Garlic Specials - వెల్లుల్లి రుచిగిల్లి
వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.నేచర్ సృష్టించిన నికార్సయిన మెడిసిన్ ఇది.
నేరుగా తినేవాళ్లు బుద్ధిమంతులు.
అడ్డం తిరిగేవాళ్లు?
ఏం పర్లేదు... వాళ్ల కోసం వెల్లులితో స్లైస్ చికెన్ చేద్దాం... ఫ్రైడ్ రైస్ చేద్దాం... కర్రీ... గ్రిల్డ్ ఫిష్....
ఇంకేముంది....
ప్లేట్ ముందు బైఠాయిస్తారు.
పెట్టింది తిని ఇంకాస్త కావాలని డిమాండ్ చేస్తారు. పెట్టకుంటే ఉద్యమిస్తారు.
ఈ ఆదివారం ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ట్రై చేయండి.
ఎంజాయ్ చేయండి.
గార్లిక్ ఫ్రైడ్ రైస్
బాస్మతి బియ్యం - కప్పు
బటర్ - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 15
ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
క్యాబేజీ తరుగు - పావు కప్పు
బ్రొకోలి - పావు కప్పు
ఎండు మిర్చి - 5 (మధ్యకు విరవాలి)
అజినమోటో - పావు టీ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
జీడిపప్పు పలుకులు - తగినన్ని
తాలింపు దినుసులు - తగినన్ని
బేబీకార్న్ - 4 (ముక్కలు చేయాలి)
వేయించిన వెల్లుల్లి రెబ్బల తరుగు - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి.
స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి.
అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని, ఆరనివ్వాలి.
అందులో బటర్, ఉప్పు వేసి కలపాలి.
పాన్‌లో టేబుల్ స్పూన్ నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
ఉల్లిపాయలు వేసి, గోధుమరంగు వచ్చేవరకు ఉంచి, బేబీకార్న్ ముక్కలు, క్యాబేజీ తరుగు, అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి.
దీంట్లో ఉప్పు, అన్నం వేసి క లిపి, 10-15 నిమిషాలు ఉంచి, చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి.
ఏదైనా గ్రేవీతో ఈ ఫ్రైడ్ రైస్‌ని సర్వ్ చేయాలి.
స్లైస్ చికెన్ విత్ హోల్ గార్లిక్
వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసినవి) - 10; బోన్‌లెస్ చికెన్ ముక్కలు (ఉడికించినవి) - 4; టొమాటో - 2; క్యాప్సికమ్ - 1, క్యారెట్స్ - 3, బేబీ కార్న్ - 4; ఉల్లి కాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - టేబుల్ స్పూన్; ఉప్పు, మిరియాల పొడి - తగినంత
తయారి:
స్టౌ మీద పాన్ పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. దీంట్లో క్యారెట్, బంగాళదుంప, బేబీకార్న్ ముక్కలు, ఉల్లి కాడ ల తరుగు వేసి, కలిపి, ఉడికించాలి. తర్వాత ఉడికించి, చిన్న చిన్న ముక్కలు చేసిన చికెన్‌ను కలపాలి. కూరగాయ ముక్కలు, చికెన్ ముక్కలు ఉడికాక ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి కలిపి దించాలి.
గార్లిక్ కర్రీ
వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా.
చింతపండు - 75 గ్రా.; నూనె - 3 టేబుల్ స్పూన్లు
మెంతులు - టీ స్పూన్; సోంపు - అర టీ స్పూన్
కరివేపాకు - రెమ్మ; ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 3 (నిలువుగా కట్ చేయాలి)
కారం - అర టీ స్పూన్; పసుపు - అర టీ స్పూన్
టొమాటో - 2 (సన్నగా తరగాలి)
తయారి:
చింతపండులో వేడినీళ్లు పోసి, అరగంట నానబెట్టాలి. గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టౌ మీద గిన్నె పెట్టి, టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక 50 గ్రా.ల వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అందులోనే అర టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి, దించాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి.
అదే గిన్నెలో మిగతా నూనె వేసి, సోంపు, మెంతులు వేయించాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరో ఐదు నిమిషాలు వేయించి, పసుపు, కారం, తరిగిన టొమాటోలు కలిపి ఉడికించాలి.
వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పేస్ట్ వేసి, వేయించాక చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. వెల్లుల్లి బాగా ఉడికి, మిశ్రమం చిక్కబడినాక మంట తీసేయాలి. కొత్తిమీర చల్లి, సర్వ్ చేయాలి. ఈ కర్రీ చపాతీ, పూరీలోకి బాగుంటుంది.
గార్లిక్ గ్రిల్డ్ ఫిష్
బోన్‌లెస్ ఫిష్ ముక్కలు - 4 (పెద్దవి); ఉల్లిపాయ - 1 (గుండ్రంగా కట్ చేసుకోవాలి); టొమాటో - 1 పెద్దది (ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు - కొద్దిగా; నిమ్మకాయ - 1 (సగం ముక్క రసం తీసి పక్కనుంచాలి); మయోనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) - టీ స్పూన్; అల్యూమినియం ఫాయిల్ - 1; ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి - తగినంత
తయారి:
చేపముక్కలను శుభ్రపరిచి, నీళ్లన్నీ పోయేవరకు ఉంచాలి. వీటికి నిమ్మరసం రాయాలి. ఆ తర్వాత వెల్లుల్లి పొడి, ఉప్పు, మిరియాల పొడి రాయాలి. ఆ తర్వాత మయోనైజ్ పూయాలి. అల్యూమినియం ఫాయిల్‌ను పెద్దగా, చేప ముక్కలు పట్టేంతగా కట్ చే సుకొని, మధ్యలో పెట్టి, పైన ఉల్లిపాయ ముక్కలు పెట్టాలి. ఆ పైన గుండ్రంగా తరిగిన టొమాటో ముక్కలు పెటి, ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. ఆ పైన నచ్చిన ఇతర కూరగాయల ముక్కలు, కొత్తిమీర వేసి చేప ముక్క కదలకుండా ఫాయిల్‌ని దగ్గరకు చుట్టి, చివరలు మూసేయాలి. అవెన్‌లో 375 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో పది నిమిషాలు కుక్ చేసి, తీయాలి. ఫాయిల్ తీసి, ఆలివ్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
నోట్: స్టౌ మీద గ్రిల్ చేసినా, అవెన్‌లో కుక్ చేసినా, ఫాయిల్ కాలిపోకుండా జాగ్రత్త పడాలి.

