Ice varities - ఐస్‌కాంతం
Summer Specialసాయంత్రమైతే సూర్యుడు బ్రేక్‌డౌన్ అవుతాడు. చల్లచల్లగా నోటికి చాక్లెట్ ఐస్‌క్రీమ్ చిక్కితే పుంజుకొని పక్క దేశాలకు పయనమవుతాడు. చంద్రుడు వెనిల్లా తిని వెన్నెల కాయడానికి తరలివస్తాడు. తోటలో పండిన మ్యాంగో వాంగో అని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో నోరూరిస్తుంది.చాక్‌లెట్టూ, నట్టూ, పుల్ల తియ్యని ఆరెంజీ... క్రీమ్ క్రీమ్ కావడానికి ఓమ్‌క్రీమ్ అంటాయి.ఏ కాలానికైనా ఐస్‌క్రీమ్ బాగుంటుంది.ఎండాకాలంలో మాత్రం దానికి గోల్డెన్ కప్ అందుతుంది.బజారులో దొరికేది ఎందుకు? ఇంట్లో ట్రై చేయండి.హెల్దీగా ఎంజాయ్ చేయండి.
చాక్లెట్ ఐస్‌క్రీమ్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.పంచదార - 150 గ్రా.
చాక్లెట్ ఫ్లేవర్ పదార్థాలు (చాక్లెట్ బోర్న్‌విటా లేదా బూస్ట్, లేదా హార్లిక్స్) - 250 గ్రా.
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
తయారి: మిల్క్ బాయిలర్ (పాల కుకర్)లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా, రుచిగా ఉంటుంది. పాల మిశ్రమం చల్లారక చాక్లెట్ పదార్థాలు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు ఉంచి, తర్వాత సర్వ్ చేసుకోవాలి.
మ్యాంగో ఐస్‌క్రీమ్
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.
పంచదార - 150 గ్రా.
మ్యాంగో పల్ప్ - 250 గ్రా.
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
తయారి: మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది. పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి.
క్యారమెల్ ఐస్‌క్రీమ్
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.
క్యారమెల్ - 250 గ్రా.
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
క్యారమెల్ తయారి:
500 గ్రా.ల పంచదార తీసుకొని స్టౌ పైన పాన్ పెట్టి అందులో పోసి వేడిచేయాలి. పంచదార అడుగు అంటకుండా 100 గ్రా.ల బటర్ వేసి కలపాలి. పంచదార వేడెక్కి కరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగాక అందులో 250 ఎం.ఎల్ హోల్‌మిల్క్ క లిపి వేడి చేయాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని క్యారమెల్ పేస్ట్ అంటారు. ఐస్‌క్రీమ్‌లో క్యారమెల్‌ని కలిపితే అదనంగా పంచదారను చేర్చనవసరం లేదు.
తయారి: మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది. పాల మిశ్రమం చల్లారక క్యారమెల్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టాలి.
ఆరెంజ్ ఐస్‌క్రీమ్
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.
పంచదార - 150 గ్రా.
ఆరెంజ్ పల్ప్ - 250 గ్రా. (ఆరెంజ్ పై తొక్క,
గింజలు తీసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి)
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
తయారి: మిల్క్‌బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టి మరిగించాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ, బాగా కలపాలి. మరికొద్ది సేపు ఈ మిశ్రమం కాగిన తర్వాత అందులో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లార్చితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా, రుచిగా తయారవుతుంది. పాల మిశ్రమం చల్లారక ఆరెంజ్ పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటల సేపు ఉంచాలి.
నట్స్ ఐస్‌క్రీమ్
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 % ఫ్యాట్ ఉన్నది)-230 గ్రా.
పంచదార - 150 గ్రా.
నట్స్(జీడిపప్పు, బాదంపప్పు,
వాల్‌నట్స్, పిస్తా, పీనట్స్ - 100 గ్రా.
ఏలకుల పొడి - చిటికెడు
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
తయారి:
మిల్క్‌బాయిలర్ (పాలకుకర్)లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది. పాల మిశ్రమం చల్లారక నట్స్ అన్నీ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాల సేపు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు నట్స్‌తో గార్నిష్ చేయాలి.
అంజీర్ ఐస్‌క్రీమ్
హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.
పంచదార - 150 గ్రా.
అంజీర్ పల్ప్ - 250 గ్రా. (అంజీర్ పండ్లను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి)
స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.
తయారి:
మిల్క్ బాయిలర్‌లో పాలను మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ, బాగా కలిపి, మరగనివ్వాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాల మిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. మిశ్రమాన్ని ఎంత త్వరగా చల్లార్చితే ఐస్‌క్రీమ్ అంత రుచిగా, మృదువుగా తయారవుతుంది. పాల మిశ్రమం చల్లారక అంజీర్ పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు పండ్ల ముక్కలు, క్రీమ్‌తో గార్నిష్ చేయాలి.
ఐస్‌క్రీమ్ చిట్కాలు
*రుచిని బట్టి వాడే పదార్థాలను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు.
*ఐస్‌క్రీమ్‌ను డీప్‌ఫ్రీజర్ నుంచి బయటకు తీసి, పది నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి. దీనిని థాయింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఐస్‌క్రీమ్ మరీ గట్టిగా ఉండదు.
*సహజసిద్ధమైన పండ్లతో, పదార్థాలతో ఐస్‌క్రీమ్‌లను తయారుచేసుకోవాలి. కృత్రిమమైన ఫ్లేవర్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి.
*ఐస్‌క్రీమ్ మేకింగ్‌లో ఎడిబుల్ స్టెబిలైజర్లు వాడుతారు. ఏ పదార్థాలలో ఎన్ని క్యాలరీలు, ఎంత ఫ్యాట్ ఉందో లెక్కించి, దానిని బట్టి పదార్థాలను కలుపుతారు.
*ఐస్‌క్రీమ్‌ను సర్వ్ చేసే ముందు గూస్‌బెర్రీ, స్ట్రాబెర్రీ.. వంటి పండ్లను మెత్తగా గ్రైండ్ చేసి ఆ రసాన్ని, చాక్లెట్‌ను మెల్ట్ చేసిన మిశ్రమాన్ని గార్నిష్‌కి వాడచ్చు.
*ఐస్‌క్రీమ్‌ను ప్లెయిన్‌గా కాకుండా నచ్చిన పండ్ల ముక్కలతో, కాలాజామూన్‌తో సర్వ్ చేస్తే బాగుంటుంది.
*ఐస్‌క్రీమ్‌ను కప్పుల్లోనే కాకుండా, విడిగా కోన్‌లను కొనుగోలు చేసి, దాంట్లోనూ సర్వ్ చేయచ్చు.

