smoky moons(Idli) - పొగలుకక్కే చందమామలు(ఇడ్లీ)
‘ఈ రోజు టిఫిన్ ఏంటమ్మా’ ఇంటికి వస్తూనే పిల్లలు అడుగుతారు.‘ఇడ్లీ’ అని సమాధానం చెప్తుంది అమ్మ.
‘రోజూ ఇడ్లీయేనా’ మూతులు ముడుస్తారు పిల్లలు.
‘ఇవి అలాంటి ఇలాంటి ఇడ్లీలు కావు’ అంటుంది అమ్మ.
అవును. డ్రైఫ్రూట్స్ ఇడ్లీ... ఇడ్లీ బజ్జీ... ఇడ్లీ మంచూరియా...
ఇవన్నీ వెరైటీగా లేవూ?!
ఇవి పిల్లలకు పెట్టండి. మళ్లీమళ్లీ చేయమని అడుగుతారు.
ఇంకెందుకు ఆలస్యం... వెంటనే ఇడ్లీ కుకర్‌ను స్టౌ మీదకి ఎక్కించండి.
పొగలుకక్కే చందమామలను కిందకు దించండి.
డ్రైఫ్రూట్ ఇడ్లీ
ఖర్జూరాలు - 6 , జీడిపప్పులు - 20, కిస్‌మిస్ - 20, బాదం పలుకులు - 10, (వీటినన్నిటినీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి), ఇడ్లీపిండి - పది ఇడ్లీలకు సరిపడేంత, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చికొ బ్బరి తురుము - అర కప్పు, చెర్రీస్ - ఆరు, క్యారట్ తురుము - పావు కప్పు, తేనె - నాలుగు టీస్పూన్లు
తయారి
ముందుగా ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకులలో వేసి స్టవ్ మీద ఉంచాలి. సగం ఉడికిన తరువాత ఒకసారి మూత తీసి, కట్ చేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు ఇడ్లీల మీద వేసి మళ్లీ మూత పెట్టేయాలి. బాగా ఉడికిన ఇడ్లీలను టిఫిన్ ప్లేట్లలోకి తీసి పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు బాగా ఇష్టపడతారు.
ఇడ్లీ చాట్
ఇడ్లీలు - 4, సన్న కారబ్బూందీ - అర కప్పు, సన్నకారప్పూస - అర కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, క్యారట్ తురుము -పావు కప్పు, కీరాతురుము - పావు కప్పు, టొమాటో తరుగు - అర కప్పు, చాట్ మసాలా - టీ స్పూను, స్వీట్ చట్నీ - 3 టీ స్పూన్లు, పుదీనా చట్నీ - 2 టీస్పూన్లు సన్నగాతరిగిన కొత్తిమీర - అర టీ స్పూను
తయారి
ముందుగా ఇడ్లీలను కొద్దిగా చిదిమి ప్లేట్‌లో ఉంచాలి. వాటి మీద పుదీనా చట్నీ వేసి ఆపైన కారబ్పూందీ, సన్నకారప్పూస, కీరా ముక్కలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, క్యారట్ తురుము వేయాలి. వాటి పైన చాట్‌మసాలా, స్వీట్ చట్నీ, కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేయాలి.
స్వీట్ చట్నీ
కావలసినవి:
ఖర్జూరాలు - 10, బెల్లం - 100 గ్రా, చింతపండు గుజ్జు - అర కప్పు (చిక్కనిది), జీలకర్ర పొడి - అర టీ స్పూను, ఉప్పు - కొద్దిగా
తయారి:
ఖర్జూరాలలో కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఒక గిన్నెలో చింతపండుగుజ్జు, ఖర్జూరం పేస్ట్ వేసి స్టౌ మీద ఉంచి వేడిచేయాలి. ఉడుకుతుండగా జీలకర్రపొడి, ఉప్పు, బెల్లం వేసి ఐదు నిముషాలు ఉడికిన తరవాత దించేయాలి.
