Offering to God - నైవేద్య లక్ష్మి
శ్రావణమాసం...పండగ మాసం
కోరి కొలిచేవారికి కొంగుబంగారమైసంపదలు మెండుగా కురిపించే మాసం ప్రకృతి లక్ష్మి పచ్చని చీరనుసింగారించుకొని మురిసిపోయే వేళకు పచ్చని గడపల్లో వెలుగుల దివ్వెలను తీర్చిదిద్ది శ్రావణలక్ష్మికి ఆహ్వానం పలుకుతాయి తెలుగు లోగిళ్లు.
సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం...
అన్నీ కొలువుండే ఇల్లు ఆనందాల హరివిల్లు.
ఆ సిరులన్నీ తెలుగింట కురిపించే అష్టలక్ష్ములకు ఇష్టమైననైవేద్యపు వంటకాలు ఈ వారం..
చక్కెర పొంగల్
బియ్యం - గ్లాసు
పాలు - అర గ్లాసు
పెసరపప్పు - అర గ్లాసు
పంచదార - 2 గ్లాసులు
పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు
జీడిపప్పు - పది పలుకులు
నెయ్యి - తగినంత
తయారి:
బియ్యం, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. మూడు గ్లాసుల నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. విడిగా నెయ్యిలో జీడిపప్పు, కొబ్బరి వేయించాలి. పప్పు బియ్యం ఉడికిన తర్వాత పంచదార వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు, కొబ్బరి, నెయ్యి వేసి కలిపి, దించాలి.
చక్కెర పూరీలు
మైదాపిండి - 250 గ్రా.
పంచదార - 100 గ్రా.
ఏలకులు - 2
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
మైదాపిండిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. చిన్న చిన్న పిండిముద్దలు తీసుకొని, పూరీలా వత్తుకోవాలి. పంచదార, ఏలకులు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత పూరీలను వేయించి, వేడిమీదనే పంచదార పొడి చల్లాలి.
పులిహోర
బియ్యం - గ్లాసు
చింతపండు - 150 గ్రా.
ఉప్పు - తగినంత
ఎండుమిరపకాయలు - నాలుగు
పచ్చిమిర్చి - 2 (నిలువుగా చీరాలి)
ఆవాలు - అర టీ స్పూన్
శనగపప్పు - టీ స్పూన్
మినపప్పు - టీ స్పూన్
పల్లీలు - టేబుల్‌స్పూన్
జీలకర్రపొడి - టీ స్పూన్
జీడిపప్పు - 10 పలుకులు
పసుపు - తగినంత
ఇంగువ - చిటికెడు
తయారి:
ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచాలి. అన్నం వండి, పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, శగనపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ వేసి వే యించాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఒక బేసిన్‌లో అన్నం విడదీసి, కొద్దిగా పసుపు, నూనె వేసి కలిపాలి. అందులో ఉడికించిన చింతపండు గుజ్జు, జీలకర్రపొడి వేసి అన్నానికంతా పట్టేలా కలపాలి.
పోలి పూర్ణం బూరెలు
శనగపప్పు - కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
ఏలకులు - 6
పచ్చి కొబ్బరి తురుము - కప్పు
మినప్పప్పు - కప్పు
బియ్యం - 2 కప్పులు
నూనె - తగినంత
తయారి:
శనగపప్పు రెండుగంటలు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, రుబ్బాలి. ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి, ఆవిరి మీద ఉడికించాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని, పంచదార, ఏలకులపొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేయాలి. రెండుగంటల సేపు నానబెట్టిన మినపప్పు, బియ్యం కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిలో శనగపప్పు ఉండను ముంచి, కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి.
దద్ధ్యోదనం
కావలసినవి:
బియ్యం - కప్పు;
పెరుగు - కప్పు; కొత్తిమీర - తగినంత
ఆవాలు - టీ స్పూన్; ఎండుమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క (దంచాలి)
ఉప్పు - తగినంత; శనగపప్పు - టేబుల్ స్పూన్
మినపప్పు - టేబుల్ స్పూన్; నెయ్యి - టేబుల్ స్పూన్
మిరియాలు - టీ స్పూన్; పసుపు - చిటికెడు
తయారి:
బియ్యంలో మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించి, చల్లారాక పెరుగు వేసి కలపాలి. బాణలిలో నెయ్యి వేసి, వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. ఈ పోపు పెరుగు అన్నంలో కలపాలి.
ఉండ్రాళ్లు
బియ్యం రవ్వ - గ్లాసు
శనగపప్పు - అర గ్లాసు
జీలకర్ర - టీ స్పూన్
ఉప్పు - తగినంత
తయారి:
శనగపప్పులో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. పప్పు ఉడుకుతున్నప్పుడే జీలకర్ర, ఉప్పు, బియ్యం రవ్వ వేసి ఉడికించాలి. చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి, ఆవిరి మీద ఉడికించాలి.
పులగం
బియ్యం - ఒకటిన్నర కప్పు
పెసరపప్పు - అర కప్పు; నెయ్యి - టేబుల్ స్పూన్
జీలకర్ర - టీ స్పూన్; మిరియాలు - పావు టీ స్పూన్
ఉప్పు - తగినంత; నీళ్లు - మూడున్నర కప్పులు
జీడిపప్పు - 10 పలుకులు
తయారి:
బియ్యం, పప్పు కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి. గిన్నెలో నెయ్యి వేడయ్యాక, జీలకర్ర, మిరియాలు వేసి, వేయించాలి. నీళ్లు పోసి, మరుగుతుండగా, నానెబట్టిన బియ్యం పప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అన్నం అయ్యాక జీడిపప్పు పలుకులు వేసి కలపాలి

