Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

coriander varities - కొత్తరుచుల కొత్తిమీర

coriander varities - కొత్తరుచుల కొత్తిమీర

కట్టలుగా కట్టే ఆకుకూర కొన్నా ముక్కలుగా కొట్టే మాంసాహారమైనా
కామన్‌గా ఉండాల్సింది మాత్రం కొత్తిమీరే.
రుచిగల మంచి కూర నలపాకం చేశాక ఇంపొదవెడు ఉప్పుతో పాటు...
కాస్తంత కొత్తిమీర దట్టించకపోతే నాలుక మీద రుచుల ఆనకట్ట తెగదు.
కరివేపాకును పారేస్తాం... కానీ
కొత్తిమీరను పారేయం... నమిలేస్తాం. అదీ దాని ప్రాధాన్యం.
ఆకు మీద అరవై చీలికలు ఉంటాయేమోగానీ...
దాని వల్ల కలిగే రుచి మీద ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు.
ఆ తర్వాత నాలుక మీద ఊరే టేస్టు మీద రెండో మాటకు తావుండదు.
రుచికీ, అలంకరణకూ... రెండింటికీ స్పెషల్ అయిన
కొత్తిమీరతోనే కొత్త వంటకాలు చేయండి.
కొత్తరుచులను అన్వేషించండి.


కొత్తిమీర కొబ్బరి పెరుగుపచ్చడి

కావలసినవి:
కొత్తిమీర - ఒక కట్ట (చిన్నది), కొబ్బరితురుము - కప్పు,
పచ్చిమిర్చి - కొద్దిగా, ఉప్పు - తగినంత, పెరుగు - కప్పు, వెల్లుల్లి - నాలుగు రేకలు, ఎండుమిర్చి - ఆరు,
ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను,
మెంతులు - టీస్పూను, పచ్చిశనగపప్పు - టీ స్పూను,
మినప్పప్పు - టీ స్పూను, పసుపు - కొద్దిగా

తయారి:
ముందుగా కొత్తిమీరను శుభ్రం చేసి కడిగి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక పోపు సామాన్లు ఒక్కటొక్కటిగా వేసి దోరగా వేగిన తరవాత దింపి చల్లారనివ్వాలి. మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తరవాత కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు వేసి మరోసారి తిప్పాలి. చివరగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసేయాలి. ఒకపాత్రలో చిక్కగా చిలికిన పెరుగు వేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి మరోమారు కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, టొమాటో, దోసకాయ ముక్కలతో అలంకరించుకోవాలి.

కొత్తిమీర తీపి పచ్చడి

కావలసినవి:
కొత్తిమీర - రెండుకట్టలు, చింతపండు - కొద్దిగా, బెల్లం - మూడు టీ స్పూన్లు , ఉప్పు - తగినంత, నూనె - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6, మెంతులు - పావు టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు

తయారి:
ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తడి ఆరనిచ్చి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఒకదాని తరువాత ఒకటి వేసి దోరగా వేగిన తరవాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక కొత్తిమీర, చింతపండు వేసికొద్దిగా వేయించి తీసేయాలి. తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా గ్రైండ్ చేశాక, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒకచిన్న గిన్నెలోకి తీసుకుని వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు వేసి కలపాలి. (ఉల్లిపాయ ఇష్టపడని వారు వాడకపోయినా పరవాలేదు).

కొత్తిమీర రైస్

కావలసినవి:
బియ్యం - పావు కేజీ, ఏలకులు - 2, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు కప్పులు, బాదం పప్పు - 10, జీడిపప్పులు - 10, కిస్‌మిస్ - 10, ఉప్పు - తగినంత, నూనె - చిన్న గిన్నెడు, నెయ్యి - రెండు టీ స్పూన్లు

తయారి:
బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కొలత బియ్యానికి ఒకటిన్న నీరు పోసి అన్నం వండి పక్కన ఉంచాలి. కొత్తిమీర ఆకులను తుంపి శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసిపక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక అందులో ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరవాత కొత్తిమీర ఆకులు వేసి పచ్చివాసన పోయేలా వేయించి దింపేయాలి. మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో బాదంపప్పు, జీడిపప్పు, కిసిమిస్‌లను వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో అన్నం వేసి పొడి పొడిలాడేలా చేయాలి. అందులో వేయించి ఉంచుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌లు వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి. దీనికి పెరుగుచట్నీ కాంబినేషన్ బావుంటుంది.

