ముక్కలు - రెండు కప్పులు
 ద్రాక్షపళ్లు - 10
 పైనాపిల్- ఒక ముక్క కమలాపండు తొనలు  - 2
 పుదీనా ఆకులు - 6

 తయారీ:  
 ఆపిల్ తొక్కు తీసి ముక్కలు చేసుకోవాలి

 పుచ్చకాయ ముక్కలలో గింజలు వేరు చేయాలి

 కమలాపండు తొనలు బాగు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి

 అన్ని పండ్ల ముక్కలు ఒకదాని తరవాత ఒకటి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి

 ద్రాక్షపళ్లు జత చేసి మెత్తగా చేసి రసం వేరు చేయాలి

 పైనాపిల్ ముక్కలు, కమలా తొనలు, పుదీనా ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసి, గ్లాసులలో వేయాలి

 తయారుచేసి ఉంచుకున్న జ్యూస్‌ను గ్లాసులలో పోసి సర్వ్ చేయాలి.

 స్వీట్ పంజాబీ లస్సీ

  కావలసినవి:  
 పెరుగు - 5 కప్పులు
 పంచదార - 10 టేబుల్ స్పూన్లు
 ఏలకుల పొడి - అర టీ స్పూను
 రోజ్ వాటర్ - టీ స్పూను
 చల్లటి పాలు - అర కప్పు
 కుంకుమపువ్వు - చిటికెడు
 బాదం పప్పులు - 7  (సన్నగా తురుముకోవాలి)
 ఐస్ ముక్కలు - తగినన్ని

 తయారీ:
 ఒక పాత్రలో పెరుగు, పంచదార, ఏలకుల పొడి, నీళ్లు, వేసి అన్ని పదార్థాలు కలిసే వరకు గిలక్కొట్టి, గ్లాసులలో పోయాలి

 రోజ్‌వాటర్ జత చేయాలి

 గిన్నెలో చల్లటి పాలు, కుంకుమపువ్వు వేసి కలిపి, గ్లాసులో ఉన్న పెరుగు మిశ్రమానికి జత చేయాలి

 ఐస్ ముక్కలు వేసి కలపాలి

 బాదం తురుము జత చేసి సర్వ్ చేయాలి.

 ఇండియన్ సమ్మర్

 కావలసినవి:  
 పంచదార - టేబుల్ స్పూను
 నీళ్లు - 3 టేబుల్ స్పూన్లు
 నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
 చింతపండు రసం - టీ స్పూను (చిక్కగా ఉండాలి)
 ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి)
 కమలాపండు తొనలు - 2
 పైనాపిల్ ముక్కలు - 2

 తయారీ:
 ఒక పాత్రలో... పంచదార, నీళ్లు, నిమ్మరసం, చింతపండు రసం, ఐస్  వేసి అన్నీ కలిసే వరకు కలపాలి.

 గ్లాసులలో కమలాపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేయాలి.

 తయారుచేసి ఉంచుకున్న రసం పోసి చల్లగా సర్వ్ చేయాలి.

 ఫలూదా...

 కావలసినవి:  
 పాలు - 2 కప్పులు
 ఫలూదా సేవ్ - 1 ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో లభిస్తుంది)
 రోజ్ వాటర్ - 2 టీ స్పూన్లు
 నానబెట్టిన సబ్జా గింజలు - అర టీ స్పూను
 వెనిలా ఐస్ క్రీమ్ - కొద్దిగా

 తయారీ:
 ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, ఫలూదా సేవ్ వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించి, ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి

 గోరువెచ్చగా ఉన్న పాలలో ఫలూదా సేవ్  వేసి సన్న మంట మీద సుమారు 15 నిమిషాలు ఉంచాలి

 ఉడికించుకున్న సేవ్ చల్లబడటానికి ఐస్ జత చేయాలి

 సేవ్‌ను గ్లాసులలో వేసి, రోజ్ వాటర్ జత చేయాలి

 నానబెట్టుకున్న సబ్జా గింజలు వేయాలి

 పాలు జత చేయాలి

 వెనిలా ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 మామిడి-పుచ్చకాయ రసం
 కావలసినవి:  
 మామిడిపండు - 1 (బాగా పండినది)
 పుచ్చకాయ ముక్కలు - కప్పు
 నీళ్లు - 2 కప్పులు
 ఐస్ - అర కప్పు (మెత్తగా పొడి చేయాలి)
 పంచదార - 4 టీ స్పూన్లు
 స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ - 2 స్కూపులు

 తయారీ:
 మామిడిపండు తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

  పుచ్చకాయ ముక్కలు చేసి గింజలు వేరు చేయాలి

 మిక్సీలో మామిడిపండు ముక్కలు, 2 టీ స్పూన్ల పంచదార, కప్పు నీళ్లు పోసి మెత్తగా చేసి పాత్రలోకి తీసుకోవాలి.

