Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

merry christmas cakes - మెర్రీ క్రిస్మస్ కేకులు

merry christmas cakes - మెర్రీ క్రిస్మస్ కేకులు

క్రిస్టియన్ అంటే పరిశుద్ధుడు అని అర్థం.
క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం.
క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్నవారికి సైతం
ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు.
కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు.
ఇందులో మీకు ఇచ్చిన కేకులను ప్రయత్నించి
మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...
కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...


మ్యాంగో కేక్ (mango cake)

కావలసినవి:
మైదాపిండి - పావు కేజీ, పంచదార పొడి- 200 గ్రా., కోడిగుడ్లు - 8, కేక్‌జెల్ - (బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది) 10గ్రా., రిఫైన్‌డ్ ఆయిల్ - 25 మి.లీ., నీళ్లు - 15 మి.లీ., మ్యాంగో ఎసెన్స్ - మూడు చుక్కలు

బేస్ తయారి
ఒక పెద్ద పాత్రలో ముందుగా కోడిగుడ్ల సొన, పంచదార పొడి, నీరు వేసి బాగా బీట్ (కవ్వంలాంటి దానితో గిలకొట్టవచ్చు) చేయాలి. పంచదార పూర్తిగా కరిగాక మైదా, కేక్‌జెల్, రిఫైన్‌డ్ ఆయిల్ అన్నీ వేసి ఉండలుగా లేకుండా బాగా కలపాలి. (ఎంత ఎక్కువ సేపు కలిపితే కేక్ అంత మృదువుగా వస్తుంది). కేక్ మౌల్డ్ తీసుకుని దానికి బటర్ పూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్‌లో ఉంచాలి. దీనిని 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్‌లో సుమారు 40 నిముషాలు బేక్ చే సి తీసేయాలి.

డెకొరేషన్ క్రీమ్‌కి కావలసినవి
ఫ్రెష్ క్రీమ్ - పావు కేజీ
పంచదార పొడి- 50 గ్రా.

ఒక బౌల్‌లో ఫ్రెష్ క్రీమ్, పంచదారపొడి వేసి బాగా కలపాలి. పంచదారపొడి కరిగే వరకు అలా కలుపుతుంటే మంచి క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీమ్‌తో కేక్ మీద... ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లు వారు డెకరేట్ చేసుకోవచ్చు. (ఫొటోలో ఉన్నట్లే చేయనక్కర్లేదు. ఎంతో నైపుణ్యం ఉంటేనేకాని కేక్ డెకరేషన్ సాధ్యపడదు).

మఫిన్స్ (muffins)

కావలసినవి:
చాకొలేట్ టీ టైమ్ మిక్స్ - 25 గ్రా. (బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది), మైదాపిండి - పావు కేజీ, పంచదారపొడి - 200 గ్రా., డాల్డా (మార్జిరిన్) - పావు కేజీ, కోడిగుడ్లు - 5, కోకోపౌడర్ - 25 గ్రా., బేకింగ్ సోడా - 2 గ్రా., చాకొలేట్ చిప్స్ - 25 గ్రా.

తయారి:
ఒక బౌల్‌లో ముందుగా కోడిగుడ్ల సొన, పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరవాత మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ జతచేసి మరోమారు బాగా కలపాలి. మౌల్డ్స్ తీసుకుని వాటి లోపల బటర్ పూసిన తరవాత ఈ మిశ్రమం పోసి అవెన్‌లో 160 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు టెంపరేచర్‌లో సుమారు 20 నిముషాలు బేక్ చేయాలి. బయటకు తీశాక కాజు, చెర్రీలతో డెకొరేట్ చేసి సర్వ్ చేస్తే చాలా బావుంటాయి.

వాల్‌నట్ కేక్ (wallnut cake)

కావలసినవి:
మైదా - పావు కేజీ, కోడిగుడ్లు - 6, పంచదారపొడి-200 గ్రా., బటర్ - పావు కేజీ, వాల్‌నట్ - 25గ్రా. (పలుకులుగా చేసుకోవాలి), బేకింగ్ సోడా - 2 గ్రా.

బేస్ తయారి
ఒక పెద్దబౌల్‌లో పంచదారపొడి, కోడిగుడ్ల సొన వేసి బాగా బీట్ చేయాలి. తరవాత అందులో మైదాపిండి, బటర్, వాల్‌నట్ పలుకులు, బేకింగ్‌సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మౌల్డ్ మొత్తం కొద్దిగా బటర్ రాసి ఆ తరవాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి సమానంగా పరవాలి. అవెన్‌లో 180 డిగ్రీలనుంచి 200 డిగ్రీలవరకు 40 నిముషాల పాటు బేక్ చేసి బయటకు తీసి క్రీమ్‌తో కావలసిన విధంగా డెకొరేట్ చేయాలి.

