bachchali for health - ఆరోగ్యానికి నెచ్చెలి బచ్చలి
బచ్చలి ఆకు... నిన్న మొన్నటి వరకు మన ఇంటి పెరడులో...తీగలు తీగలుగా పందిరికి ఎగబాగుకుతూనో, కిటికీ పట్టుకుని పారాడుతూనో, గుమ్మానికి వేలాడుతూనో కనిపించేది.
బచ్చలి ఆకు... పచ్చని ఆకులతో ఇంటిల్లిపాదికి పుష్టికరమైన విందును ఇచ్చేది.
ఈ మధ్య మార్కెట్‌కి వెళితే తప్ప ఇళ్లల్లో కనిపించడం గగనమైన బచ్చలి ఆకును తీసుకురండి. పోషకాలెన్నో మూటగట్టుకున్న బచ్చలి కట్టను విప్పదీసి... రకరకాల వెరైటీలు చేసి ఇంటిల్లిపాదికి హెల్తీ విందు ఇవ్వండి.
బచ్చలి సూప్
బచ్చలి - 2 కప్పులు,దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 2, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - రెమ్మ, ఉల్లితరుగు- 3 టీ స్పూన్లు, వెల్లుల్లి - 3, పచ్చిమిర్చి - 1, బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు
(2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి పక్కన ఉంచాలి), క్రీమ్ (పాల మీగడను చిలికినది) - టీ స్పూన్, నల్లమిరియాల పొడి - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత
తయారి:
పాన్‌లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వేసి నాలుగు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బచ్చలి ఆకులు, పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్లు చేర్చి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టాలి. లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క తీసేయాలి. ఉడికిన బచ్చలిఆకు, ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిపి మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వడకట్టిన నీటిని గ్రైండ్ చేసిన ప్యూరీలో కలిపి, సన్నని మంట మీద మిశ్రమం చిక్కబడేంతవరకు ఉడికించాలి. తర్వాత ఉప్పు, మిరియాలపొడి కలిపి, మరో ఎనిమిది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బియ్యప్పిండి కలిపి, సూప్ చిక్కబడేంతవరకు ఉంచాలి. చివరగా క్రీమ్ వేయాలి.
చెర్రీ టొమాటోలు, ఉడికించిన ముల్లంగి బాల్స్‌తో అలంకరించి ఈ సూప్‌ని వేడి వేడిగా సర్వ్ చేయాలి.
కంద బచ్చలి
బచ్చలి - ఒక కట్ట
కంద - పావు కిలో
అల్లం, పచ్చిమిర్చి ముద్ద - టీ స్పూన్
ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
చింతపండు రసం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
ఆవపొడి - అర టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
నూన్ - 3 టీ స్పూన్లు
తాలింపు దినుసులు - తగినన్ని
తయారి:
బచ్చలిఆకులు శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి. కంద చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో కందముక్కలు, బచ్చలి ఆకు, తగినంత నీరు పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి, వేగాక ఉల్లి తరుగు కలిపి, వేగనివ్వాలి. బచ్చలికూర, కందముక్కలు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాలు అయ్యాక స్టౌ మీద నుంచి దించుకోవాలి. కొద్దిగా చల్లారాక అర టీస్పూన్ నూనెలో ఆవపొడి కలిపి ఉంచిన పేస్ట్‌ను ఇందులో వేసి కలుపుకోవాలి.
బచ్చలి పులుసు
బచ్చలి - 2 కట్టలు,
శనగపప్పు - కప్పు,
చింతపండు రసం - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 3, ఉప్పు - తగినంత,
తాలింపు కోసం: - ఆవాలు, పెరుగు మిరపకాయలు, మెంతులు, కరివేపాకు, ఇంగువ - తగినన్ని
తయారి:
శనగపప్పును గంట ముందుగా నానబెట్టుకోవాలి. స్టౌపై పాన్ పెట్టి నూనె వేసి శుభ్రంగా కడిగిన బచ్చలికూర, పచ్చిశనగపప్పు, చింతపండు రసం, ఉప్పు, రెండు కప్పుల నీరు పోసి ఉడికించి దించాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, పెరుగు మిరపకాయలు, మెంతులు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపును బచ్చలిపులుసులో వేయాలి. ఇది అన్నంలో కలుపుకొని, అప్పడాలు నంచుకొని తింటే సూపర్.
బచ్చలి, నువ్వుల పచ్చడి
బచ్చలి- 1 కట్ట
పచ్చిమిర్చి - 5,
మినప్పప్పు - టీ స్పూన్, నువ్వులు - టీ స్పూన్, మెంతులు - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, జీలకర్ర - అర టీ స్పూన్,
చింతపండు - కొద్దిగా,
వెల్లుల్లి - 4 రెబ్బలు
నూనె - 2 టీ స్పూన్లు
తయారి:
స్టౌపై కడాయి పెట్టి నూనె వేసి పచ్చిమిర్చి, నువ్వులు, పప్పు దినుసులు వేయించాలి. వేగాక వాటిని తీసి పక్కన పెట్టాలి. తరువాత బచ్చలి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టి, పై మిశ్రమంలో వేయాలి. ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుంది.
బచ్చలి పకోడి
బచ్చలి - 2 కట్టలు
శనగపిండి - కప్పు
బియ్యప్పిండి - కప్పు
కార్న్‌ఫ్లోర్ - కప్పు
పెరుగు - కప్పు
కారం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్
తినే సోడా - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి - 2 నూనె - వేయించడానికి తగినంత
తయారి:
వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో... శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన బచ్చలి, ఉల్లి తరుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చితో పాటుగా శనగపిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌లను పెరుగుతో కలిపి పక్కన ఉంచాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె వేడయ్యాక కలిపిన బచ్చలి మిశ్రమాన్ని పకోడీల్లా వేసి, వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

