కాజు బర్ఫీ - Cashew Barfi
కావలసినవి: జీడిపప్పు పొడి - రెండు కప్పులు, పాలు - పావు కప్పు, పంచదార - ముప్పావుకప్పు, సిల్వర్ వార్క్ - అలంకరణకు.
తయారీ: పెద్ద గిన్నెలో పాలు పోసి వేడిచేసి పంచదార కలపాలి. పాలు ఉడుకుపట్టాక స్టవ్ మీద నుంచి దింపి జీడిపప్పు పొడి కొద్దికొద్దిగా వేస్తూ చిక్కటి పేస్ట్‌లా అయ్యే వరకు కలపాలి. వెడల్పాటి పళ్లానికి నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పళ్ళెమంతా సర్దాలి. దానిపైన సిల్వర్ వార్క్ వేయాలి(అవసరమనుకుంటే). బాగా చల్లారిన తరువాత బర్ఫీల్లా కోసి గాలిచొరబడని డబ్బాలో నిల్వ ఉంచాలి.
ఖర్జూర రోల్స్ - Dates Rolls
కావలసినవి: ఖర్జూరాలు - అరకేజి, పాలు - ఒక లీటర్, డ్రైఫ్రూట్స్ - అరకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరి పొడి, వాల్‌నట్స్ - అలంకరణకు.
తయారీ: ఖర్జూరాల్లోని గింజలు తీసేసి చిన్న ముక్కలు చేయాలి. పాన్‌లో నెయ్యి కరిగించి ఖర్జూరాలు వేసి తక్కువ సెగ మీద 20 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఖర్జూర పలుకులు మెత్తగా అయ్యాక పాలు పోసి చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఆ తరువాత డ్రైఫ్రూట్స్ పలుకుల్ని కలిపి పాన్‌ను కిందికి దింపాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక రోల్స్‌లా చుట్టి కొబ్బరిపొడిలో దొర్లించి, వాల్‌నట్స్‌తో అలంకరిస్తే టేస్టీ టేస్టీ ఖర్జూర రోల్స్ రెడీ.
డ్రైఫ్రూట్స్ బర్ఫీ - Dry Fruits Barfi
కావలసినవి: అంజీర్ (డ్రై ఫిగ్స్) - ఒకటిన్నర కప్పులు, ఖర్జూర - ఒక కప్పు, బాదం, వాల్‌నట్ (అక్రోట్), పిస్తా, ఎండుద్రాక్ష - ఒక్కోటి ముప్పావు కప్పు, యాలకల పొడి - అర టీస్పూన్, నట్‌మెగ్ (జాజి) పొడి - పావు టీస్పూన్, నెయ్యి లేదా నూనె - ఒక టేబుల్‌స్పూన్, సిల్వర్ వార్క్ - ఒకటి.
తయారీ: గోరు వెచ్చటి నీళ్లలో అంజీర్‌ను పావుగంట నానపెట్టిన తరువాత నీళ్లు వడకట్టి ఆరపెట్టాలి. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్, పిస్తా, ఖర్జూరాలను సన్నటి ముక్కలుగా తరగాలి. ఒకవేళ మిక్సీలో వేస్తే పొడి కాకుండా కచ్చాపచ్చాగా పట్టాలి. ఆ తరువాత అంజీర్‌ను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్‌లా చేయాలి. నూనె వేడిచేసి అందులో అంజీర్ పేస్ట్‌ను వేసి నిమిషం పాటు వేగించాక ఖర్జూర ముక్కలను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. తరువాత డ్రైఫ్రూట్స్ వేసి కలిపి యాలకలపొడి, నట్‌మెగ్ పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వెడల్పాటి పళ్లానికి నూనె రాసి ఈ బర్ఫీ మిశ్రమాన్ని పోసి గరిటెతో సమంగా సర్ది చల్లారనివ్వాలి. ఇష్టపడే వాళ్లు పైన సిల్వర్ వార్క్ వేసుకోవచ్చు. అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు. వీటిని గాలి చొరబడని సీసాలో ఉంచితే రెండు వారాల పాటు తాజాగా ఉంటాయి.
కావలసినవి: పాలు, పంచదార - ఒక్కోటి రెండు కప్పుల చొప్పున, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, మైదా - అరకప్పు చొప్పున, జీడిపప్పు ముద్ద - పావు కప్పు, నెయ్యి - అర కప్పు, యాలకులపొడి - ఒక స్పూన్, మిఠాయి రంగులు - మూడు.
తయారీ: పొయ్యి మీద పాన్ పెట్టి పచ్చిపాలు పోసి అందులో పంచదార, మైదా, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి ఒకదాని తరువాత ఒకటి వరసగా వేయాలి. సన్నని సెగ మీద ఉంచి గరిటెతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడుతుండగా జీడిపప్పు ముద్ద కలిపి, యాలకులపొడి కూడా చల్లి రెండు నిమిషాలయ్యాక స్టవ్ మీద నుంచి పాన్ దింపేయాలి. ఈ మిశ్రమాన్ని మీకు కావాల్సినన్ని భాగాలుగా చేసి మీకు నచ్చిన రంగులు కలపాలి. చల్లారాక కొవ్వొత్తుల మాదిరిగా చేయాలి. అదే మిశ్రమాన్ని ఒత్తుల్లా చేసి కొవ్వొత్తుల పైన పెట్టాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన స్వీట్ క్యాండిల్స్ సిద్ధం.
ఖర్జూర నువ్వుల లడ్డు - Dates Sesame Laddu
కావలసినవి: తెల్ల నువ్వులు - ఒక కప్పు, ఖర్జూర (గింజలు తీసి తరగాలి)- ముప్పావు కప్పు, ఎండుకొబ్బరి తురుము - అర కప్పు.
తయారీ: నువ్వుల్ని పాన్‌లో వేసి ఓ మాదిరి మంట మీద నూనె వేయకుండా గోధుమరంగుకి వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొబ్బరి వేసి కాసేపు వేగించి స్టవ్ ఆపేయాలి. నువ్వుల్ని మిక్సీలో వేసి నాలుగు సెకన్లు మాత్రమే (కచ్చాపచ్చాగా అయ్యేలా) మిక్సీ చేయాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసి ఖర్జూర తరుగు, కొబ్బరి (ఒక టేబుల్‌స్పూన్ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి) వేసి చేతితో కలపాలి. ఈ మిశ్రమాన్ని లడ్డు ఉండల్లా చుట్టి కొబ్బరి తురుములో దొర్లించాలి.