 పుచ్చకాయ ముక్కలు, కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ల పంచదార, ఐస్ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి

 ఒక గ్లాసులో ముందుగా పుచ్చకాయ పల్ప్ వేసి, ఆ పైన మామిడిపండు గుజ్జు వేయాలి

 స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి

Mango Pickles - మామిడికాయ ఆవకాయలు

రుచికి చేవ... ఆవ!


రుచికి చేవ... ఆవ!
ఆవ ఓ పెద్ద హైజాకరు... ఓ మహా దోపిడీదారు.
 ఏం... పచ్చట్లో నూనె పోయడం లేదా? కారం వేయడం లేదా?
 ఆ మాటకొస్తే అల్లం, వెల్లుల్లీ లాంటివి వాడటం లేదా?
 మిగతా వాటన్నింటినీ హైజాక్ చేసేస్తుంది ఆవ.
 అలా చేసేసి ‘మామిడికాయ’ పచ్చడికి ‘ఆవకాయ’ అంటూ తన పేరే పెట్టించేలా చేస్తుంది.
 ఆవకాయనాడే నామకరణోత్సవం చేయిస్తుంది.
 ఏమిటీ దౌర్జన్యం? ఎందుకీ పేరు దోపిడీ?
 ఎందుకంటే... ‘ఆవ’ రుచికి చేవనిస్తుంది.
 మా‘మిడిమిడి’ రుచి సంపూర్ణమయ్యేలా సేవ చేస్తుంది.
 పచ్చడిని రుచుల తోవ నడిపిస్తుంది.
 అందుకే కొత్త ఆవకాయను చూడగానే జనమంతా ఆకలిని అర్జెంటుగా అద్దెకు తెచ్చుకుంటారు.
 కమ్మటి వాసన రాగానే కంచం ముందేసుకుంటారు.
 ఆవకాయ కనిపించగానే ‘ఆవ’క్కటే వేయమంటారు.
 అల్లం, మసాలా, నువ్వు, కొబ్బరి ఆవకాయల్ని ఇక్కడ మీ ముందుంచుతున్నాం.
 కొత్త ఆవకాయ పెట్టుకున్నాం కదా... అందుకే ఇవ్వాళ్టికి...
 ‘ఆవ’క్కటే వేసుకు తిందాం. ‘ఆవ’క్కటే చాలునందాం.


 మసాలా ఆవకాయ

 కావలసినవి: 
 మామిడికాయ ముక్కలు - కేజీ
 నువ్వుల నూనె - పావు కేజీ, కారం - పావు కేజీ
 అల్లం + వెల్లుల్లి ముద్ద - పావు కేజీ, పసుపు - టీ స్పూను, ఉప్పు - పావు కేజీ
 జీలకర్ర పొడి - 50 గ్రా., ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి - టేబుల్ స్పూను, మెంతి పొడి - టీ స్పూను, పసుపు - టేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులు - టీ స్పూను
 ఇంగువ - టీ స్పూను, ఎండుమిర్చి - 10

 తయారీ:  
 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి

 ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి

 మామిడికాయ ముక్కలు జత చేయాలి  మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి

 జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగినతర్వాత దింపేయాలి

 కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి

 చల్లారాక మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి

 శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి

 ఈ ఆవకాయ మామూలు ఆవకాయ కంటె కాస్త ఘాటుగా ఉంటుంది.

 చట్నీ ఆవకాయ

 కావలసినవి:  
మామిడికాయ గుజ్జు - కేజీ, ఉప్పు - పావు కేజీ
 పసుపు - టేబుల్ స్పూను, కారం - 125 గ్రా.
 అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కేజీ,
 నువ్వుల నూనె - పావు కేజీ
 జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
 మెంతి పొడి - టేబుల్ స్పూను, ఇంగువ - టీ స్పూను
 ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటి న్నర టీ స్పూన్లు

 తయారీ:
 బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్‌లో ఉడికించాలి

 చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి

 ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి

 ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి

 మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి

 ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి

 నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి

 పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడిగుజ్జు వేసి బాగా కలియబెట్టాలి

 శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి

 మూడు రోజుల తర్వాత మళ్లీ కలపాలి

 ఈ ఆవకాయను అన్నంలోకే కాకుండా, చట్నీలా ఇడ్లీ, దోసె, ఉప్మాలకు కూడా వాడుకోవచ్చు.