కింద ఫొటోలో... వాడిన వస్తువులన్నీ కనిపించటం కోసం ఇడ్లీలను చిదమకుండా ఉంచేశాం. తయారుచేసుకునేటప్పుడు మాత్రం ఇడ్లీలను జాగ్రత్తగా చిదమాలి. ఇందులో మేం ఇచ్చిన పదార్థాలను మాత్రమే కాక ఇంకా ఏవి కలిపితే బాగుంటాయనుకుంటారో వాటిని కూడా కలపండి. మీ క్రియేటివిటీకి పదును పెట్టండి.
ఇడ్లీ ఉప్మా
ఇడ్లీలు -4, పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి - రెండు (నిలువుగా కట్ చేసుకోవాలి), జీడిపప్పులు - 10, తాలింపు గింజలు - టీ స్పూను, నిమ్మరసం - టేబుల్ స్పూను, క్యారట్ తురుము - అర కప్పు, పచ్చిబఠాణీ - పావుకప్పు, నూనె - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట, ఉప్పు - తగినంత
తయారి
ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి.
మసాలా కుర్మా
ఇడ్లీలు-4, క్యారట్ తురుము-పావుకప్పు, బఠాణీ - పావు కప్పు, బీన్స్ తరుగు- 3 టేబుల్ స్పూన్లు, బంగాళదుంప ముక్కలు - అరకప్పు, అల్లంతురుము - అర టీ స్పూను, ఉల్లితరుగు - అరకప్పు, పచ్చిమిర్చితరుగు - 2 టీస్పూన్లు, గరంమసాలా- టీ స్పూను, కిస్‌మిస్ - 15 (నీళ్లలో నానబెట్టి మెత్తగా చేయాలి), పెరుగు - అర కప్పు (గట్టిగా ఉండాలి), టొమాటో ప్యూరీ - అర కప్పు, జీడిపప్పు + గసగసాల పేస్ట్ - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు, కారం, పసుపు, నూనె - తగినంత, కొత్తిమీర- చిన్న కట్ట, కరివేపాకు- 2 రెమ్మలు, పుదీనాఆకులు - 10
తయారి:
కూరముక్కలను ఉడికించి పక్కన ఉంచాలి. ఒక్కో ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. పెరుగును క్రీమ్ వచ్చేలా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె కాగాక జీడిపప్పు + గసగసాల పేస్ట్, పచ్చిమిర్చితరుగు, ఉల్లితరుగు, అల్లం తురుము వేసి కలిపాక ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. టొమాటో ప్యూరీ కూడా వేసి వేయించాలి. అన్నీ గుజ్జులా అయ్యాక కూరముక్కలు వేసి బాగా కలిపి గరంమసాలా చల్లాలి. తరవాత పెరుగు వేసి ఐదు నిముషాల పాటు కలిపాక ఇడ్లీ ముక్కలు వేసి జాగ్రత్తగా కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మంచూరియా
చిన్న (బటన్) ఇడ్లీలు - 10, టొమాటో సాస్ - రెండు టీ స్పూన్లు, సోయాసాస్ - రెండు టీ స్పూన్లు, పచ్చిమిర్చి - మూడు (పొడవుగా కట్ చేయాలి), క్యాబేజీ తురుము - పావు కప్పు, క్యారట్ తురుము - పావు కప్పు, అల్లంతురుము - కొద్దిగా, ఉల్లితరుగు - కొద్దిగా, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, కొత్తిమీర - చిన్న కట్ట
తయారి:
ముందుగా ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో అల్లం తురుము, ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపైన సోయాసాస్, టొమాటో సాస్, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీరు చల్లి దోరగా వేయించాలి. తరవాత ఇడ్లీలను అందులో వేసి మరోమారు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో పెట్టి, క్యారట్ తురుము, క్యాబేజీ తురుము చల్లి సర్వ్‌చేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఇడ్లీ బజ్జీ
ఇడ్లీలు - 4, పుదీనాచట్నీ - 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి -అరకప్పు, బియ్యప్పిండి - టేబుల్‌స్పూను, జీలకర్ర - కొద్దిగా, కారం - కొద్దిగా, ఉప్పు - తగినంత, వంటసోడా - చిటికెడు, నూనె - వేయించటానికి సరిపడినంత, గరంమసాలా- అర టీస్పూను, టొమాటోకెచప్ - తగినంత
తయారీ:
ముందుగా ఒక ఇడ్లీకి పుదీనా చట్నీ రాసి మధ్యకి కట్ చేయాలి. ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, గరంమసాలా, వంటసోడా, టీ స్పూన్ నూనె, తగినంత నీరు... వేసి బజ్జీపిండిలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో డీప్ ఫ్రైకి సరిప డేంత నూనె పోసి కాగాక, పుదీనా రాసిన ఇడ్లీముక్కలు రెండింటిని కలిపి బజ్జీమాదిరిగా పిండిలో ముంచి నూనెలో వేయాలి. బంగారురంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. వీటిని టొమాటో కెచప్‌తో సర్వ్ చేయాలి.
