Eat Seeds - చిత్త‘గింజం'డి
ఏదైనా కాయగూరలను పగలగొట్టే సమయంలో దానిలోని గింజలను మనం సాధారణంగా విస్మరిస్తూ ఉంటాం. గింజ కోసమే తీసే నట్స్ వంటి వాటిల్లో మినహా దాదాపు అన్ని కూరగాయలు, పండ్ల విషయంలో ఇది జరుగుతుంది. మామూలుగా అయితే గింజల్లో ఉండే పోషకాలను అంతగా పట్టించుకోం. వివిధ గింజలతో ఉండే ప్రయోజనాలు, వాటితో ఆరోగ్యానికి కలిగే మేలు వంటి అంశాలను తెలుసుకున్న తర్వాత కూరగాయలు, పండ్లలోని గింజల్ని ఊసేయకండి. కొన్నింటినైనా తినండి... పోషకాలను పొందండి... 
గింజల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ‘ఇ’, మోనోశాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువ. పోషకాలను గింజల రూపంలో తీసుకునేవారిలో గుండెజబ్బులు కూడా తక్కువ. స్థూలకాయాన్ని నివారిస్తాయి. కొలెస్ట్రాల్ పాళ్ల ను తగ్గిస్తాయి. గింజలు ఎక్కువగా తినేవారికి ప్రోటీన్లు, మినరల్స్, జింక్, ఇతర పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల గింజలు, వాటిల్లో ఉండే పోషకాలు, వాటి ప్రయోజనాలివి.
*అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్): మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్. అవిసెలో ఒమెగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడతాయి.
*నివారించే జబ్బులు: ఆర్థరైటిస్, ఆస్తమా, ఇన్‌ఫ్లమేటరీ జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్లను అవిసెలు చాలావరకు నిరోధిస్తాయి. అవిసెలో విటమిన్-బి, విటమిన్-ఇ చాలా ఎక్కువ. దాంతో పాటు పీచుపదార్థాలు (సొల్యుబుల్ ఫైబర్) కూడా ఎక్కువ.
ఇలా తీసుకుంటే మంచిది... ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అవిసె పొడిని నీళ్లలో లేదా పాలు, పెరుగులో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
*నువ్వులు: నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్-ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. నువ్వుల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటి వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇందులో నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి పోషకాలు మరింత ఎక్కువ. నువ్వు గింజల్లోని బరువులో 50% నూనె పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్-ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని చాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి.
*అల్ఫాల్ఫా గింజలు: అల్ఫాల్ఫా గింజలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇవి కాలేయ వ్యాధుల నివారణకు ఎంతో తోడ్పడతాయి. రక్తంలోని విషపదార్థాలను హరిస్తాయి. రక్తహీనత (అనీమియా)ను తగ్గిస్తాయి. కడుపులో పుండ్లు (అల్సర్స్), కొలైటిస్, ఆర్థరైటిస్ వంటి ఎన్నో వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెర పాళ్లను అదుపు చేయడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. క్యాన్సర్ల నివారణకు ఇవి ఎంతో ఉపయోగం. దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే చర్మవ్యాధులను నివారించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
*అల్ఫాల్ఫాతో జాగ్రత్త: ఈ గింజలను ఉపయోగించాలంటే వాటిని మొలకెత్తించి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే... ఇందులో కెనావనైన్ అనే విషపూరితమైన అమైనో ఆసిడ్ ఉంటుంది. దీని దుష్ర్పభావాన్ని తగ్గించి కేవలం అల్ఫాల్ఫాలోని పోషకాల వల్ల కలిగే ప్రయోజనాన్ని మాత్రమే స్వీకరించాలంటే వీటిని మొలకెత్తించి మాత్రమే తీసుకోవాలి. వీటి ఔషధ గుణాలను చూసి అదేపనిగా ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో ప్లేట్‌లెట్ల సమస్య, తెల్లరక్తకణాల సమస్య కూడా రావచ్చు. గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు వీటిని తీసుకునేముందర తప్పనిసరిగా ఫిజీషియన్ సలహా తీసుకొని మాత్రమే అల్ఫాల్ఫా గింజలను వాడాలి.

