Moonstar Meals - మూన్ స్టార్ మీల్స్
నాటి రాజుల చంద్రశాల... నేటి మన బార్బిక్యూ...చంద్రుడి వెన్నెలలో... చుక్కల నడుమ...
వేడివేడిగా... కొత్త రుచులు తయారవుతుంటే...
చంద్రుడికి కూడా నోరూరుతుంది...
తన చుట్టూ ఉన్న చుక్కలను వెంట తెచ్చుకుని...
మనతో పోటీ పడతాడు.
ఎప్పుడూ ఫైవ్ స్టారేనా...
మల్టీ స్టార్ కూడా చూడండి...
వెన్నెల విందు ఆస్వాదిస్తూ ఆరగించండి... అంటాడు.
ఈ రోజు మీ కిచెన్‌ని మేడ మీదకి మార్చండి.
సన్నని మంట వెలిగించి గ్రిల్ మీద వంటలు తయారుచేయండి
ఇంటిల్లిపాదికీ కొత్తరుచులను అందించండి...
జుచినీ కోటెడ్ చీజ్
పనీర్ - 200 గ్రా.
జుచినీ (కీర దోసలా ఉంటాయి.
మార్కెట్‌లో దొరుకుతాయి) - 100 గ్రా.
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి పేస్ట్ - 60 గ్రా.
పెరుగు - 60 గ్రా.
మయొనైజ్ చీజ్ - 70 గ్రా.
పుదీనా పేస్ట్ - 15 గ్రా.
చిలికిన క్రీమ్ - 60 గ్రా.
జీలకర్ర పొడి - 20 గ్రా.
జాటర్ పొడి - టీ స్పూను
తెల్లమిరియాల పొడి - అర టీ స్పూను
ఆలివ్ ఆయిల్ - స్పూను
తయారి
జుచినీని ముందుగా గ్రిల్ చేయాలి.
ఒకపాత్రలో పెరుగు, మయొనైజ్ చీజ్, పుదీనా పేస్ట్, జీలకర్రపొడి, నిమ్మరసం, ఉప్పు, తెల్లమిరియాలపొడి, జాటర్ పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఆలివ్ ఆయిల్, క్రీమ్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని గ్రిల్డ్ జుచినీకి పట్టించి, సుమారు 45 నిముషాలు నాననివ్వాలి.
గ్రిల్ మీద రోస్ట్ చేయాలి
వీటిని వేడివేడిగా సోర్ క్రీమ్, హోమ్ సల్సా (రకరకాల కూరలతో సలాడ్) తో సర్వ్ చేయాలి
చార్ గ్రిల్ పైనాపిల్
పైనాపిల్ - 250 గ్రా.
ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూన్
తేనె - అర టీ స్పూను
బార్బిక్యూ సాస్ - అర టీ స్పూను
(మార్కెట్లో దొరుకుతుంది)
ఉప్పు - తగినంత
చాట్ మసాలా - అర టీ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర స్పూను
నిమ్మరసం - టీ స్పూను
8 టు 8 సాస్ - అర టీ స్పూను
(మార్కెట్లో దొరుకుతుంది)
తయారి
తేనె, బార్బిక్యూసాస్, 8 టు 8 సాస్, నల్ల ఉప్పు, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తరుగు, ఎండుమిర్చి ముక్కలు, ఉప్పు ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
ఇందులో పైనాపిల్ ముక్కలు వేసి కలిపి సుమారు గంటసేపు నాననివ్వాలి.
ఆ తరవాత ఒక్కోముక్కను గ్రిల్ మీద రోస్ట్ చేసి తేనెతో వేడివేడిగా సర్వ్ చేయాలి.
ఈ వంట చేసుకునే ప్రదేశంలో మంచు, వాన వంటివి పడకుండా చూసుకోవాలి
గ్రిల్‌ను సబ్బునీటితో శుభ్రం చేయాలి. ఆ తరవాత ఉల్లిపాయను మధ్యకు కోసి గ్రిల్‌ను శుభ్రం చేసుకోవాలి
గ్రిల్లింగ్ ఇంట్లో లేకపోతే మందంగా ఉండే పెనం ఉపయోగించుకోవచ్చు. ఈ బొమ్మలో చూపిన వస్తువు బయట దొరుకుతుంది. దానిని ఉపయోగించుకుని కూడా చేసుకోవచ్చు.
జాకెట్ మష్రూమ్
మష్రూమ్ (పుట్టగొడుగులు)- 150 గ్రా.
ఉప్పు - రుచికి తగినంత
పండుమిర్చి పేస్ట్ - 50 గ్రా.
చీజ్ - 50 గ్రా., పచ్చిమిర్చి - 6
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
నూనె - 100 మి.లీ., కార్న్‌ఫ్లోర్ - 70 గ్రా.
బ్రెడ్ పొడి - 60 గ్రా.