 స్వీట్ పచ్చడి

 కావలసినవి:  
 మామిడి తురుము - 3 కప్పులు (తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది); పంచదార - కప్పు; ఏలకుల పొడి - టీ స్పూను; జీడిపప్పు - 10 బాదంపప్పు - 10; నెయ్యి - టీ స్పూను; కిస్మిస్ - 20

 తయారీ:  
 జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

 బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి

 ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి

 పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి

 దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి

 దీన్ని  జామ్‌లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు.

 అల్లం ఆవకాయ

 కావలసినవి:  

 మామిడికాయ ముక్కలు - కిలో
 ఉప్పు - 125 గ్రా., కారం - 125 గ్రా.
 నువ్వుల నూనె - పావు కిలో; అల్లం ముద్ద - 125 గ్రా.
 వెల్లుల్లి ముద్ద - 125 గ్రా.; పసుపు - టీ స్పూను
 జీలకర్ర పొడి - 50 గ్రా.; మెంతిపొడి - టీ స్పూను
 ఇంగువ - టీ స్పూను; ఆవాలు, జీలకర్ర, మెంతులు - టీ స్పూను

 తయారీ:    
 మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి
    
 ఒక గిన్నెలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి

 వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి

 ఆవాలు, జీలకర్ర, మెంతులు జత చేసి బాగా వేయించి దింపేయాలి

 నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి

 పూర్తిగా చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి
   
 మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి తీసుకోవాలి
   
 మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.

 కొబ్బరి ఆవకాయ

 కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కిలో; ఉప్పు - పావు కిలో, పసుపు - టేబుల్ స్పూను; కారం - 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా., జీలకర్ర పొడి - 25 గ్రా.; మెంతి పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో నువ్వుల నూనె - పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ - టీ స్పూను, జీలకర్ర , మెంతులు - టీ స్పూను

 తయారీ:  
 మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి

 ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి

 వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి

 జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి

 నూనె చల్లారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి

 పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి

 మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవాలి.

 నువ్వు ఆవకాయ

 కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కిలో; నువ్వులు - పావు కిలో, ఉప్పు - పావు కిలో; నువ్వుల పొడి - అర కిలో; అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో; ఆవ పొడి - 50 గ్రా.,
 పసుపు - టీ స్పూను; జీలకర్ర పొడి - 25 గ్రా., మెంతి పొడి - టేబుల్ స్పూను;
 ఇంగువ - చిటికెడు; ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్లు

 తయారీ:  
 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి 

 నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి 

 ఒక  గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి

 వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి

 ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయాలి 

 నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది) 

 పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి 

 అన్నిముక్కలకూ మసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి

 మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు 

 ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.

ఐస్‌క్రీములు - IceCreams

ఐస్‌క్రీములు - IceCreams

Summer Special

ప్లేట్లోంచి నోట్లోకి టేస్టీ ఎవరెస్ట్...!
ఇప్పిస్తే అలకలు తీరుస్తుంది. అంటిస్తే మెలికలు తిప్పేస్తుంది. ఈ పొడుపు కథకు ఆన్సరేమిటీ? పళ్లను జిల్లనిపించే, నాల్కకు ఛిల్లనిపించే థ్రిల్లయిన ఐస్‌క్రీమ్. ఐస్‌క్రీమ్ తినడం ఈజీక్వల్‌టూ నైస్‌డ్రీమ్ కనడం
 ఐస్‌క్రీమ్ తెచ్చి ఇచ్చి ఐస్‌లో ఐస్ పెట్టి చూస్తే చాలు
 ప్రేమికులు ఐసైపోవాల్సిందేనట!
 ఐస్‌క్రీములు కేవలం వాళ్లకోసమేనా?
 వయసుతో నిమిత్తం లేకుండా అందరికోసం కాదా?
 ఎందుక్కాదూ!
 ఐస్‌క్రీములంటేనే వైజ్ ప్యూపిల్స్ కోసం,
 గాళ్స్ అండ్ గైస్ అండ్ నైస్ పీపుల్ కోసం
 అందుకే ఈ వేసవిలో మనాలీ వెళ్లినట్టనిపించేలా
 వెనీలానూ, కష్టాలన్నీ తీరేలా కస్టర్డ్ సలాడ్స్‌నూ
 మరెన్నో రకాలతో పాటు మ్యాంగో మ్యానియానూ
 మీకందిస్తున్నాం.
 కప్, కోన్‌లలోనే ఎవరెస్టులెక్కండి.
 తనివితీరా... చల్లటి ఐస్‌క్రీములు మెక్కండి.


