Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Emblic Myrobalan(AavlA)ఉసిరిసీజనల్ సిరి

Emblic Myrobalan(AavlA)ఉసిరిసీజనల్ సిరి

Cuisine - Recipes-Varities-Indian Dishes

ఉడుకు నీళ్ల వెచ్చదనం..
ఉసిరి కాయ పచ్చడన్నం..
ఇవి చాలు -చలికాలపు వంతెన్ని దాటేందుకు!
కానీ దాటబుద్ది కాదు.
ఉసిరి పులిహోర తినొద్దా
ఉసిరి ఆవకాయ పట్టొద్దా
ఉసిరి తొక్కు నూరొద్దా
ఉసిరి పప్పు రుబ్బొద్దా
ఉసిరి ముక్కను కొరకొద్దా
ఊరికే పోనిస్తామా.. 
చలిని, గిలిని, సీజనల్ సిరిని!


పులిహోర 

కావలసినవి 
ఉసిరికాయలు - 5, బియ్యం - 2 కప్పులు 
ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు 
పసుపు - అర టీ స్పూన్, శనగపప్పు - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, నూనె - 4 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి - 2, ఎండుమిర్చి - 2 

తయారి 
ఉసిరికాయలు శుభ్రంగా కడిగి, తుడిచి, తురిమి పక్కన ఉంచాలి. అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పలుకుగా వండాలి. ఒక పళ్లెంలో అన్నం వేసి, విడదీసి, చల్లారనివ్వాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఇంగువ, మిగిలిన పోపు దినుసులు, కరివేపాకు వేయాలి. బాగా వేగాక, తురిమిన ఉసిరిని వేసి, కలపాలి. కొంచెం సేపు వేగనిచ్చి, దించేసి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పోపును అన్నంలో వేయాలి. తగినంత ఉప్పు వేసి, బాగా కలపాలి. ఇష్టమైతే వేయించిన జీడిపప్పు, పల్లీలు కలుపుకోవచ్చు. ఉసిరి పులిహోర మీద మూతపెట్టి పదినిమిషాల తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని వడ్డించాలి.

తొక్కు పచ్చడి 

కావలసినవి 
ఉసిరికాయలు - 10 
ఉప్పు - తగినంత 
పసుపు - 2 టీ స్పూన్లు 

తయారి 
ఉసిరికాయలను ముక్కలుగా కోసి, గింజలు తీసేయాలి. పసుపు కలిపి, గాజు సీసాలో వేసి, మూత పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆ ముక్కల్ని బయటకు తీసి, వాటికి ఉప్పు కలిపి రోట్లో కాని, మిక్సీలో గాని మెత్తగా రుబ్బి, జార్‌లో భద్రపరుచుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ మిశ్రమాన్ని పచ్చిమిర్చితో కలిపి, నూరుకొని తింటే రుచిగా ఉంటుంది. ఈ తొక్కుపచ్చడి నిల్వ ఉండే కొద్దీ నల్లగా మారుతుంది. 

ముక్కల పచ్చడి 

కావలసినవి 
ఉసిరికాయలు - 10, ఆవపొడి - 25 గ్రా, కారం - 100గ్రా. ఉప్పు - 75 గ్రా. నూనె - 200గ్రా.
మెంతిపొడి - 2 టీ స్పూన్లు 

తయారి: 
ముందుగా ఉసిరికాయలు బాగా కడిగి, తుడిచి ఆరబెట్టుకోవాలి. ఒక్కో కాయను నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో ఆవపొడి, కారం, ఉప్పు, మెంతిపిండి వేసి కలపాలి. వేగిన ముక్కలను అందులో వేసి, పైన నూనె పోస్తూ బాగా కలపాలి. తరవాత గాజు సీసాలో కానీ, జాడీలో కానీ పెట్టుకోవాలి. ఇలా కలిపి ఉంచిన పచ్చడిని మూడు, నాలుగు రోజుల తర్వాత తింటే రుచిగా ఉంటుంది. పచ్చడి ఊరే కొద్దీ రుచిగా ఉంటుంది.

ఆవకాయ

కావలసినవి 
ఉసిరికాయలు - పావు కేజీ 
కారం - 50 గ్రా.
ఆవపిండి - 50 గ్రా.
ఉప్పు - తగినంత 
పల్లీ నూనె - 100గ్రా.
నిమ్మరసం - 3 టీ స్పూన్లు 

తయారి 
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి పోయేవరకు ఆరనివ్వాలి. వాటికి నాలుగైదు గాట్లు పెట్టి, బాణలిలో నూనె కాగాక, అందులో వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత అందులో కారం, ఆవపిండి, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. అదే బాణలిలో నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇంగువ వేసి దించి, చల్లారాక పచ్చడిలో పోసి కలపాలి. ఇది ఒక రోజు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. 

పప్పు 

కావలసినవి 
ఉసిరికాయలు - 6 (ముక్కలుగా తరగాలి), కందిపప్పు - కప్పు 
నూనె - 4 టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు 
ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4 
కరివేపాకు - 2 రెమ్మలు 
పోపుగింజలు - 3 టీ స్పూన్లు
ఉల్లిపాయ - 1

తయారి 
ముందుగా పప్పు, ఉసిరికాయ ముక్కలు విడివిడిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. బాణలిలో నూనె వేసి, వేడయ్యాక ఇంగువ, కరివేపాకు, పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. చిన్న ఉల్లిపాయను నిలువుగా తరిగి దానిని కూడా పోపులో వేయించాలి. బాగా వేగిన తర్వాత విడిగా ఉంచిన పప్పును పోపు ఉన్న బాణలిలో వేయాలి. తర్వాత ఉప్పు, టీ స్పూన్ పచ్చికారం వేసి బాగా కలపాలి. పదినిమిషాలు ఉడకనిచ్చి, తర్వాత దించాలి. వేడి వేడి అన్నంలో ఉసిరికాయపప్పు, నెయ్యి వేసి కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. 

మురబ్బా 

కావలసినవి 
ఉసిరికాయలు - 20, పంచదార - 500 గ్రా.
ఏలకుల పొడి - పావు టీ స్పూన్
కుంకుమపువ్వు - కొద్దిగా

తయారి 
ఉసిరికాయలను శుభ్రపరిచి, తడి ఆరేంతవరకు ఉంచాలి. తర్వాత ఒక్కో ఉసిరికాయను ఫోర్క్‌తో చుట్టూ గుచ్చాలి. పాన్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఉసిరికాయలు వేసి పది నిమిషాలు పెద్ద మంటమీద ఉడికించాలి. తర్వాత నీళ్లు తీసేసి, ఆరిపోయేంతవరకు పక్కన ఉంచాలి. ఒక పాత్రలో పంచదార, మూడు కప్పుల నీళ్లు పోసి, పంచదార చిక్కని పానకంలా అయ్యే వరకు ఉంచి, ఉడికించిన ఉసిరికాయలను వేసి, అరగంటసేపు సన్నని మంట మీద ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. రెండు రోజులు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. అప్పుడు పంచదార పాకం ఉసిరికాయలకు బాగా పడుతుంది. తర్వాత ఉసిరికాయ మిశ్రమంలో ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి, నాలుగైదు నిమిషాలు సన్నని మంట మీద వేడి చేయాలి. తర్వాత దించి, చల్లారాక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మురబ్బాను ఆరునెలల వరకు వాడుకోవచ్చు.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html