Eat by Frying - కాల్చుకుతిందాం
కొన్ని కూరలను చూస్తే తరిగి వండాలనిపిస్తుంది.కొన్నిటిని చూస్తే సలాడ్ చేసుకోవాలనిపిస్తుంది.
కొన్నిటిని చూస్తే కాల్చుకు తినాలనిపిస్తుంది.
దోస, వంగ, అరటి, ఉసిరి, చిలగడదుంప, బెంగళూరు వంకాయలను...
మార్కెట్ నుంచి తీసుకురండి.
కుంపటి మీద కాని స్టౌ మీద కాని కాల్చండి రుచికరమైన పచ్చళ్లు చేయండి.
వేడివేడి అన్నంలో కమ్మటినేతితో కలిపి తినండి.
కాల్చుకు తింటే ‘ఇంత బావుంటుందా!’ అని అనకమానరు...
వంకాయ బజ్జీ పచ్చడి
కావలసినవి
వంకాయలు పెద్దవి - 4
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 10
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 10
ఉల్లితరుగు - అర కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
నువ్వులపొడి - రెండు టీ స్పూన్లు
తయారి
వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి.
చల్లారిన తరవాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి.
పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి.
వంకాయ గుజ్జును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి.
బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలో కలపాలి.
ఉల్లితరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.
సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఉసిరికాయ పచ్చడి
పెద్ద ఉసిరికాయలు - పావు కిలో, నూనె - 6 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 6, ఎండుమిర్చి - 10, ఉప్పు - తగినంత, నిమ్మరసం - టీ స్పూను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు- 2 టీ స్పూన్ల చొప్పున, పసుపు - చిటికెడు, కొత్తిమీర - ఒక కట్ట
తయారి
ముందుగా ఉసిరికాయలను జాగ్రత్తగా స్టౌ మీద కాల్చి, చల్లారిన తరవాత పల్చటి పొట్టు, లోపల గింజలను తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేయాలి.
బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తరవాత ఉసిరిముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
బౌల్‌లోకి తీసుకుని కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అరటికాయ పచ్చడి
అరటికాయలు (పచ్చివి) - 2
పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 6
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - 2 టీ స్పూన్ల చొప్పున, పచ్చిశనగపప్పు - టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు
ఇంగువ - కొద్దిగా
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
పల్లీలపొడి - మూడు టీ స్పూన్లు
తయారి
అరటికాయలను స్టౌ మీద కాల్చాలి.
చల్లారిన తరువాత పైన ఉన్న పొట్టును తీసి ముక్కలు చేసుకోవాలి.
బాణలిలో నూనె వేసి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి చివర్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించాలి.
చల్లారిన తరువాత మిక్సీలో వేసి తిప్పాలి.
మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, అరటికాయముక్కలు వేసి తిప్పాలి.
పచ్చడిని బౌల్‌లోకి తీసుకుని, పల్లీలపొడి వేసి కలిపి, కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి.
చిలగడదుంప పచ్చడి
చిలగడదుంపలు - 3 (పెద్దవి)
నూనె - 5 టీ స్పూన్లు
ఎండుమిర్చి - 6
పచ్చిమిర్చి - 5
ఉప్పు - తగినంత
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
పచ్చిశనగపప్పు - టీ స్పూను
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
తయారి
స్టౌ మీద చిలగడ దుంపలు కాల్చాలి.
పొట్టు తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేయాలి.
బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు వేసి వేయించాలి.
చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
చిలగడదుంప ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి మరోసారి మిక్సీ పట్టాలి.
సర్వింగ్ బౌల్‌లోకి తీసి కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి.
దోసకాయ పచ్చడి
దోసకాయలు (పెద్దవి) - 2
నూనె - 6 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 10
ఆవాలు - 2 టీ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - 3 టీ స్పూన్లు
పచ్చిశనగపప్పు - 2 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, చింతపండు - కొద్దిగా (నానబెట్టినది), కొత్తిమీర - కొద్దిగా, బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి)
తయారి
దోసకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి.
బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
బెంగళూరు వంకాయ పచ్చడి
బెంగళూరు వంకాయలు (పెద్దవి)-2
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
నిమ్మరసం - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 5
నూనె - 4 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లితరుగు - పావు కప్పు
తయారి
బెంగళూరు వంకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి.
పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ తిప్పాలి.
చల్లారిన బెంగళూరు వంకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి తిప్పాలి.
బౌల్‌లోకి తీసుకుని వేయించిన పోపు ను వేసి బాగా కలపాలి.
నిమ్మరసం, ఉల్లితరుగు వేసి కలపాలి.
కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.