గమనిక:
ఇడ్లీలను కట్ చేసేటప్పుడు, బజ్జీపిండిలో ముంచేటప్పుడు ఇడ్లీ విరిగిపోవటం, పొడిరాలటం... వంటివి జరగకుండా జాగ్రత్త వహించాలి.
ఇడ్లీల కథా కమామీషు(History of Idlis):
‘ఇడు’ అంటే ‘నెమ్మదిగా తయారవడం’, ‘అవి’ అంటే ‘ఆవిరి మీద ఉడికించడం.’
తయారుచేసుకున్న పిండిని ఇడ్లీ రేకుల మీద నెమ్మదిగా వేసి, ఆవిరి మీద ఉడికించడమన్నమాట. అంటే ఇడ్లీ అనే పదంలో రెండు పనులు నిండి ఉన్నాయని అర్థం.
మొదట్లో ‘ఇత్తవి’ అని పిలిచేవారు. తరవాత ‘ఇత్తలి’గా మారి, చివరికి ‘ఇడ్లీ’గా స్థిరపడింది.
ఇడ్లీలు 7వ శతాబ్దం నుంచి భారతదేశంలో వాడకంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇలా ఆవిరిమీద పదార్థాలను తయారుచేయడం అనేది భారతీయులకు ఇండోనేషియా నుంచి అలవడినట్లు ఎన్‌సైక్లోపిడియా చెబుతోంది. ఆవిరి పద్ధతిలో నేడు తయారవుతున్న ఇడ్లీకి మూల కారణం ఇండోనేషియానే.
ఇడ్లీ పదాన్ని మొట్టమొదట కన్నడ ప్రాంతం లో వాడినట్లు తెలుస్తోంది. పొట్టుమినప్పప్పును నానబెట్టి వీటిని తయారుచేసేవారని కొన్ని పుస్తకాలు తెలియచేస్తున్నాయి.
రెండవ చాముండరాయ రచించిన ‘లోకోపకార’ అనే ఎన్‌సైక్లోపీడియాలో, మినపప్పును మజ్జిగలో నానబెట్టి, మెత్తగా రుబ్బి, అందులో పెరుగు మీద ఉండేనీరు, సుగంధద్రవ్యాలు వేసి ఇడ్లీ తయారుచేసినట్టు తెలుస్తోంది.
సంస్కృతంలో రచించిన ‘మానసోల్లాసం’ గ్రంథంలో ఇడ్లీ తయారీలో బియ్యపురవ్వ వాడిన జాడలు కనిపించలేదు.
ఇడ్లీరవ్వను ఉపయోగించడం 17 వ శతాబ్దం తరవాత మాత్రమే వాడకంలోకి వచ్చింది. ఈ రవ్వ ఉపయోగించడం వల్ల ఇడ్లీ తయారీ త్వరగా పూర్తవుతోంది కాబట్టి దీనిని వాడటం ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
ఏది ఏమైనా ఇడ్లీలో ఉపయోగించే పదార్థాలలో మార్పు వచ్చినప్పటికీ పేరు మాత్రం మారలేదు.

