Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

summer snacks - పగటి కొసన

summer snacks - పగటి కొసన

Summer Special
ఎండలు మండటానికి సిద్ధమవుతున్నాయి.
పొడవాటి పగళ్లు రానున్నాయి.
వేసవికి సిద్ధం కమ్మంటున్నాయి.
మధ్యాహ్నం భోజనం చేసినా వెలుగు కొసకొచ్చేసరికి సాయంకాలం మనసు చిరుతిళ్ల మీదకు మళ్లుతుంది.
ఎండకు నకనకలాడిన ప్రాణానికి ఏదైనా అందించమంటుంది.
అప్పుడు వీటిని ట్రై చేయండి. కొంచెం కొత్తవి కొంచెం పాతవి...
కొంచెం తీపివి... కొంచెం కారానివి. ట్రై చేయండి...
పగటి కొసన... పంటి కొసన..


సమోసా(samosa)

కావలసినవి:
మైదా- కప్పు
బటర్ - 2 టీ స్పూన్లు
బంగాళదుంపలు - 2
పచ్చి బఠాణీలు - అర కప్పు
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు - అర కప్పు
కారం - అర టీ స్పూన్
బేకింగ్ సోడా - కొద్దిగా
ఉప్పు - రుచికి తగినంత
ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్
నూనె - వేయించడానికి తగినంత

తయారి:
బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, బటర్ వేసి, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పక్కనుంచాలి. పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంప ముక్కలు వేసి వేయించి దించాలి. పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పీట మీద కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ట్రయాంగిల్ వచ్చేలా కట్ చేసుకోవాలి. నీళ్లను అద్దుకుంటూ కోన్ షేప్ చేసి, అందులో ఉడికించిన బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. వీటిని కడాయిలో నూనె కాగిన తర్వాత వేసి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించి, తీయాలి. వేడి వేడిగా టొమాటో లేదా సోయా సాస్‌తో సర్వ్ చేయాలి.

పల్లీచాట్(groundnut chat)

కావలసినవి:
పల్లీలు - కప్పు; అటుకులు - రెండు కప్పులు; స్వీట్ కార్న్ - కప్పు; పుట్నాలపప్పు - అరకప్పు; ఉల్లితరుగు - అరకప్పు సన్నగా తరిగిన టొమాటోలు - పావు కప్పు; నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 2; ఇంగువ -కొద్దిగా; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - కొద్దిగా; నూనె - తగినంత; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు - టీ స్పూను

తయారి:
బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ అదే బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి గుల్లగా వేయించుకోవాలి. మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి. మిరప్పొడి వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే తినేయాలి. లేదంటే మెత్తపడిపోతాయి.

ఉరద్‌దాల్ పిజ్జా(blackgram pizza)

కావలసినవి:
మినప్పప్పు - కప్పు
బియ్యం రవ్వ - రెండు కప్పులు
ఇంగువ - రెండు చిటికెలు
పచ్చిమిర్చి - 2; ఉప్పు - తగినంత
వంటనూనె - తగినంత
పచ్చిబఠాణీ - రెండు టీ స్పూన్లు
క్యారట్ తురుము - రెండు టీ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
ఉల్లికాడల తరుగు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
వెన్న - రెండు టీ స్పూన్లు
టొమాటో రసం - టీస్పూను

తయారి:
ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యపురవ్వలను విడివిడిగా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు మినప్పప్పులో నీరు వడకట్టి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. బియ్యపురవ్వలో నీటిని పూర్తిగా తీసేసి ఆ రవ్వను మినప్పిండిలో వేసి బాగా కలిపి ఒకరోజంతా నాననివ్వాలి. తరువాతి రోజు ఆ పిండిలో ఉప్పు, టొమాటోరసం, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ వేసి బాగా కలపాలి. లోతుగా ఉండే వెడల్పైన బాణలిని స్టౌ మీద ఉంచి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక రెండు గరిటెల పిండిని అందులో వేసి సమానంగా పరచాలి. దానిపైన క్యాప్సికమ్ తరుగు, క్యారట్ తురుము, ఉల్లికాడలు, పచ్చి బఠాణీలు, కొద్దిగా జీలకర్ర వేయాలి. పైన మూత ఉంచి ఆవిరి మీద (సన్న మంట మీద) ఉడకనివ్వాలి. గరిటెను అందులో గుచ్చి చూస్తే దానికి పిండి అంటుకోకపోతే ఉడికినట్లే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత తినేముందు వెన్న వేసి సర్వ్ చేసుకోవాలి. ఇది ఇటాలియన్ పిజ్జాకు ఏ మాత్రం తీసిపోదు సరికదా, ఎంతో ఆరోగ్యం.

ఆనియన్ బజ్జీ(onion bajji)

కావలసినవి:
ఉల్లిచక్రాలు - 20; శనగపిండి - కప్పు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను; లవంగాల పొడి - పావు స్పూను; పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూను; మిరప్పొడి - పావు స్పూను ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారి:
పైన చెప్పిన పదార్థాలను (నూనె, ఉల్లిచక్రాలు తప్పించి) ఒక గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీలపిండిలా కలుపుకోవాలి. స్టౌ మీదబాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లి చక్రాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ బజ్జీలు వేసి దోరగా వేయించాలి. బాగా వేగిన తరవాత టిష్యూ పేపర్ మీదకు తీసి కొద్దిగా చల్లారిన తరవాత కొత్తిమీర లేదా టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

పేలాలు/మరమరాల లడ్డు(fried rice laddu)

కావలసినవి:
పేలాలు/మరమరాలు - నాలుగు కప్పులు
బెల్లం - రెండు కప్పులు; ఏలకుల పొడి - టీ స్పూను
బాదం పొడి - టీ స్పూను; జీడిపప్పు పొడి - టీ స్పూను
గుమ్మడిగింజలు - నాలుగు టీస్పూన్లు
నెయ్యి - రెండు టీ స్పూన్లు

తయారి:
మందపాటి బాణలిలో నెయ్యి, బెల్లం, రెండు స్పూన్ల నీరు పోసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. కొద్దిగా ఉండపాకంలా వచ్చిన తరవాత పైన చెప్పిన మిగిలిన పదార్థాలను వేసి స్టౌ ఆపేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. ఇవి చేయడం ఎంత తేలికో, అంతే తేలిగ్గా అరుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పానీపూరీ(pAnI pUrI)

పూరీకి కావలసినవి:
ఉప్మారవ్వ (సన్నది) - కప్పు
మైదా - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా - చిటికెడు
నూనె - వేయించడానికి తగినంత

పానీకి కావలసినవి:
చింతపండు గుజ్జు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు; జీలకర్ర పొడి (వేయించి పొడి చేయాలి)- టేబుల్ స్పూన్; జీలకర్ర - టేబుల్‌స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్
న ల్ల ఉప్పు - టేబుల్ స్పూన్
బెల్లం - 2 టేబుల్‌స్పూన్లు

తయారి:
పానీకోసం పై చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి.

పూరీ కోసం ...
రవ్వ, మైదా, బేకింగ్‌సోడా, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పిండి మీద తడి క్లాత్ వేసి పదిహేను నిమిషాలు ఉంచితే మృదువుగా అవుతుంది. చిన్నచిన్న పిండి ముద్దలు చేసి మైదా లేదా రవ్వను అద్దుకుంటూ పీట మీద ఒత్తాలి. వీటిని కడాయిలో నూనె వేడయ్యాక వేసి రెండు వైపులా కాల్చి, బయటకు తీయాలి. ఈ పూరీలను పానీతో సర్వ్ చేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html