కొత్తిమీర నిమ్మరసం కారం

కావలసినవి:
కొత్తిమీర - రెండుకట్టలు,పచ్చిమిర్చి - ఆరు, చింతపండు - కొద్దిగా, ఉప్పు - కొద్దిగా, నిమ్మరసం - రెండు టీ స్పూన్లు

పోపుకోసం:
ఎండుమిర్చి - 2, శనగపప్పు - అర టీస్పూను, మినప్పప్పు - అరటీస్పూను, ఆవాలు - టీస్పూను, జీలకర్ర - టీస్పూను, నూనె - టీ స్పూను.

తయారి:
ముందుగా కొత్తిమీరను శుభ్రం చేసి బాగా కడిగిపక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో వేయించి ఉంచుకున్న పోపు, నిమ్మరసం వేసి ఒకసారి కలిపి పావుగంట తరవాత వాడుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

కొత్తిమీర నిల్వ పచ్చడి

కావలసినవి:
కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆవాలు -రెండు టీ స్పూన్లు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - 100 గ్రా., ఇంగువ - టీ స్పూను, బెల్లం -50 గ్రా.

తయారి:
కొత్తిమీరను కడిగి, తరిగి, పూర్తిగా ఆరనివ్వాలి. చింతపండులో కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి ఉడకనివ్వాలి. బాగా ఉడికి, చిక్కబడిన తరవాత దించి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ వేసి, కాగిన తరవాత ఆ నూనె తీసి వేరే పాత్రలో పోసి పక్కన ఉంచాలి. తరవాత అదే బాణలిలో మరి కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర వేయించి, మరో గిన్నెలోకి తీసి ఉంచాలి. ఎండుమిర్చి కూడా వేయించి, పక్కన ఉంచాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో కొత్తిమీర పచ్చివాసన పోయేలా వేయించి దించేయాలి. మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి, తరవాత చింతపండు గుజ్జు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసేయాలి. దీనిలో వేయించిన పోపు, ఇంగువ కాచిన నూనె పోసి కలపాలి. ఇది నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది.

కొత్తిమీర - చిట్కాలు
కొత్తిమీరను పచ్చళ్లలోనూ, సాస్‌లలోనూ, కూరల్లోనూ, సూపుల్లోనూ వాడుతున్నారంటే ఆహారపదార్థాలలో ఔషధాన్ని కలుపుతున్నట్టే.

వేరుతో ఉన్న కొత్తిమీరను కొనుగోలు చేయాలి. మస్లిన్ క్లాత్ బ్యాగ్‌లో కొత్తిమీరను చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

వెల్లుల్లి, ఉల్లి, కొన్ని చుక్కల నిమ్మరసం, పుదీనా, బెల్లం, పసుపు, ఉసిరి, ఎండు మామిడిపొడి, కొత్తిమీర కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఆహారంతో పాటుగా కొద్దిగా తీసుకోవాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది.

కొత్తిమీర ఆకులు, గులాబీ నీళ్లతో కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటే తీవ్రత పెరిగిన దగ్గు తక్కువవుతుంది.

కొత్తిమీర ఆకులను నుదుటి మీద పెట్టుకొని పడుకుంటే త్వరగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్య బాధించదు.

బహిష్టు సమయంలో రుతుస్రావం అధికంగా ఉంటే కొత్తిమీర రసాన్ని గంజిలో కలిపి సేవిస్తే తగ్గుముఖం పడుతుంది.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html