 మ్యాంగో మ్యానియా


 కావలసినవి
 డెజైస్టివ్ బిస్కెట్స్ - రెండు కప్పులు; అన్‌సాల్టెడ్ బటర్ - 100 గ్రా. (కరిగించాలి); క్రీమ్ చీజ్ - ఒక టిన్; క్రీమ్ - ఒక కప్పు; మామిడిపండు గుజ్జు - ఒకటిన్నర కప్పులు; మామిడిపండు ముక్కలు - కప్పు; జిలెటిన్ - టీ స్పూను (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది) వేడి నీళ్లు - అర కప్పు; పంచదార - అర కప్పు

 తయారీ
 బిస్కెట్లను మెత్తగా పొడి చేయాలి.
   
 కరిగించిన బటర్, బటర్ ఒక పాత్రలో వేసి రెండూ కలిపి, గ్లాసులలో వేసి గట్టిగా ఒత్తి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి.
   
 ఒక పాత్రలో క్రీమ్ చీజ్, క్రీమ్, పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి.
   
 మామిడిపండు ముక్కలు జత చేయాలి.
   
 అరకప్పు వేడి నీళ్లలో జిలెటిన్ వేసి కరిగించాలి.
   
 మామిడిపండు గుజ్జు జత చేసి, ఈ మిశ్రమాన్ని సగం పక్కన పెట్టి, మిగిలిన దానికి క్రీమ్ చీజ్ జత చేసి బాగా కలపాలి.
   
 ఫ్రిజ్‌లో నుంచి గ్లాసులను బయటకు తీసి, వాటిలో మామిడిపండు మిశ్రమం, చీజ్ మిశ్రమం వరుసగా పోయాలి.
   
 ఇలా చేయడం వల్ల అన్ని పదార్థాలు కలిసిపోకుండా విడివిడిగా కనిపిస్తాయి.
    
 గ్లాసులను సుమారు నాలుగు గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అందించాలి.

 ఈజీ వెనీలా ఐస్‌క్రీమ్

 కావలసినవి:
క్రీమ్ - 2 కప్పులు (సూపర్ మార్కెట్ లేదా బేకరీలో దొరుకుతుంది); హోల్ మిల్క్ - కప్పు; పంచదార - 2/3 కప్పు; వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; వెనీలా బీన్ - 1 (తురమాలి)

 తయారీ:
 ఒక పాత్రలో క్రీమ్, పాలు, పంచదార, వెనీలా వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి పంచదార కరివేవరకు కలుపుతుండాలి

 వెనీలా బీన్ తురుమును పాల మిశ్రమంలో వేసి కలిపి దించి, ఒక పాత్రలో పోసి చల్లారనివ్వాలి

 పైన ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి సుమారు నాలుగు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీయాలి

 మిక్సీలో వేసి మెత్తగా చేసి మళ్లీ పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి

 ఈ విధంగా సుమారు మూడు సార్లు చేసి చివరగా డీప్ ఫ్రిజ్‌లోఉంచి నాలుగు గంటల తర్వాత తీసి చెర్రీలు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.

 మిక్స్‌డ్ ఫ్రూట్ క స్టర్డ్

 కావలసినవి:
 పాలు - పావు లీటరు; కస్టర్డ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; పంచదార - 50 గ్రా.; అరటిపళ్లు - 2;  ఆపిల్ - 1 ; దానిమ్మ - 1; ద్రాక్షపళ్లు - కొద్దిగా; చెర్రీస్, డ్రైఫ్రూట్స్ - గార్నిషింగ్ కోసం.