కొత్తిమీర తరుగు - టీ స్పూను
పెరుగు - 60 గ్రా., కారం - టీ స్పూన్
టొమాటో కెచప్ - టీ స్పూను
ఉల్లితరుగు - టీ స్పూను
జీడిపప్పు పేస్ట్ - టీ స్పూను
తండూరి మసాలా - కొద్దిగా
తయారి
చీజ్ తురుముకుని అందులో ఉల్లితరుగు, పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
పుట్టగొడుగులను శుభ్రం చేసి ఉడకపెట్టాలి. అందులో పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి.
కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం, తగినంత నీరు పోసి పిండిని జారుగా కలుపుకోవాలి.
స్టఫ్‌చేసి ఉంచుకున్న పుట్టగొడుగుల్ని ఇందులో ముంచి తీసి వాటిని బ్రడ్ పొడిలో దొర్లించాలి.
పొయ్యి మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి బాగా కాగిన తరువాత పైన తయారు చేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి వేగనివ్వాలి.
జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్,పెరుగు, టొమాటో కెచప్, కారం, ఉప్పు, నూనె, తందూరీ గరంమసాలా... వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో పుట్టగొడుగుల్ని వేసి బాగా కలిపి పదిహేను నిముషాలు నాననివ్వాలి. ఆ తరవాత వీటిని గ్రిల్ మీద బాగా రోస్ట్ చేయాలి.
పుదీనాచట్నీ, టొమోటో సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేయాలి.
బేబీ పొటాటో విత్ లెమన్ ఆలివ్
బేబీపొటాటో (చిన్న ఆలుగడ్డలు) - 250 గ్రా.
బ్లాక్ ఆలివ్ - 10
(బజారులో దొరుకుతుంది)
ఆలివ్ ఆయిల్ - 100మి.లీ.
ఉప్పు - తగినంత, కారం - అర టీ స్పూను
నిమ్మరసం - టీ స్పూను
స్వీట్ పాప్రికా (రెడ్ క్యాప్సికమ్ పొడి) పొడి - టీ స్పూను (మార్కెట్లో దొరుకుతుంది)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
గడ్డపెరుగు - టీ స్పూను
నల్ల ఉప్పు - తగినంత,
చాట్‌మసాలా - 20 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
మయొనైజ్ చీజ్ - 80 గ్రా.
ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను
తయారి
ఒకపాత్రలో కొద్దిగా నీరు, ఆలుగడ్డలు వేసి ఉడికించాలి.
పైన తొక్క ఒలిచి నూనెలో డీప్‌ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి.
వాటికి చిన్న చిన్న రంధ్రాలు చేయాలి.
పెరుగు, మయొనైజ్ చీజ్, కారం, న ల్ల ఉప్పు, నిమ్మరసం, స్వీట్ పాప్రికా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఎండుమిర్చి ముక్కలు, ఆలివ్స్, ఆలివ్ ఆయిల్ ... ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
వేయించి ఉంచుకున్న ఆలుగడ్డలను ఇందులో వేసి అరగంటసేపు నాననివ్వాలి.
గ్రిల్ మీద రోస్ట్ చేసి వెల్లుల్లి, మయొనైజ్‌తో వేడివేడిగా సర్వ్ చేయాలి.
మలై బ్రకోలీ
బ్రకోలీ (ఆకుపచ్చ క్యాలీఫ్లవర్‌లా ఉంటుంది)- 15 గ్రా.
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
జీడిపప్పు పేస్ట్ - టీ స్పూను
తాజా క్రీమ్ - టీ స్పూను
ఉప్పు - తగినంత, నూనె - అర టీ స్పూను
తెల్ల మిరియాల పొడి - అర టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ (ఉడికించి పేస్ట్ చేయాలి) - టీ స్పూన్
గడ్డపెరుగు - టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
చీజ్ - టీ స్పూన్
ఆలివ్ ఆయిల్ - రెండు టీ స్పూన్లు
తయారి
బ్రకోలీని చిన్నచిన్న ముక్కలుగా తరిగి, బాగా కడిగి తడి పోయేవరకు ఆరబెట్టాలి.
జీడిపప్పు పేస్ట్, చీజ్, పెరుగు, క్రీమ్, ఉప్పు, తెల్ల మిరియాలపొడి, ఆలివ్ ఆయిల్, ఏలకుల పొడి... వీటన్నిటినీ బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
బ్రకోలీలో ఈ మిశ్రమాన్ని కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి.
ఆ తరవాత తండూరిలో కాని గ్రిల్‌లోకాని ఐదునిముషాలసేపు ఉడికించాలి.
ఇప్పుడు రుచికరమైన మలై బ్రకోలీ సిద్ధం.
వేడివేడిగా మామిడి, పుదీనా సాస్‌తో సర్వ్ చేస్తే ఎంతో పసందుగా ఉంటుంది.

