Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

so sweet potato - సో స్వీట్ పొటాటో

so sweet potato - సో స్వీట్ పొటాటో

పేరులో ఏముంది అంటారుగాని పేరులోనే ఉంది అంతా.
కొందరికి స్వీట్ పొటాటో అంటే అర్థం కాదు.
మరికొందరికి రత్నపురి గడ్డ అంటే అర్థం కాదు.
ఇంకొందరు మొరం గడ్డ అంటారు. అంటే ఏంటో?
మరికొందరికి అది గెనుసు గడ్డ.
చూశారా... పదార్థం ఒకటే అయినా పేర్లు ఎన్ని మారాయో.
ఈ పేర్లన్నీ చిలగడదుంపవే.
ఒక రకంగా పేదవాళ్ల బంగాళాదుంప అది.
కాని, రేటుకు పేదే తప్ప రుచికి కాదు.
పోషకాలకూ కాదు... వంటకు అంతకంటే కాదు.
ఇది చిలగడ దుంపల సీజన్.
ఏ సీజన్ దుంపను ఆ సీజన్‌లో తినాలి.
రేపు మార్కెట్‌కు వెళ్లండి.
రెండు కిలోలు కొనండి.
కిలో కూరకు. మరో కిలో చిరుతిండికి.
వై రొటీన్? ఛేంజ్ ది మెనూ...


చిలగడదుంప హల్వా

కావలసినవి:
చిలగడదుంపలు - 3
నెయ్యి - టీ స్పూన్
పాలు - కప్పు
నీళ్లు - అర కప్పు
ఏలకుల పొడి - చిటికెడు
కుంకుమ పువ్వు - 4 రేకలు (టేబుల్‌స్పూన్ పాలలో కలిపి ఉంచాలి)
బాదాం, జీడిపప్పు తరుగు - 2 టేబుల్‌స్పూన్లు

తయారి:
చిలగడదుంపలను ఉడికించి, పై పొట్టు తీసి, గుజ్జు చేయాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి, కరిగాక చిలగడదుంప గుజ్జు వేసి సన్నని మంట మీద 3 నిమిషాల సేపు మాడకుండా కలుపుతూ ఉండాలి. దీంట్లో పాలు, అర కప్పు నీళ్లు, పంచదార, ఏలకుల పొడి వేసి, కలుపుతూ మరో రెండు నిమిషాలు ఉంచాలి. నీరంతా ఇంకిపోయి మిశ్రమం పొడిగా అయ్యాక, కుంకుమ పువ్వు పాలు, నట్స్ వేసి, కలిపి దించాలి.

చిలగడదుంప స్టఫ్డ్ పూరి

కావలసినవి:
చిలగడదుంపలు - మూడు, ఉల్లిపాయలు - రెండు (సన్నగా తరగాలి), ఉప్పు, కారం - సరిపడినంత, నిమ్మరసం - 2 స్పూన్లు, పచ్చిమిర్చి - 3 (సన్నగా తరగాలి), కొత్తిమీర - కొద్దిగా, సోంపు - టీ స్పూన్, నూనె - వేయించడానికి తగినంత, పసుపు - చిటికెడు

పూరీకి కావలసినవి:
మైదా - 2కప్పులు, వాము - టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, జిలకర్ర - కొద్దిగా, ఉప్పు - సరిపడ, తినేసొడా - చిటికెడు, డాల్డా - 3 స్పూన్‌లు

తయారీ:
ఉడికించి పొట్టుతీసిన చిలకడ దుంపలను మెదిపి పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్ మీద గిన్నెలో డాల్డా వేసి, వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, సోంపు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మెదిపి పెట్టుకున్న చిలకడ దుంప గుజ్జు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర చల్లి, దించి పక్కన పెట్టుకోవాలి.

పూరీ తయారీ:
మైదా, ఉప్పు, వాము, వంటసొడా, డాల్డా వేసి నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా తడిపి పెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత పీటమీద పూరీలను ఒత్తుకొని, పక్కన పెట్టాలి. తర్వాత తయారు చేసుకున్న స్టఫ్ కర్రీని పూరీ మీద పేర్చి దానిపై మరో పూరితో పెటి, అదిమి, అంచులను పాలతో లేదా నీళ్లతో తడిపి అతికించాలి. ఇలా పూరీలన్నీ తయారు చేసి పక్కన ఉంచాలి. తర్వాత స్టౌవ్ మీద కడాయి పెట్టి, స్టౌవ్ వెలిగించి, సరిపడ నూనెపోసి, వేడయ్యాక పూరీలను రెండువైపులా కాల్చుకోవాలి.

చిలగడదుంప పులుసు

కావలసినవి:
చిలగడదుంపలు - నాలుగు, చింతపండు - నిమ్మకాయ పరిమాణం (నానబెట్టి గుజ్జు తీయాలి), శనగపప్పు - మూడు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్, పసుపు - చిటికెడు, ఉప్పు, కారం - సరిపడినంత, బెల్లం - తగినంత, కరివేపాకు - ఒక రె మ్మ, ఎండుమిర్చి - 2, నువ్వులపొడి - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయముక్కలు - అరకప్పు, మెంతిపొడి - అర టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారీ:
చిలగడ దుంపలను కడిగి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోసి పోపుగింజలు, శనగపప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత చిలగడదుంప ముక్కలు వేసి కలిపి కాసేపు మూతపెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, చింతపండుగుజ్జు, మెంతిపొడి, నువ్వులపొడి వేసి మరికొంచెం సేపు ఉడికాక, కొత్తిమీర వేయాలి. అన్నంలోకి ఈ పులుసు కూరను వడ్డించాలి.

