Real dalsoup - అచ్చమైనపప్పుచారు
Indian Recipes
పప్పుచారు - ఉప్పు చేపపప్పుచారు- అప్పడం
పప్పుచారు - వడియం
పప్పుచారు - ఆమ్లెట్
పప్పుచారు - అరటికాయ తాలింపు
డైనింగ్ టేబుల్ మీద పప్పుచారు హీరోలా నిలబడితే
కాంబినేషన్‌లో ఎవరైనా సరిపోతారు. జోరుగా ముద్దలో అమరిపోతారు.
ఏదో ఒక కూరో, చారో అనుకోకుండా
ఈ పూట పప్పుచారును ఎంచండి, ఫుల్లుగా దంచండి.
కంది పప్పుచారు
కందిపప్పు - కప్పు, చింతపండు - నిమ్మకాయ పరిమాణం అంత, చిన్న ఉల్లిపాయలు - 6, టొమాటో - 1, పచ్చిమిర్చి - 4(నిలువుగా కట్ చేసుకోవాలి), కారం - అర టీ స్పూన్, పసుపు- అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు- టీ స్పూన్, ఉప్పు - తగినంత, ధనియాలపొడి - టీ స్పూన్
పోపుకోసం:
ఎండుమిర్చి - 3, ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్ వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు - 2 రెమ్మలు, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
చింతపండును గ్లాసు నీటిలో నానబెట్టాలి. తగినన్ని నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి. వెడల్పాటి గరిటెతో లేదా పప్పుగుత్తితో పప్పును పలుకులుగా లేకుండా మెదపాలి. ఒక గిన్నెలో మెదిపిన పప్పు, చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ధనియాలపొడి, బెల్లం వేసి మరి కాసేపు మరిగించాలి. రుచి కోసం సాంబారు పొడి కూడా వేసుకోవచ్చు. మరొక బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టి పప్పుచారులో కలపాలి.
మామిడికాయ పప్పుచారు
మామిడికాయ - 1, కందిపప్పు - కప్పు, ఉల్లిపాయ - 1, టొమాటో - 1, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 3, ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్, పసుపు- అర టీ స్పూన్, వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి), ధనియాలపొడి -టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, కారం - అర టీ స్పూన్, కొత్తిమీర - టీ స్పూన్, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత
తయారి:
మామిడికాయను కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, చల్లారనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి. పప్పును పలుకులుగా లేకుండా మెదపాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి. ఉడికిన మామిడికాయను రసం తీసి పప్పులో పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న ముక్కల్లో పోసి, కారం, ఉప్పు కలిపి మరగనివ్వాలి. తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరిగిన తర్వాత దించాలి. రుచి కోసం సాంబారుపొడి వేసుకోవచ్చు.
అలసందలు/ బొబ్బర్ల పప్పుచారు
బొబ్బర్ల పప్పు- కప్పు, చింతపండు - నిమ్మకాయ పరిమాణం అంత, ఉల్లిపాయ - 1, టొమాటో - 1, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 3 ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్, వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి), ధనియాలపొడి - టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, కారం - అర టీస్పూన్, కొత్తిమీర - టీ స్పూన్ , నూనె - 2 టేబుల్ స్పూన్లు, పసుపు- అర టీ స్పూన్, ఉప్పు - తగినంత
తయారి:
గ్లాసు నీటిలో చింతపండు వేసి నాననివ్వాలి. బొబ్బర్ల పప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, చల్లారనివ్వాలి. పప్పును పలుకులుగా లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి. చింతపండు రసం తీసి పప్పులో పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పోపులో పోసి, కలిపి మరిగించాలి. తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి దించాలి.
శనగ పప్పుచారు
శనగపప్పు - కప్పు, చింతపండు - నిమ్మకాయ పరిమాణం అంత, ఉల్లిపాయ - 1, టొమాటో - 1, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 3, ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్, వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి), ధనియాలపొడి - టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, పసుపు- అర టీ స్పూన్, కారం - అర టీ స్పూన్, కొత్తిమీర - టీ స్పూన్, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత
తయారి:
తగినన్ని నీళ్లు పోసి శనగ పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి. చింతపండును గ్లాసు నీటిలో నానబెట్టాలి. పప్పును పలుకులుగా లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు మరీ సన్నగా కాకుండా ముక్కలుగా, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి. చింతపండు రసం తీసి పప్పులో పోసి కలపాలి. తర్వాత పప్పు కలిపిన చింతపండు రసాన్ని పోసి, ఉప్పు వేసి కలిపి మరిగించాలి. తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరికొద్ది సేపు మరిగిన తర్వాత దించాలి.
పెసర పప్పుచారు
పెసరపప్పు - కప్పు, ఉల్లిపాయ - 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), టొమాటో - 2 (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), పచ్చిమిర్చి - 4 , నిమ్మరసం - టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్, ఇంగువ - అర టీ స్పూన్, ధనియాలపొడి - టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, నీళ్లు - 2 కప్పులు, కొత్తిమీర - టీ స్పూన్, నెయ్యి - 2 టీ స్పూన్లు, నూనె - టీ స్పూన్, పసుపు - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, కారం - అర టీ స్పూన్
తయారి:
పాత్రలో నెయ్యి వేడయ్యాక పెసరపప్పు వేసి కొద్దిగా వేయించాలి. సువాసన వస్తుండగా నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టి బ్లెండ్ చేయాలి. అందులో ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, గ్లాసు నీళ్లు, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, కారం, ఉప్పు వేసి మరిగించాలి. మరొక కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కలిపి మరుగుతున్న పప్పుచారులో కలిపి దించాలి.

