Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

చెలరేగున్.. చప్పిడి కిచెన్ _ Enjoy Jujube Recipes

చెలరేగున్.. చప్పిడి కిచెన్ _ Enjoy Jujube(Indian Plum) Recipes

లడ్డు ఎలా ఉంటుంది?
తియ్యగా!
రేగుపండ్లతో చేసిన
లడ్డు కూడానా?!

పాయసం ఎలా ఉంటుంది?
తియ్యగా!
రేగు పాయసం కూడానా?

అప్పుడే ఏమయిందీ...
రేగు వడలున్నాయ్
రేగు ఒరుగులున్నాయ్
రేగు పచ్చడీ ఉంది!

చాలా, ఇంకా కావాలా?
ప్రశ్నలాపి, ప్రాక్టికల్స్‌కి దిగండి.
తియతియ్యని, పులపుల్లని
రుచులు చెలరేగడం చూడండి!


వడలు

కావలసినవి
రేగుపండ్లు - కప్పున్నర
బొబ్బర్లు (అలసందలు) - కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
కరివేపాకు - రెండురెమ్మలు
కొత్తిమీర - కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న గింజలు - అర కప్పు
నూనె - వేయించడానికి తగినంత

తయారి
బొబ్బర్లను గంటసేపు నీటిలో నానబెట్టి, వడకట్టి పక్కన ఉంచాలి.

రేగుపండ్లను కడిగి, ఆరబెట్టిన తర్వాత వాటిలోని గింజలు తీసేసి, గుజ్జు తయారుచేసుకోవాలి.

మిక్సర్‌జార్‌లో బొబ్బర్లు, రేగు పండ్ల గుజ్జు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. (రోట్లో దంచితే మరింత రుచిగా ఉంటుంది)

స్టౌ మీద కడాయి పెట్టి, నూనెపోసి కాగనివ్వాలి. తర్వాత రేగుమిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని, ఉండలుగా చేసి, చేత్తో అదిమి, కాగుతున్న నూనెలో వేయాలి. రెండువైపులా మంచిరంగు వచ్చే వరకు వేయించి, బయటకు తీయాలి.

ఇలా తయారుచేసుకున్న వడలను టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవాలి.

పచ్చడి

కావలసినవి
రేగుపండ్లు - కప్పు
పచ్చిమిర్చి - 5
పచ్చికొబ్బరి - అర కప్పు
వెల్లుల్లి - 5 రెబ్బలు
అల్లం - చిన్న ముక్క
పుదీనా ఆకులు - 10
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు
- 2 టేబుల్ స్పూన్లు

పోపు కోసం...
మినప్పప్పు - టీ స్పూన్
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెమ్మ, నూనె - 3 టీ స్పూన్లు

తయారి
శుభ్రమైన రేగుపండ్లను తీసుకొని, గింజలను వేరుచేసి, గుజ్జు తీసుకోవాలి. కడాయిలో టీ స్పూన్ నూనె వేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి.

వేయించి ఉంచుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అల్లం, రేగుపండ్ల గుజ్జు, ఉప్పు... వీటిని రోట్లో/మిక్సర్‌జార్‌లో వేసి (మెత్తగా లేదా కచ్చాపచ్చాగా) రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి.

స్టౌ మీద కడాయి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ పోపును పచ్చడిలో వేసి కలపాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి, రేగుపండ్ల పచ్చడి కలిపి తింటే రుచిగా ఉంటుంది.

ఒరుగులు

కావలసినవి
రేగుపండ్లు - కప్పు
ఎండుమిర్చి - 10
ఉప్పు - తగినంత
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - అర టీ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి
ముందుగా రేగుపండ్లను శుభ్రంగా కడిగి, తడి పోయేంతవరకు గాలికి ఆరనివ్వాలి. తర్వాత రోట్లో కొద్ది కొద్దిగా రేగుపండ్లను వేస్తూ కచ్చాపచ్చాగా దంచాలి. దీంట్లో అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, చేత్తో అదిమి, నూనె రాసిన ప్లేట్‌లో ఉంచాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అన్ని అప్పాలను ఒత్తి, ఎండలో ఆరబెట్టాలి. నాలుగైదు రోజులు ఎండలో బాగా ఆరనిచ్చి, గట్టిపడ్డాక నిల్వచేసుకోవాలి. వీటిని కావలసినప్పుడు ఏడాది పొడవునా తినవచ్చు.

పాయసం

కావలసినవి
రేగుపండ్లు - కప్పు, గోధుమరవ్వ - అరకప్పు
పాలు - గ్లాసుడు (250 ఎం.ఎల్)
నెయ్యి - 3 టీ స్పూన్లు, ఏలకుల పొడి - చిటికెడు
బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - తగినన్ని
(నెయ్యి వేసి వేయించాలి)
బెల్లం - తగినంత
సన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు

తయారి
రేగుపండ్ల నుంచి గింజలు వేరు చేసి, గుజ్జు చేసుకోవాలి. ఈ గుజ్జును మిక్సర్‌జార్‌లో వేసి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి, మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.

పాలు వేడిచేసి, అందులో వేయించిన గోధుమరవ్వ పోసి ఉడికించాలి.

రేగుపండ్ల గుజ్జు వేసి, ఉడికిన తర్వాత ఏలకుల పొడి, కొబ్బరిముక్కలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి, మరికాస్త ఉడికించి దించాలి.

వేడి వేడిగా సర్వ్ చేసేటప్పుడు పైన రేగుపండ్ల ముక్కలతో అలంకరించుకోవాలి.

లడ్డు

కావలసినవి
బెల్లం తరుగు - కప్పు
రేగుపండ్ల గుజ్జు - అరకప్పు
మినప్పప్పు - కప్పు
నెయ్యి - తగినంత

తయారి
స్టౌ మీద కడాయి పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, మినప్పప్పు వేయించాలి. మంచి వాసన వచ్చేవరకు వేయించి, దించి చల్లారనివ్వాలి. తర్వాత మినప్పప్పును మిక్సర్‌లో వేసి, పిండి చేయాలి.

గిన్నెలో బెల్లం తరుగు, రేగుపండ్ల గుజ్జు, మినప్పిండి, తగినంత నెయ్యి వేసి బాగా కలపాలి.

తగినంత పరిమాణంలో పై మిశ్రమాన్ని తీసుకొని, చిన్న చిన్న లడ్డూలు కట్టాలి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా, బలవర్ధకం కూడా.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html