చిలగడదుంప పచ్చడి

కావలసినవి:
చిలగడ దుంపలు - నాలుగు
నిమ్మకాయలు - రెండు
కారం, ఉప్పు - సరిపడినంత

పోపు కోసం:
ఎండుమిరపకాయలు - రెండు
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్
ఇంగువ - చిటికెడు
మెంతిపొడి - చిటికెడు
నూనె - 3 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
కరివేపాకు - రెమ్మ
కొత్తిమీర తరుగు - టీ స్పూన్

తయారి:
చిలగడ దుంపల్ని కడిగి, పీలర్‌తో పైపొట్టు తీసి, తురమాలి. అందులో కారం, ఉప్పు, నిమ్మరసం, మెంతిపొడి కలిపి పావుగంట నానబెట్టాలి. తర్వాత స్టౌవ్ మీద మూకుడుపెట్టి, నూనె వేడయ్యాక, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి వేగిన తర్వాత చిలగడదుంప మిశ్రమంలో వేసి కలపాలి. అన్నం, చపాతీల్లోకి చిలగడ దుంప పచ్చడి రుచిగా ఉంటుంది.

చిలగడదుంప, గుమ్మడి కూర

కావలసినవి:
చిలగడదుంప - 2 (పై పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), గుమ్మడి ముక్కలు - పావు కేజీ (పై పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), టొమాటో - 1 (ముక్కలుగా తరగాలి), బీన్స్ - అర కప్పు, నీళ్లు - అరకప్పు, కొత్తిమీర - కట్ట, వెల్లుల్లి - 3 (మెదపాలి), అల్లం పేస్ట్ - అర టీ స్పూన్, ధనియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు, కారం - తగినంత, పసుపు - చిటికెడు, జీలకర్ర, ఆవాలు - టీ స్పూన్, పచ్చిమిర్చి - 2 (నిలువుగా కోయాలి), ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి), ఎండు కొబ్బరిపొడి - టీ స్పూన్, కరివేపాకు - రెమ్మ, శనగలు - టేబుల్‌స్పూన్ (నానబెట్టినవి)

తయారి:
కడాయిలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత గుమ్మడి, చిలగడ దుంపలు వేసి కలపాలి. టొమాటో ముక్కలు, శనగలు వేగుతుండగా, నీళ్లు పొసి ఉడికించాలి. ముక్కలు కొద్దిగా ఉడికాక కారం, ఉప్పు, ధనియాలపొడి, ఎండు కొబ్బరి వేయాలి. గ్రేవీ మరీ చిక్కగా కావాలనుకునేవారు టేబుల్‌స్పూన్ పెరుగు కలపవచ్చు. కూర పూర్తిగా అయ్యాక కొత్తిమీర వేసి దించాలి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

చిలగడదుంప జామూన్

కావలసినవి:
చిలగడదుంపలు - రెండు
కోవా-100గ్రా., మైదా -3 టీ స్పూన్‌లు
బేకింగ్ పౌడర్ - చిటికెడు
సన్‌ప్లవర్ ఆయిల్ (నెయ్యి కూడా వాడవచ్చు)- వేయించడానికి సరిపడినంత

పాకానికి :
పంచదార - 3 కప్పులు, నీళ్లు - 3 కప్పులు, ఏలకుల పొడి - 1/4 స్పూన్, బాదాం, జీడిపప్పు - 8 (సన్నగా తరగాలి)

తయారీ:
చిలగడ దుంపలను ఉడకబెట్టి పొట్టు తీయాలి. వెడల్పాటి గరిటెతో మెదిపి, గుజ్జులా చేయాలి. అందులో కోవా, బేకింగ్ పౌడర్, మైదా కలిపి ముద్ద చేయాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి సరిపడ నూనె పోసి వేడెక్కనివ్వాలి. మరోవైపు పంచదారలో నీళ్లు కలిపి, కరిగాక పొయ్యి మీద పెట్టి, లేతపాకం పట్టుకోవాలి. ఉండలను కాగుతున్న నూనెలో వేసి, సన్నని సెగ మీద బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. మరో స్టౌమీద పంచదార నీళ్లు లేతపాకం వచ్చాక మంట తీసేయాలి. వేయించిన ఉండలను వేడివేడి పంచదార పాకంలో వేసి, మూతబెట్టి అరగంట ఉండనివ్వాలి. తర్వాత జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో అలంకరించాలి.

చిలగడదుంప - చిట్కాలు
చిలగడ దుంపలో పొటాషియం, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ తో పాటు ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.

కొనుగోలు చేసేముందు దుంపలపైన పచ్చని, నల్లని మచ్చలు ఉంటే తాజావి కావని గ్రహించాలి.

సూప్‌లు పలచగా ఉంటే చిలగడదుంపను ఉడకబెట్టి ఆ గుజ్జును కలపవచ్చు.

చిలగడదుంపను నేరుగా వెజిటబుల్ సలాడ్స్‌లో ఉపయోగించవచ్చు.

ఉడికించిన చిలగడదుంపలను కేక్స్, కుకీస్ తయారీలో వాడవచ్చు.

చిలగడదుంప నిలువుగా సన్నని ముక్కలు కట్‌చేసి లో-ఫ్యాట్ క్రీమ్‌లో ముంచి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.

సన్నని ముక్కలుగా కట్ చేసి, వేయించి, ఉప్పు కారం, కొత్తిమీర చల్లితే చిలగడదుంపల ఫ్రై తినడానికి నిమిషాల్లో సిద్దం అవుతుంది.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html