 తయారీ:
 ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి

 పంచదార జత చేయాలి కస్టర్డ్ పౌడర్‌ను కొద్దిగా చన్నీటిలో వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి కలిపి దించేసి చల్లారనివ్వాలి

 చల్లారిన పాలకు పండ్ల ముక్కలు జత చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి

 సుమారు రెండు గంటల తరువాత బయటకు తీసి, క ప్పులలో ఉంచాలి

 డ్రైఫ్రూట్స్ ముక్కలు, చెర్రీలు, ద్రాక్షపళ్లతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 చాకొలేట్ చిప్ ఐస్ క్రీమ్

 కావలసినవి
 పాలు - అర లీటరు; హెవీ క్రీమ్ - అర లీటరు;
 పంచదార - మూడు టేబుల్ స్పూన్లు;
 ప్లెయిన్ చాకొలేట్ తురుము - 3 టీ స్పూన్లు
 (ఇందులోని పదార్థాలన్నీ సూపర్‌మార్కెట్‌లో దొరుకుతాయి)

 తయారీ
 ఒకపాత్రలో పాలు, పంచదార వేసి సన్నని మంట మీద ఉంచి పంచదార కరిగేవరకూ కలుపుతుండాలి.
   
 పాలు చల్లారేవరకు పక్కన ఉంచి చల్లారాక క్రీమ్ వేసి కలపాలి.
   
 తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జాగ్రత్తగా ఒక పాత్రలో పోసి, ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి.
   
 బయటకు తీసి, ఫ్రీజర్‌లో సుమారు అరగంట ఉంచాక, బయటకు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
   
 ఫ్రీజర్‌లో మరో అరగంట ఉంచి తీసి మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
   
 ఈ విధంగా మూడు నాలుగు సార్లు చేయాలి.
   
 చివరగా ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజ్‌లో ఉంచి అరగంట తర్వాత తీసి సర్వ్ చేయాలి.

 ఫ్రోజెన్ బనానా కస్టర్డ్

 కావలసినవి:
 పాలు-2 కప్పులు; బ్రౌన్ సుగర్-కప్పు; కస్టర్డ్ పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు; వెనిలా ఎసెన్స్-టీ స్పూను; అరటిపళ్లు - 3 (బాగా పండినవి); రాస్ప్ బెర్రీస్-కొన్ని

 తయారీ:
 ఒక పాత్రలో పాలు, బ్రౌన్ సుగర్ వేసి పంచదార కరిగేవరకు పాలు కలుపుతుండాలి  చల్లటి నీళ్లలో కస్టర్డ్ పొడి వేసి జారుగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి  వెనిలా ఎసెన్స్ జత చేసి, బాగా ఉడికిన తర్వాత దించేయాలి

 అరటిపళ్లను ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో ఉంచి, మూత పెట్టి ఫ్రిజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి

 పాల మిశ్రమం పూర్తిగా చల్లారాక అరటిపండు ముక్కల మీద పోసి మళ్లీ సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి సర్వ్ చేయాలి.

 ఫిజీ మింట్
 చలివేంద్రం

 కావలసినవి:
 పుదీనా ఆకులు - ఒక కట్ట; నిమ్మకాయ - సగం చెక్క; పంచదార పొడి - 3 టీ స్పూన్లు; రాళ్ల ఉప్పు - టీ స్పూను; సోడా లేదా నీళ్లు - 100 మి.లీ.

 తయారీ:
 పుదీనా ఆకులను, నిమ్మచెక్కను రసం పిండే దానిలో ఉంచి గట్టిగా ఒత్తి రసం వేరు చేయాలి

 ఒక గ్లాసులో పంచదార పొడి, ఉప్పు వేసి కలపాలి

 పుదీనా, నిమ్మ చెక్కల రసాన్ని పంచదార మిశ్రమం మీద పోయాలి

 సోడా జత చేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి, చల్లగా సర్వ్ చేయాలి.

Ugadi Special Recipes - ఉగాది రుచులు

Ugadi Special Recipes - ఉగాది రుచులు

రుతువు మారగానే రుచులూ మారతాయి.
 నాల్కలు సంప్రదాయ షడ్రుచులను కోరతాయి.
 అందుకే... ఆరారా తినడానికి ఆరు రుచుల వంటలివే...
 నాలుకతో నెయ్యానికి తియ్యగా చెరుకు పానకం.
 పులుపుతో పచ్చిపులుసుదే జిహ్వపై గెలుపు.
 మిగులు చలికి విరుగుడీ మిర్చిమసాలా చలి ‘మంట’!
 వగరు రుచి కోసమే మామిడి మెంతిబద్దల విగరు.
 ‘వేప్పువ్వు పొడి’చే పోటు - అనారోగ్యాన్ని ఆవలికి నెట్టడానికే.
 చిటికెడంత తాను లేకపోతే అసలు రుచే లేదంటూ...
 ఇక అన్నింటా తానై ఉన్నానని చిటికేసి చెప్పే ‘ఉప్పు’!
 జయనామ సంవత్సరంలో విజయాలు సాధించే ముందర నాలుకపై రుచులను ‘ఆరే’యండి...
 షడ్రుచులపై మనసు పారేయండి!


