Bread is best - బ్రెడ్ ఈజ్ బెస్ట్
Indian Recipes
బ్రెడ్‌లో ఒక ముఖ్యగుణం గమనించారా?అది ముక్కలుగా ఉంటుంది. అంటే పంచుకొని తినమని చెబుతుంది.
ముప్పయి వేల ఏళ్ల క్రితమే బ్రెడ్ ఉనికిలో ఉందట. పదివేల ఏళ్ల క్రితం నుంచి అది మనిషి జీవితంలో విడదీయరానిదిగా మారిందట.
మనకు అన్నంలాగా పాశ్చాత్యులకు బ్రెడ్డే పరబ్రహ్మ స్వరూపం.
జ్వరం వస్తే తినే వస్తువు నుంచి మన సమాజంలో బ్రెడ్ ఒక వంటకంగా మారడానికి చాలా కాలమే పట్టింది. మనవాళ్లు కూడా బ్రెడ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. మన జీలకర్రను, ధనియాలను కలిపి దానితో కొత్త వంటకాలు చేస్తున్నారు. ఫ్రిజ్‌లో బ్రెడ్ ఉంటే బుద్ధిపుట్టినప్పుడల్లా ఓ వెరైటీ. ఈ సండే... ఈ వెరైటీ....
వెజ్ శాండ్‌విచ్
బ్రెడ్ స్లైస్‌లు - 2, లెట్యూస్ - 2 ఆకులు, కీరా - 2 ముక్కలు (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి), ఉల్లిపాయ - (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి) 2 ముక్కలు, టొమాటో - గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేసిన 2 ముక్కలు, ఛీస్ స్లైస్ - 1, ఉప్పు - చిటికెడు, పసుపు - చిటికెడు, మిరియాలపొడి - చిటికెడు, ఫ్రెంచ్ ఫ్రైస్ - 5 (బేకరీలలో లభిస్తాయి), పుదీనా చట్నీ - పావు టీ స్పూన్, కొలెస్లా సలాడ్ (ఉడికించిన క్యాబేజీ, బంగాళదుంప, క్యారెట్ కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లినది) - అర టీ స్పూన్
తయారి:
ముందుగా కూరగాయలను శుభ్రపరుచుకొని కావలసిన విధంగా కట్ చేసుకోవాలి. త్రికోణాకారంలో కట్ చేసుకున్న రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకోవాలి. ఓవెన్‌లో గ్రిల్ చేయాలి. బయటకు తీసిన బ్రెడ్ స్లైసులకు పుదీనా చట్నీ రాయాలి. ఒక బ్రెడ్ మీద లెట్యూస్, టొమాటో, కీరా, ఉల్లిపాయ, ఛీజ్ స్లైస్‌లను... ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. ఉప్పు, మిరియాల పొడి చల్లి, మరొక బ్రెడ్ స్లైస్‌ను దీనిపైన అమర్చాలి. దీనిని ఫ్రెంచ్ ఫ్రైస్‌తో సర్వ్ చేయాలి.
(శాండ్‌విచ్‌ను గ్రిల్ చేయకుండా సాదాగా కూడా తయారుచేసుకోవచ్చు.)
చికెన్ గోల్డెన్ కాయిన్స్
బ్రెడ్ స్లైస్‌లు - 4, చికెన్ కీమా - 50 గ్రా, ఉప్పు - తగినంత, గుడ్డు - ఒకటి, తెల్ల నువ్వులు - 2 టీ స్పూన్లు, అల్లం - వెల్లుల్లి తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - టీ స్పూన్, పండుమిరపకాయల పేస్ట్ - అర టీ స్పూన్, నూనె - వేయించడానికి తగినంత
తయారి:
కటర్‌తో బ్రెడ్ స్లైసులను గుండ్రటి షేప్‌లో కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో నువ్వులు మినహా మిగతా పదార్థాలన్నీ వేసి కలిపి పక్కనుంచాలి. చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని గుండ్రంగా కట్ చేసిన బ్రెడ్‌పైన అమర్చి, దానిపైన కొద్దిగా నువ్వులు చల్లి, వేళ్లతో కొద్దిగా అదమాలి. కడాయిలో నూనె పొసి, వేడయ్యాక తయారుచేసుకున్న బ్రెడ్‌స్లైస్‌లను బంగారువర్ణంలోకి వచ్చేలా రెండువైపులా కాల్చి, బయటకు తీయాలి. వెల్లుల్లి సాస్‌తో వేడి వేడిగా గోల్డెన్ కాయిన్స్‌ను సర్వ్ చేయాలి.
షాహీ టుక్‌డా
బ్రెడ్ స్లైస్‌లు - 6, పాలు - లీటరు, కోవా - 50 గ్రా, పంచదార - 100 గ్రా, నూనె - వేయించడానికి తగినంత, బాదాంపప్పు తరుగు - టీ స్పూన్, ఏలకుల పొడి - చిటికెడు, డ్రై రెడ్ చెర్రీలు - 8, సిల్వర్ లీఫ్ - 1
తయారి:
బ్రెడ్‌లను త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, ఈ బ్రెడ్ స్లైస్‌లను వేసి బంగారు వర్ణం వచ్చేలా రెండు వైపులా వేయించి, పక్కన పెట్టాలి. పాలలో కోవా వేసి, ఈ మిశ్రమం సగం అయ్యేవరకు మరిగించి, ఏలకుల పొడి కలపాలి. పంచదారలో నీళ్లు కలిపి, పాకం పట్టుకోవాలి. వేయించిన బ్రెడ్ ముక్కలను పంచదార పాకంలో వేసి, తీసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను స్టౌ మీద సన్నని మంటపై పెట్టి, పాల మిశ్రమాన్ని బ్రెడ్‌ముక్కల మీద పోస్తూ రెండు వైపులా కాల్చాలి. కొద్దిగా వేడి తగ్గాక బాదాంపప్పు, సిల్వర్ లీఫ్, చెర్రీలతో అలంకరించి, సర్వ్ చేయాలి.