క్యాన్సర్ల నివారణకు ప్రత్యేకం ద్రాక్ష గింజ... ద్రాక్ష గింజలోని ఔషధ గుణాలు కేవలం చర్మ, రొమ్ము వంటి క్యాన్సర్లను మాత్రమే కాదు... చాలా రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా పనిచేస్తుంది. ఇప్పుడు కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా కొన్ని మందులు ఇచ్చి క్యాన్సర్ కణం తనంతట తనే మరణించేలా కొన్ని చికిత్సలు చేస్తున్నారు. దీన్నే ప్రోగ్రామ్‌డ్ సెల్ డెత్ లేదా అపోప్టోసిస్ అంటారు. స్వాభావికంగానే క్యాన్సర్ కణాలు తమంతట తామే నాశనం అయ్యేందుకు ద్రాక్ష గింజలు తోడ్పడుతుంటాయి. కాబట్టి వీటిని స్వాభావికమైన క్యాన్సర్ కిల్లర్స్ అనుకోవచ్చు.
*ఒత్తిడి నిరోధానికి గుమ్మడి గింజలు: ఒత్తిడిని నివారించడానికి గుమ్మడి గింజలు ఎంతగానో దోహదపడతాయి. ఒత్తిడి వల్ల కలిగే అలసట ఫీలింగ్‌ను గుమ్మడి గింజలు పోగొడతాయి. గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష తగ్గుతుంది. స్థూలకాయం పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి. అంతేకాదు... మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్‌ను తగ్గిస్తాయి.
*ఇతర గింజలు: గుమ్మడి, దోసకాయ, పుచ్చకాయ గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ గింజలన్నింటిలోనూ పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దకం నిరోధించడం మొదలు జీర్ణక్రియ సక్రమంగా జరగడం, ఎన్నో వ్యాధుల నివారణకు గుమ్మడి, దోస, పుచ్చ గింజలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిన్నింటిలోనూ విటమిన్-ఇ, విటమిన్-బి కాంప్లెక్స్‌లు ఎక్కువ. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. మన శరీరం అనేక జీవక్రియలు నెరవేర్చే సమయంలో ఫ్రీ రాడికల్స్ అనే పరమాణు పదార్థాలు వెలువడుతాయి.

ఈ పరమాణు పదార్థాల వల్ల తీవ్రమైన హాని జరుగుతుంది. మనం పోషకాహార రూపంలో తీసుకునే యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఈ ఫ్రీ రాడికల్స్ దుష్ర్పభావాన్ని పూర్తిగా హరించి వేస్తాయి. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతగా తీసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ ఎక్కువ. ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్స్ పెరగడం వల్ల కలిగే దుష్ర్పభావాలను పనాగమిక్ ఆసిడ్ నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడటానికి దోహదం చేస్తుంది.
నల్లద్రాక్ష గింజలు
మనం నల్ల ద్రాక్షను తినేటప్పుడు ఒకవేళ గింజ వస్తే ఊసేస్తాం. కొన్నిసార్లు గింజ కొరికినప్పుడు వగరుగా ఉందని అనుకుంటూ ఆ రుచిని తొలగించేందుకు మరికొన్ని ద్రాక్ష పండ్లు తినేస్తాం. అయితే మీరు దాని గింజల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే ఈసారి మీరు ద్రాక్ష గింజను కొరికినప్పుడు బాధపడరు సరికదా... ఇకపై సీడ్‌లెస్ వెరైటీ మానేసి సీడ్స్‌తో ఉండే ద్రాక్షలు తీసుకుంటారేమో.
ద్రాక్షగింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రో యాంథో సయానిడిన్స్ వంటివి అందులో కొన్ని ప్రధానమైనవి. ద్రాక్షగింజలు హైకోలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండెజబ్బులను నివారిస్తాయి. ద్రాక్ష తినేవారికి గాయాలు త్వరగా మానుతాయి. ఇందులోని సీడ్ ఫినాలిక్స్ అనే పోషకాలు చక్కెర త్వరగా తయారయ్యే ప్రక్రియను నిరోధించి పిప్పిపళ్లు రాకుండా నివారిస్తుంది. ఆస్టియోపోరోసిస్, చర్మక్యాన్సర్‌లను నిరోధిస్తుంది.