SrIrAmanavami Special - వడపప్పుపానకం
రాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?
రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?
రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?
శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి.
తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి.
హరికథలు... బుర్రకథలు... పాటలు...
శ్రీరామ నీ నామమెంతో రుచిరా...
పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి.
పానకం - వ డపప్పు... ఎందుకు?
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
పానకం
కావలసినవి:
పెసరపప్పు - అర కప్పు, కీరా - ఒక ముక్క, పచ్చిమిర్చి - 1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత
తయారి:
పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి.
చలిమిడి
కావలసినవి: బియ్యం - 400 గ్రా. (గంటసేపు నీళ్లలో నానబెట్టి, ఆరాక, పిండి చేయాలి), బెల్లం తురుము - 200 గ్రా. నీళ్లు - 200 ఎం.ఎల్, గసగసాలు - 10 గ్రా. జీడిపప్పు (పలుకులు) - 20 గ్రా. ఎండుకొబ్బరి తురుము - 20 గ్రా. నెయ్యి - 20 గ్రా. ఏలకుల పొడి - అర టీ స్పూన్
తయారి:
కడాయిలో గసగసాలు వేసి వేయించి తీయాలి. అదే కడాయిలో నెయ్యి వేసి, వేడయ్యాక కొబ్బరి తరుగు, జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. మరో గిన్నెను స్టౌ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. అందులో బెల్లం వేసి, లేత పాకం పట్టుకోవాలి. స్టౌ సిమ్‌లో పెట్టి, బెల్లం పాకంలో బియ్యం పిండి, జీడిపప్పు, కొబ్బరి, ఏలకుల పొడి, గసగసాలు వేసి ముద్దలు లేకుండా బాగా కలిపి, దించాలి. వేడి తగ్గాక, నెయ్యి చేతులకు రాసుకుంటూ, పిండి ముద్దలు తీసుకొని చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి.
పండుగ తీపి
రవ్వ బూరెలు
తయారి:
తగినన్ని నీళ్లు పోసి మినప్పప్పు, బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి, తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి, రవ్వ వేయించి తీయాలి. మరొక గిన్నెలో పాలు, పంచదార కలిపి, బాగా చిక్కపడే వరకు మరిగించాలి. అందులో ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్, రవ్వ వేసి కలిపి, ఉడికించాలి. నానిన మినప్పప్పు-బియ్యాన్ని వడకట్టి, మెత్తగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా నీరు పోసి జారుగా కలపాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. రవ్వ ముద్దను ఉండలా చేసి, పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి, తీయాలి.
రవ్వ లడ్డు
రవ్వ - 250 గ్రా., పంచదారపొడి- 250 గ్రా., పచ్చికొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 50 గ్రా., ఏలకుల పొడి - అర టీ స్పూన్, జీడిపప్పు పలుకులు - 15 గ్రా., వేడి పాలు - 40 ఎం.ఎల్
తయారి:
పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు వేయించి, తీయాలి. తర్వాత కొబ్బరి తురుము వేయించి తీయాలి. అదే పాన్‌లో నెయ్యి వేసి, రవ్వ వేయించాలి. అందులో ఏలకుల పొడి, కొబ్బరి, పంచదార, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలపాలి. తర్వాత వేడి పాలు పోసి, కలిపి, దించాలి. మరికొన్ని పాలు కలుపుతూ, రవ్వ మిశ్రమాన్ని లడ్డూలు చేయాలి.
రవ్వ హల్వా
రవ్వ - 250గ్రా. పంచదార - 500గ్రా. పాలు - 2 లీటర్లు, నెయ్యి - 100 గ్రా., కుంకుమపువ్వు - చిటికెడు (వేడి పాలలో కలిపి పక్కన ఉంచాలి), జీడిపప్పు పలుకులు - 10, కిస్‌మిస్ - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో రవ్వను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి పంచదార, కుంకుమపువ్వు కలిపిన పాలు పోసి, సన్నని మంటమీద ఉడికించాలి. ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. హల్వా పూర్తయ్యాక ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలిపి దించుకోవాలి.
రవ్వ స్వీట్ కచోరీ
వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు - 40 గ్రా., ఖర్జూరం - 10 గ్రా., మైదా - 500 గ్రా., డాల్డా - 100 గ్రా., రవ్వ - 200 గ్రా., పంచదార - 400 గ్రా., నీళ్లు- 250 గ్రా., నూనె - వేయించడానికి తగినంత.
తయారి:
మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి. దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి. కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి. ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.