 షడ్రుచుల ఉగాది పచ్చడి
 
 కావలసినవి:
 అరటిపండు ముక్కలు - కప్పు; చెరకు ముక్కలు - కప్పు; చింతపండు - కొద్దిగా; నీళ్లు - 6 కప్పులు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; వేప పువ్వు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం తురుము - 3 కప్పులు; ఉప్పు - చిటికెడు; మామిడికాయ ముక్కలు - పావు కప్పు

 తయారి:  
 చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి  

 ఒక పాత్రలో చింతపండురసం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి

 చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.

 పుల్లటి పచ్చిపులుసు
 
 కావలసినవి:
 చింతపండు - 50 గ్రా.; నీళ్లు - 4 కప్పులు; నువ్వులపొడి - 50 గ్రా.; ఉల్లిపాయ ముక్కలు- కప్పు; కారం - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఎండుమిర్చి - 4; తాలింపుగింజలు - టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు

 తయారీ:  
 చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి 

 ఉల్లిపాయముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వులపొడి, ఉప్పు అందులో వేసి బాగా కలపాలి

 బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి   

 చింతపండు రసంలో వేసి అన్నీ కలపాలి 

 (ఇష్టమైనవారు తీపి వేసుకోవచ్చు)

 చిరుచేదుగా వేపపువ్వు పొడి
 
 కావలసినవి:
వేపపువ్వు - అర కప్పు; ధనియాలు - 2 టీ స్పూన్లు; నువ్వులు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 10; మెంతులు - కొద్దిగా; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత

 తయారీ:
 వేపపువ్వును శుభ్రం చేసి ఎండబెట్టాలి

 బాణలిలో వేసి దోరగా వేయించి తీసేయాలి

 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి.

 నువ్వులు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

 అదే బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

 తయారుచేసి ఉంచుకున్న అన్ని పొడులకు వేపపువ్వు జత చేసి మరోమారు మిక్సీలో వేసి తీసేయాలి

 వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యి జతచేసి ఈ పొడి తింటే రుచిగా ఉండటమే కాకుండా, అనేక రోగాలను రాకుండా నివారిస్తుంది.

 కారం కారంగాపచ్చిమిర్చి మసాలా కూర
 
 కావలసినవి:
 పచ్చిమిర్చి - పావు కేజీ (బజ్జీ మిర్చి అయితే రుచి బాగుంటుంది); శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - గుప్పెడు; నువ్వుపప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; గసగసాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 10; ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు.

 తయారీ
 ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఒక వైపు గాట్లు పెట్టి గింజలు తీసేయాలి
   
 బాణలిలో నూనె వే సి కాగాక పచ్చిమిర్చి అందులో వేసి వేయించి పక్కన ఉంచాలి
   
 అదే బాణలిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి తీసేయాలి
   
 పల్లీలు, నువ్వుపప్పు విడివిడిగా వేసి వేయించి పక్కన ఉంచాలి
   
 పై పదార్థాలన్నీ(పచ్చిమిర్చి తప్పించి) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి

 బాణలిలో మరి కాస్త నూనె వేసి అందులో పచ్చిమిర్చి, పొడులు, గసగసాలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గించి దింపేయాలి.

 వగరు మామిడికాయ మెంతి బద్దలు
 
 కావలసినవి:
 మామిడిపిందెలు - 2; ఉప్పు - తగినంత; మెంతులు - టీ స్పూను; నూనె - 4 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; ఎండుమిర్చి - 15; ఇంగువ - పావు టీ స్పూను

 తయారీ:   
 ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు చేయాలి

 బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి

 ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి మిశ్రమం వేసి బాగా కలపాలి

 ఉప్పు వేసి మరోమారు కలిపి, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, రెండో రోజు వాడుకోవాలి.

 తియ్యటి చెరకు పానకం

 
 కావలసినవి:
 చెరకురసం - 2 గ్లాసులు; తేనె -  2 టీ స్పూన్లు; మిరియాలపొడి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను; ఐస్ క్యూబ్స్ - తగినన్ని

 తయారీ:   
 ఒక పాత్రలో చెరకు రసం పోసి అందులో తేనె వేసి కలపాలి

 మిరియాలపొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి

 రసాన్ని గ్లాసులలోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html