బ్రెడ్ పకోడా
బ్రెడ్ స్లైస్‌లు - 2, బంగాళదుంపలు- 150 గ్రా. (ఉడికించి, గుజ్జు చేయాలి), అల్లం - వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, చాట్ మసాలా - చిటికెడు
వాము - చిటికెడు , శనగపిండి - 250 గ్రా.
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, కలపాలి. అందులో బంగాళదుంప గుజ్జు, పసుపు, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు కలిపి వేయించాలి. శనగపిండిలో వాము, ఉప్పు వేసి, నీళ్లు పోసి జారుగా (బజ్జీల పిండిలా) కలుపుకోవాలి. కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి, వేడి చేయాలి. త్రికోణాకారంలో కట్ చేసుకున్న రెండు బ్రెడ్ స్లైస్‌ల మధ్య బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి అదమాలి. శనగపిండి మిశ్రమంలో ముంచిన బ్రెడ్ స్లైస్‌లను మరుగుతున్న నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేలా రెండువైపులా కాల్చి, బయటకు తీయాలి. ఇలా తయారుచేసుకున్న బ్రెడ్ స్లైస్‌లను టొమాటో కెచప్‌తో సర్వ్ చేయాలి.
బ్రెడ్ పూరీ
గోధుమ పిండి - కప్పు
బ్రెడ్ స్లైస్‌లు - 4
జీలకర్రపొడి - అర టీ స్పూన్
పంచదార - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
వాము పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
గిన్నెలో గోధుమ పిండి, పంచదార, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. మరొక గిన్నెలో బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పాలు, వాము వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని గోధుమ పిండిలో కలిపి, కొన్ని నీళ్లతో ముద్ద చేయాలి.
చిన్న చిన్న పిండి ఉండలు చేసుకొని, పూరీని వత్తి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా కాల్చాలి. ఈ పూరీలను గ్రేవీతో లేదా ఛోలేతో సర్వ్ చేయాలి.
బ్రెడ్ ఉప్మా
హోల్ వీట్ బ్రెడ్ స్లైస్‌లు - 4, ఉల్లిపాయ - 1 (తరగాలి), టొమాటో - 1 (తరగాలి), క్యారట్ తరుగు - టీ స్పూన్
పచ్చిబఠానీలు - టీ స్పూన్, కరివేపాకు - రెమ్మ, ఎండుమిర్చి - 2 (విరవాలి),
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
శనగపప్పు - అర టీ స్పూన్,
ఇంగువ - చిటికెడు
పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
నూనె - తగినంత
తయారి:
బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె వేడెక్కనివ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, క్యారట్, పచ్చిబఠాణీలు, టొమాటో, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ, కలుపుతూ వేగనివ్వాలి. కూరగాయలు ఉడికాక, ఉప్పు కలపాలి. అందులో బ్రెడ్ ముక్కలను వేసి కలుపుతూ మరికొద్ది సేపు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. బ్రెడ్‌ను గ్రైండ్ చేసి కూడా ఉప్మా చేసుకోవచ్చు.
బ్రెడ్ - చిట్కాలు
హోల్ వీట్ లేదా హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్‌నే ఎంపిక చేసుకోవాలి.
బ్రెడ్ ప్యాకెట్ మీద ఉన్న తయారీ తేదీని పరిశీలించి తీసుకోవాలి.
బ్రెడ్‌ను కాసేపు పెనం మీద వేడి చేసి, తీసి కాసేపటి తర్వాత మరోసారి వేయించితే కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది.
బ్రెడ్ రుచిగా ఉండాలంటే పాలతో తుడిచి, పెనం మీద వేసి, వేడి చేసి, తీయాలి.
బ్రెడ్ నిల్వ వాసన వస్తుంటే బ్రెడ్‌పీసుల మీద కొద్దిగా నీళ్లు చల్లి, అల్యూమీనియం ఫాయిల్లో చుట్టి, పదినిమిషాలు ఓవెన్లో వేడి చేస్తే తాజాగా ఉండటంతో పాటు నిల్వవాసన ఉండదు.
మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను ఎండబెట్టి, పొడి చేసుకుంటే గ్రేవీలు, కూరల్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
వంటకాల తయారీలో బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి వాడాలి.
పసుపు, పచ్చ రంగు బ్రెడ్ మీద కనిపించినప్పుడు ఫంగస్ చేరినట్టుగా గ్రహించి, పడేయం మంచిది.
బ్రెడ్‌ను పెనం మీద రోస్ట్ చేసి, వాడటం వల్ల బాక్టీరియా నశిస్తుంది. ఆరోగ్యకరం కూడా.
ఫ్రిజ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ను అందులో ఉంచాలి. బ్రెడ్‌స్లైస్ చెడువాసనను పీల్చుకొని దుర్వాసనను దూరం చేస్తుంది.

