vinAyaka chaviti Specials - చవితి మధురం
అవిఘ్నాల కోసం మనం విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.కాని- విఘ్నాల కోసం ప్రార్థించబుద్ధవుతోంది.
పెట్రోల్ ధర పెంచబోతోంటే విఘ్నం కలిగించు స్వామీ...
గ్యాస్ ధర పెంచబోతోంటే విఘ్నం కలిగించు స్వామి...
డీజిల్ ధర మరి పెరగకుండా విఘ్నం కలిగించు స్వామీ...
ప్రజలకు చేటు తెచ్చే పనులన్నింటికీ విఘ్నం కలిగించు స్వామీ...
అప్పుడే నీ చవితి మధురం.
ఈ పండుగ మధురం.
ఈ తీపి మధురాతి మధురం...
ఉండ్రాళ్లు (UmDrALlu)
బియ్యపురవ్వ- కప్పు; నీళ్లు - ఒకటిన్నర కప్పులు; శనగపప్పు - అరకప్పు ; జీలకర్ర - టీ స్పూన్; నూనె - మూడు టీ స్పూన్లు.
తయారి:
ముందుగా మందపాటి పాత్రలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. దింపే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.
కుడుములు (kuDumulu)
బియ్యపు రవ్య - గ్లాసు; శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము - కప్పు; ఉప్పు - తగినంత
తయారి:
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి, దీనిలో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోసి కలపాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించి, తర్వాత దించి, కొబ్బరి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ప్రసాదానికి తీసుకోవాలి.
జిల్లేడుకాయలు(jillEDukAyalu)
బియ్యం రవ్వ - 2 కప్పులు; తరిగిన బెల్లం - కప్పు; పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు; గసగసాలు - టీ స్పూన్; బాదం, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ - 2 టీ స్పూన్లు ; నెయ్యి - కొద్దిగా; ఏలకుల పొడి - చిటికెడు
తయారి:
గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్ది నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని, వేయించిన గసగసాలు, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకొని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత నివేదనకు ఉపయోగించాలి.
బెల్లం తాలికలు (bellam tAlikalu)
బియ్యప్పిండి - గ్లాసు; బెల్లం - 2 గ్లాసులు; ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా ; జీడిపప్పు, బాదం పలుకులు - తగినన్ని; ఏలకుల పొడి - చిటికెడు
తయారి:
గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి. ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి.
కోవా లడ్డు (kOvA laDDu)
పాలపొడి - 200 గ్రా; కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రా; నెయ్యి - 100 గ్రా; కొబ్బరి తురుము - కప్పు; బెల్లం - 250 గ్రా; బాదం, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ (నెయ్యిలో వేయించినవి) - 25 గ్రా.
తయారి:
ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, అవెన్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి. అవెన్‌లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది. కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలు(నిమ్మకాయ పరిమాణం)గా చేయాలి. కోవా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి.
నోట్: మౌల్డ్ సాయంతో చేయడం లేదా చేత్తో మోదక్‌లాగ చేసి, సన్నని పుల్లతో నిలువుగీతలు పెట్టాలి.
వీట్ లడ్డు (wheat laDDu)
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు; నెయ్యి- అర కప్పు; బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్ స్పూన్లు; పంచదార పొడి - 3/4 కప్పు; ఏలకుల పొడి- అర టీ స్పూన్; బాదం పలుకులు - 5; కిస్‌మిస్ - టేబుల్‌స్పూన్; శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు.
తయారి:
బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక గోధుమపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి చక్కగా వేగేంతవరకు కలుపుతూనే ఉండాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించాలి. అందులో ఏలకుల పొడి వేసి, తర్వాత గోధుమపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన గోధుమపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి.
గుజియా (gujiyA) / కజ్జికాయలు (kajjikAyalu)
నూనె - వేయించడానికి తగినంత; మైదా - 500 గ్రా; నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు; ఫిల్లింగ్ కోసం... కోవా - 500 గ్రా; ఏలకుల పొడి - అర టీ స్పూన్; బాదంపప్పు - 25 గ్రా; కిస్‌మిస్ - 25 గ్రా; ఎండు కొబ్బరి తురుము - 25 గ్రా; పంచదార పొడి - 350 గ్రా.
తయారి:
మైదాలో నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి. పలచని తడి క్లాత్‌లో చుట్టి ఉంచాలి. కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, చల్లారనివ్వాలి. మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి. ఇలా గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.
నోట్: గుజియాలను తయారు చేయడానికి మార్కెట్‌లో మౌల్డ్‌లు లభిస్తాయి.
బూందీ లడ్డు (bUmdI laDDu)
శనగపిండి-కప్పు; రవ్వ కేసరి - టీ స్పూన్; ఏలకులపొడి-చిటికెడు; బియ్యప్పిండి- టేబుల్ స్పూన్; బేకింగ్ పౌడర్ - చిటికెడు; ఎండు కర్బూజ గింజలు - టేబుల్‌స్పూన్; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్; నూనె- 2 కప్పులు; పంచదార-2 కప్పులు; నీళ్లు - కప్పు.
తయారి:
శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి, తగినన్ని నీళ్లు పోసి, చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. కడాయి లో నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి. కప్పు నీళ్లు పోసి పంచదార పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే బూందీని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి. తర్వాత తగినంత పరిమాణంలో జీడిపప్పులు చేర్చుతూ లడ్డూలు కట్టుకోవాలి.
బేసిన్ లడ్డు (basin laDDu)
శనగపిండి - ఒకటిన్నర కప్పు; నెయ్యి - అర కప్పు; బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్ స్పూన్లు; పంచదార పొడి - 3/4 కప్పు ; ఏలకుల పొడి - అర టీ స్పూన్; బాదం పలుకులు - 5; కిస్‌మిస్ - టేబుల్‌స్పూన్ ; శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు
తయారి:
బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా గోధమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి. పిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో ఏలకుల పొడి కలపాలి. తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి. మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి.

