Mango Sweets - మామిడి స్వీట్స్
ఇన్నాళ్లూ ఎండలకు మగ్గిపోయాం.ఇప్పుడిక... వేసవి తట్టాబుట్టా సర్దుకుంటోంది.
ఫ్చ్! ఒట్టితట్ట, ఒట్టిబుట్ట అయితే పర్లేదు.
మగ్గిన మామిడిపండ్ల తియ్యటి వాసన కూడా...
వాటితో పాటే వెళ్లిపోతోందే!
‘బంగినపండ్లు’, రసాల కోసం మళ్లీ ఏడాది వరకు కళ్లు కాయలు కాయాల్సిందేనా!
తప్పదు... సీజన్‌కి ఫేర్‌వెల్ చెప్పాల్సిందే.
పండ్లను నోరారా జుర్రుకున్నది చాలు.
చివరికాపుతోనైనా స్వీట్స్ చేసుకుని ఆరగించండి.
‘మ్యాంగోవర్’ వదులుతుంది.
మామిడి లడ్డు
మామిడిపండ్లు - రెండు
పంచదారపొడి - 150 గ్రా.
ఏలకులపొడి - పావు టీ స్పూను
నెయ్యి - అరకప్పు
శనగపిండి - 300 గ్రా.
జీడిపప్పు + ఎండుద్రాక్ష - పావుకప్పు
తయారి:
మామిడిపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి
స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, శనగపిండి వేసి దోరగా వేయించాలి
వెడల్పాటి పళ్లెంలో... వేయించిన శనగపిండి, పంచదారపొడి, ఏలకులపొడి వేసి బాగా కలిపి, ముందుగా తీసిపెట్టుకున్న మామిడిరసాన్ని చేర్చాలి
చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ, ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చేసుకోవాలి
వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్షలను అక్కడక్కడా అలంకరిస్తే చాలు, ఎంతో రుచికరమైన లడ్డు తయారయినట్లే.
మామిడి బర్ఫీ
మామిడిపండ్లు - 2 (పెద్దవి)
పంచదార - అర కిలో; ఏలకులపొడి - టీ స్పూను
జీడిపప్పు - పావు కప్పు; గోధుమపిండి - 125 గ్రా.
శనగపిండి - 125 గ్రా.; పచ్చికొబ్బరితురుము - కప్పు,
నెయ్యి - 6 టీ స్పూన్లు
తయారి:
మామిడిపండ్లను బాగా కడిగి, రసం తీసి పెట్టుకోవాలి.
బాణలిని స్టౌ మీద ఉంచి, టీ స్పూను నెయ్యి వేసి వేడయ్యాక గోధుమపిండి, శనగపిండి... రెండిటినీ వేసి. మాడు వాసన రాకుండా వేయించుకోవాలి.
ఒక పాత్రలో కొద్దిపాటి నీరు తీసుకుని పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముదురుపాకం వచ్చేవరకు కలపాలి.
శనగపిండి, గోధుమపిండి వేసి బాగా కలిపి ఏలకుల పొడి చల్లాలి.
స్టౌ కట్టేసి, ముందుగా తీసిపెట్టుకున్న మామిడిరసం, కొబ్బరితురుము చేర్చి మరోసారి కలియబెట్టాలి. నెయ్యి రాసిన వెడల్పాటి పళ్లెంలోకి ఈ మిశ్ర మాన్ని మార్చాలి.
జీడిపప్పు పలుకులతో గార్నిష్‌చేయాలి.
చల్లారుతుండగా మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకుంటే రుచికరమైన మామిడిబర్ఫీ రెడీ అయినట్లే.
మామిడి రసగుల్లా
మామిడిపండ్లు - రెండు; మైదా - రెండు కప్పులు
పంచదార - ఒక కప్పు; కోవా - 150 గ్రా.
ఏలకులపొడి - చెంచా; పాలు - అరకప్పు
తయారి:
ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి.
బాణలిలో నెయ్యి వేసి స్టౌమీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాత్రలో మామిడిపండ్ల రసం, ఏలకుల పొడి వేసి కలపాలి.
వేయించి పెట్టుకున్న మైదా ఉండల్ని వేసి నాననివ్వాలి.
ఫ్రిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.
మామిడికాయ పకోడీ
మామిడికాయ తురుము - అర కప్పు; బంగాళదుంపల తురుము - పావు కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; శనగపిండి - అర కప్పు; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానకి తగినంత
తయారి:
ఒక గిన్నెలో మామిడితురుము, బంగాళదుంపల తురుము, ఉల్లి తరుగు, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లతో పకోడీ పిండిలా కలిపి పదినిముషాలు పక్కన ఉంచాలి.
స్టౌ మీద బాణలి ఉంచి, అందులో నూనె పోసి కాగాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి.
సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.
మామిడి ఆవడ
మినప్పప్పు - కప్పు; పెరుగు - రెండు కప్పులు; మామిడికాయ తురుము - కప్పు; పచ్చిమిర్చి - 4; అల్లం - చిన్నముక్క; జీలకర్ర - టీ స్పూను; మిరియాలు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; క్యారట్ తురుము - టేబుల్ స్పూను; అల్లం పేస్ట్ - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత; తాలింపుగింజలు - టీ స్పూను, డ్రైఫ్రూట్స్ - కొద్దిగా
తయారి:
మినప్పప్పును సుమారు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి
మామిడితురుములో సరిపడా ఉప్పు కలిపి, కొద్దిసేపు ఉంచి తరువాత తురుములో ఉండే నీరంతా గట్టిగా పిండి తీసేయాలి
పెరుగులో అల్లం పేస్టు, పచ్చిమిర్చిముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, క్యారట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి
స్టౌ మీద బాణలి ఉంచి అందులో రెండు చెంచాల నూనె వేసి వేడి చేసి తాలింపుగింజల్ని వేసి వేయించి, పెరుగులో వేయాలి
నానపెట్టుకున్న మినప్పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్‌లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి
మామిడితురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మరోమారు రుబ్బాలి
బాణలిలో నూనెపోసి వేడి అయ్యాక రుబ్బి ఉంచుకున్న పిండిని గారెల్లా వేయాలి
వేగిన గారెలను ఒక నిముషం పాటు నీటిలో ఉంచి తీసి పెరుగులో వేయాలి. డ్రైఫ్రూట్స్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మామిడి ఆవడలు రుచిగా ఉంటాయి.