ప్లమ్ కేక్ (plum cake)

కావలసినవి:
మైదాపిండి - పావుకేజీ, డాల్డా - పావు కేజీ, పంచదార పొడి- 200 గ్రా. , బేకింగ్ సోడా - 2 గ్రా., కోడిగుడ్లు - 5 డ్రైఫ్రూట్స్ - పావు కేజీ (అంజీర్, సీడ్‌లెస్ ఖర్జూరం, కిస్‌మిస్, జింజర్ చిప్స్, నల్ల కిస్‌మిస్, కట్ పీల్, ఆరెంజ్ పీల్, కాజు... అన్నిటినీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి). సుగంధద్రవ్యాల పొడి - టీ స్పూను (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చినచెక్క, లవంగాలు... అన్నీ కలిపి తయారుచేసుకున్న పొడి - టీ స్పూను. ఈ పొడిని డ్రైఫ్రూట్స్ మిశ్రమంలో వేయాలి).

తయారి:
ఒక పెద్ద బౌల్‌లో కోడిగుడ్ల సొన, డాల్డా, పంచదారపొడి వేసి బాగా కలపాలి. అన్నీ కలిసిన తరవాత అందులో మైదాపిండి, డ్రైఫ్రూట్స్ మిశ్రమం, బేకింగ్ జతచేసి మరోమారు కలపాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్ (ఇష్టమైన ఆకారం ఎంచుకోవచ్చు) లో పోసి 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్ దగ్గర అవెన్‌లో సుమారు 30 నిముషాలు బేక్ చేయాలి. బయటకు తీసిన తరవాత పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి.

ప్లమ్ విత్ ఐసింగ్ (plum with icing)

తయారి
దీనికి కావలసిన పదార్థాలు, తయారి అంతా ప్లమ్‌కేక్ మాదిరిగానే.

ఐసింగ్ కోసం:
పంచదార పొడి - పావు కేజీ, డాల్డా (మార్జిరిన్) - పావు కేజీ, ఎసెన్స్ - కొద్దిగా (ఇష్టపడే ఫ్లేవర్ అంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్ ... వేటినైనా వాడుకోవచ్చు)రిఫైన్‌డ్ ఆయిల్ - 25 గ్రా..

ఒక పెద్ద బౌల్‌లో ముందుగా డాల్డా, పంచదారపొడి మెత్తటి పేస్ట్‌లా అయ్యేవరకు బాగా కలపాలి. తరవాత రిఫైన్‌డ్ ఆయిల్, ఎసెన్స్ చుక్కలు జతచేసి మరోమారు బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కేక్‌పైన ఎవరికి నచ్చిన ఆకారంలో వారు డెకొరేట్ చేసుకోవచ్చు.

చాకొలేట్ కేక్ (chocolate cake)

కావలసినవి:
కోకోపౌడర్ - 50గ్రా., మైదాపిండి - పావు కేజీ, పంచదార పొడి - 300 గ్రా., రిఫైన్‌డ్ ఆయిల్ - 25 మి.లీ., నీళ్లు - 15.మి.లీ.

తయారి:
మ్యాంగో కేక్‌కి బేస్ తయారుచేసినట్లే దీనికి కూడా చేయాలి.

పైన డెకొరేషన్‌కి:
చాకొలేట్ బార్ - (బేకరీ ఐటెమ్స్ షాపులో దొరుకుతుంది) 25 గ్రా., ఫ్రెష్‌క్రీమ్ - 25 గ్రా.
ముందుగా ఫ్రెష్ క్రీమ్‌ని ఒక గిన్నెలో వేసి స్టౌ మీద ఉంచి కరగబెట్టాలి. తరవాత అందులో చాకొలేట్ బార్ వేసి బాగా కలిపి (పంచదార అవసరం లేదు) దింపేసి, బాగా బీట్ చేస్తే చాకొలేట్ తయారవుతుంది. ఈ మిశ్రమంతో కేక్ పైన ఎవరి ఆలోచనకు తగ్గట్టు వారు డెకరేట్ చేసుకోవచ్చు.

కేక్ తయారుచేసిన తరవాత దానిమీద ఆపిల్ ముక్కలతో, చెర్రీపళ్లతో, రంగురంగులలో దొరికే స్వీట్ బీడ్స్‌ని ఉపయోగించవచ్చు. అలాగే కమలాపండు, పైనాపిల్... మీకు నచ్చిన పళ్లతో అందంగా అలంకరించి అతిథులకు అందించండి. ఇలా చేస్తే వారిని సంప్రదాయంగా, మోడరన్‌గా... రెండురకాలుగానూ ఆహ్వానించినట్లే.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html