Mava Kaju Sandwich - మావా కాజు శాండ్‌విచ్
మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా
తయారి:
ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి
ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి
ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి
ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి
తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి
ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి.

