what a semyA - నాట్‌సేమ్ యా!!
Somolina Recipes
చూడ చూడ సేమ్యా సేమ్ టు సేమ్‌గానుండు.కాని సేమ్యాతో చేసే ఆ వంటలే డిఫరెంట్‌గానుండు.
పులుపు చేర్చితే పులిహోర అగును.
వెజిటబుల్స్ వేస్తే బిర్యానీగా మారును.
కారం వేస్తే కట్‌లెట్ కరకరమనును.
పంచదార కలిపితే తియ్యని పండగై మది నిండును.
ఏ ఒక్క రుచీ ఒక్కలా ఉండకపోయినా
ఏ ఒక్క రుచీ మనల్ని వదలకుండా ఉండు.
మీ స్వీట్ హోమ్‌లో సేమ్యాతో రుచులు వండండి.
ఇంటిల్లిపాదిచే ఈ వీక్...
నాట్ ‘సేమ్ యా’... ‘వెరీ డిఫరెంట్’ అనిపించండి.
స్ప్రింగ్ రోల్స్
సేమ్యా - కప్పు
మిక్స్‌డ్ వెజిటబుల్స్ (క్యారట్, బీన్స్, క్యాబేజీ, బఠానీలు, క్యాప్సికమ్.. తరుగు మొదలైనవి) - కప్పు
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
సోయా సాస్ - టేబుల్‌స్పూన్
ఉప్పు, మిరియాలపొడి - తగినంత
నూనె - 2 టీ స్పూన్లు
రోటీ కోసం మైదా - కప్పు
తయారి
మైదాలో నీళ్లు కలిపి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. సేమ్యాను ఉడికించి, పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేసి, కాగాక, ఉల్లిపాయల తరుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేసి కలిపి, ఉడికించాలి. బాగా వేగిన తర్వాత ఉప్పు, సేమ్యా వేసి కలపాలి. పైన మిరియాల పొడి చల్లి, దించాలి. మైదాను చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పలచని రోటీ చేయాలి. దీంట్లో తగినంత సేమ్యా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టి, రోల్ చేసి అన్ని వైపులా మూసేయాలి. ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత రోల్స్‌ని నూనెలో వేసి అన్నివైపులా డీప్ ఫ్రై చేయాలి. ఈ రోల్స్‌ని ఏదైనా సాస్ లేదా జ్యూస్‌తో సర్వ్ చేయాలి.
బిర్యానీ
సేమ్యా - కప్పు, బంగాళదుంప - ఒకటి (పెద్దది), క్యారెట్ - 2
సోయా క్యూబ్స్ - సగం కప్పు, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - తగినంత
మసాలా (లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు, సాజీరా) - టీస్పూన్, బిర్యానీ ఆకు - 1, నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్, ఉల్లిపాయముక్కలు - సగం కప్పు, టొమాటో ముక్కలు - సగంకప్పు, ఉప్పు - రుచికి తగినంత, సాంబార్ పొడి - సగం చెంచా, జీడిపప్పు - 4 పలుకులు
తయారి
స్టౌపై గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి సేమ్యా బంగారు వర్ణంలో వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యి వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, గసాలు, సాజీరా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపముక్కలు, క్యారట్‌ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అందులో 2 కప్పులు నీళ్లు పోసి, ఉప్పు, సాంబార్ పొడి, వేడినీటిలో నానబెట్టుకున్న సోయా క్యూబ్స్ వేసి మూత పెట్టి, మరిగించాలి. వేయించి ఉంచిన సేమ్యా వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని, ఉడికిన తర్వాత దించుకుని కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి.
కట్‌లెట్స్
సేమ్యా - సగం కప్పు
ఉడికించిన బంగాళాదుంప పేస్ట్ - కప్పు
బ్రెడ్ పౌడర్ - 3 టీ స్పూన్లు
వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు -
3 టేబుల్‌స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు - రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
కారం - టీ స్పూన్
జీలకర్ర - టీ స్పూన్
కొత్తిమీర - 3 టీ స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
నిమ్మరసం - టీ స్పూన్
తయారి
ముందుగా స్టౌపై గిన్నెపెట్టి సేమ్యాను నూనె లేకుండా గోధుమరంగు వచ్చే వరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో బంగాళదుంప పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, వేరుశనగ పప్పులు, జీలకర్ర, కొత్తిమీర, సేమ్యా, నిమ్మరసం.. ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, కాగనివ్వాలి. తర్వాత సేమ్యా మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో చేసుకొని బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ డిప్ చేసి నూనెలో వేయించుకోవాలి. రెడీ అయిన సేమ్యా కట్‌లెట్స్ వేడివేడిగా, కరకరలాడుతూ నోరూరిస్తాయి.
సూప్
సేమ్యా - అర కప్పు, ఉల్లిపాయ - 1 (పలచని స్లైసుల్లా కట్ చేయాలి), నీరు - 2 కప్పులు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - 2 (తరగాలి), బెంగుళూరు మిర్చి - 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), పచ్చి బఠానీలు - అరకప్పు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, టొమాటోలు - 2 (సన్నగా తరగాలి), ఉప్పు, మిరియాల పొడి - తగినంత
తయారి
వెడల్పాటి పెద్ద పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి, సేమ్యాను వేయించి తీయాలి. అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి కూరగాయ ముక్కలు, పచ్చిబఠానీలు వేసి వేయించాలి. దాంట్లోనే వేయించిన సేమియా వేసి, నీళ్లు పోసి, వెల్లుల్లి తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి, సేమ్యా బాగా ఉడికిందనిపించాక, కొత్తిమీర చల్లి, దించాలి. సూప్ కప్పులో పోసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
కేసరి
సేమ్యా - కప్పు, పంచదార - 1/2 కప్పు (తీపి కావాలనుకునేవారు పంచదార ఎక్కువ వేసుకోవచ్చు), జీడిపప్పు, బాదం పప్పు - 10 పలుకులు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, ఏలకులు - 2, నెయ్యి - 4 టీ స్పూన్లు, కేసరి రంగు - చిటికెడు.
తయారి:
ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టౌపై పెట్టి టీ స్పూన్ నెయ్యి వేయాలి. అందులో బాదంపప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసి సేమ్యాను దోరగా వేయించుకొని, అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత కేసరి రంగు, పంచదార వేసి కలిపి కొంచెంసేపు ఉడికించి స్టౌపై నుంచి దించి వేయించిన జీడిపప్పు, బాదంపప్పుతో గార్నిష్ చేసుకోవాలి.
పులిహోర
సేమ్యా- కప్పు, చింతపండు - నిమ్మకాయంత
శనగపప్పు - టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్,
జీడిపప్పు - 4 పలుకులు
ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్
ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెమ్మ,
ఉప్పు - రుచికి సరిపడేంత
ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 4,
నూనె - 3 టీ స్పూన్లు
తయారి
ముందుగా సేమ్యాను ఉడికించి, వార్చి, వెడల్పాటి ప్లేట్‌లో వేసి, విడదీసి ఆరనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పువేసి, ఉడికించి, చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జును, సేమ్యాకు పట్టించి, పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సమంగా వేగనివ్వాలి. ఈ పోపును పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలిపి, ప్లేట్లలోకి సర్ది, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
చిట్కా - సేమ్యాను ఉడికించి, వార్చిన తర్వాత చల్లటి నీరు చల్లి, టీ స్పూన్ నూనె కలిపితే ఒకదానికొకటి అతుక్కోదు.

