Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Recipes with Mushroom

పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా?
 మనలో చాలామందికి డౌట్.
 దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం!
 డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది
 ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే’ అని!!
 ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్‌తో చెయ్యండి.
 ఈ ఆదివారం మీ డైనింగ్ హాల్‌ని...
 ఖుష్‌రూమ్‌గా మార్చండి.


డీప్ మష్రూమ్ కర్రీ


 కావలసినవి:
 మష్రూమ్స్ - 2 కప్పులు
 చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టాలి)
 ఉప్పు - తగినంత
 గరంమసాలా - టీ స్పూను
 శనగపప్పు - టేబుల్ స్పూను
 మిరియాల పొడి - టీ స్పూను
 నూనె - 2 టీ స్పూన్లు,
 ఆవాలు - అర టీ స్పూను
 ఎండుమిర్చి - 2
 కొత్తిమీర - కొద్దిగా
 టొమాటో ముక్కలు - పావు కప్పు
 కరివేపాకు - 2 రెమ్మలు

 తయారి:
 చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి

 బాణలిలో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి

 పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక టొమాటో ముక్కలు వేయించాలి. మష్రూమ్‌ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి

 చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి

 కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.


అలసందలు మష్రూమ్ కర్రీ


 కావలసినవి:
అలసందలు - 50 గ్రా.
  మష్రూమ్స్ - 200 గ్రా.,
 ఉల్లితరుగు - పావు కప్పు టొమాటో తరుగు - అర కప్పు పచ్చిమిర్చితరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కారం - అర టీ స్పూను  పసుపు - చిటికెడు, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, జీడిపప్పులు - 8
 జీలకర్ర - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - టే బుల్ స్పూను, ఉప్పు - తగినంత

 తయారి:  
 అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి

 పాన్‌లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి

 ధనియాలపొడి, జీడిపప్పు, టొమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి

 బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి

 మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి

 ఉడికించిన అలసందలు, అర కప్పు నీరు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి

 గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.



మష్రూమ్ ఫ్రై



 కావలసినవి:
 మష్రూమ్ ముక్కలు - కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కొత్తిమీర - టీ స్పూను, కరివేపాకు పొడి - టీ స్పూను, నిమ్మరసం - టీ స్పూను, నూనె - 5 టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు

 తయారి:
 ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి

 బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి

 మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి

 నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి.  

మష్రూమ్ టొమాటో పాస్తా కర్రీ


 కావలసినవి:
 పాస్తా /మాక్రోనీ/ మీల్‌మేకర్ - అర కప్పు, ఉప్పు - తగినంత, నానబెట్టిన మష్రూమ్ ముక్కలు - కప్పు, టొమాటోతరుగు - అర కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పుదీనా ఆకులు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 3, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పులు - 6, ఏలకుల పొడి - టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూను, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, కొత్తిమీర - తగినంత

 తయారి:
 గిన్నెలో పాస్తా, తగినంత నీరు, ఉప్పు వేసి కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి

 బాణలిలో టేబుల్ స్పూన్ నూనె కాగాక వెల్లుల్లి రేకలు వేయించాలి

 పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏలకుల పొడి జత చేసి వేయించాలి

 ఉల్లితరుగు, టొమాటో తరుగు వేసి, మెత్తబడేవరకు వేయించి, దించేసి, చల్లారాక, ఈ మిశ్రమానికి పుదీనా ఆకులు జతచేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి

 బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగాక, క్యాప్సికమ్ తరుగు, ఉడికించిన పాస్తా, మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి

 కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి

 కొద్దిగా నీరు జత చేసి నాలుగైదు నిముషాలు ఉడికించి దించేయాలి

 కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.


కొరమీను మష్రూమ్ పొరటు


 కావలసినవి:
 ఉడికించిన కొరమీనులు - కప్పు, మష్రూమ్ ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను,
 ఉల్లితరుగు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 6 అల్లం పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
 సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
 నిమ్మరసం - టేబుల్ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ
 గరంమసాలా - అర టీ స్పూను, పసుపు - చిటికెడు
 ఉప్పు - తగినంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు

 తయారి:
 బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి

 అల్లం పేస్ట్, వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి 5 నిముషాల తరవాత మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, నీరు జతచేసి మూత పెట్టాలి

 ముక్కలు ఉడికిన తర్వాత, ఉడికించి ఉంచుకున్న కొరమీనులు, సోయా సాస్ వేయాలి  గరంమసాలా, నిమ్మరసం, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html