mansoon mazaa - మాన్‌సూన్మజా
సాయంకాలం టీ వేళకు.. చిరుజల్లులు పడుతుంటేవేడి వేడి పకోడీలు వంటింట్లో వేగుతుంటే ఆ ఘుమఘుమలకే గుండె లయ తప్పుతుంది..
పొయ్యి మీద నుంచి ప్లేట్లో పడగానే హాం ఫట్ అనిపించడంలో పిల్లలతో పాటు పెద్దలూ పోటీపడుతుంటారు.
విసుక్కున్నా, కసురుకున్నా ... ఆత్మీయతల విందులో పకోడీలు ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటాయి.
వాన వేళకు వేడి వేడిగా పకోడీలు వేయించండి.
ఆవురావురుమనే నోళ్లకు ఆనందాన్ని పంచండి.
మటర్ పకోడ
కావలసినవి:
పచ్చిమిర్చిపేస్ట్ - టీ స్పూన్
ఉప్పు - తగినంత
చాట్ మసాలా - టీ స్పూన్
గరం మసాలా - చిటికెడు
పంచదార -చిటికెడు
జీలకర్రపొడి - అర టీ స్పూన్
నువ్వులు - అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
మైదా - 100 గ్రా.
నెయ్యి - 10 గ్రా.
కొబ్బరి తురుము - టీ స్పూన్
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
బఠానీలను ఉడికించి, నీళ్లు వడబోయా లి. ఉడికిన బఠానీలను పప్పుగుత్తితో చిదమాలి.
పెనం మీద నెయ్యి వేసి, వేడయ్యాక బఠానీల మిశ్రమం, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, పంచదార, జీలకర్ర పొడి, నువ్వులు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించాలి.
మైదాలో నీళ్లు పోసి పూరీ పిండిలా కలపాలి.
పిండి ముద్దను పూరీసైజులో ఒత్తాలి.
దీంట్లో ఉడికించిన బఠానీల మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, రోల్ చేసి, చివరలు మడిచేయాలి.
ఇలా తయారు చేసి పెట్టుకున్న పకోడీ లను నూనెలో రెండు వైపులా వేయించి పక్కన పెట్టుకోవాలి.
వీటిని టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
గోంగూర పకోడ
కావలసినవి:
పసుపు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూన్; ఉప్పు - తగినంత
ఆవాలు-జీలకర్ర - అర టీస్పూన్; ఆమ్చూర్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు
అల్లం, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు - 30 గ్రా.;
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్; మైదా - 100 గ్రా.; నెయ్యి - 10 గ్రా.
కొబ్బరి పొడి - టీ స్పూన్; సోంపు - పావు టీ స్పూన్
తయారి:
పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి.
గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి.
మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి.
దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్‌లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి.
ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి.
ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.
శాండ్‌విచ్ పనీర్ పకోడ
కావలసినవి:
పచ్చిమిర్చి - 50 గ్రా.; కొత్తిమీర - 50 గ్రా.
కారం - టీ స్పూన్; పసుపు - చిటికెడు; ఉల్లిపాయలు - 1
ఉప్పు - తగినంత; శనగపిండి - 100 గ్రా.
వాము- చిటికెడు; జీలకర్రపొడి - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత
తయారి:
పనీర్‌ను సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి.
బ్రెడ్ సైడ్స్ తీసేసి, త్రికోణాకారంలో కట్ చేయాలి.
శనగపిండిలో వాము, ఉప్పు, నీరు వేసి జారుగా కలపాలి.
బంగాళదుంపను ఉడికించి, గరిటతో చిదమాలి. పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్రపొడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి.
కడాయిలో నూనె పోసి, వేడయ్యాక బ్రెడ్ స్లైస్‌కు పనీర్ స్లైసులను రెండువైపులా పెట్టి, అదమాలి. తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని, పనీర్ మీదుగా ఉంచి, శనగపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగు వ చ్చేవరకు వేయించాలి.
పుదీనా చట్నీతో లేదా టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి.
ఆలూ పనీర్ బోండా
కావలసినవి:
పనీర్ - 100 గ్రా.; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు
ఉల్లిపాయలు - 50 గ్రా.; గరం మసాలా - చిటికెడు
జీలకర్రపొడి - చిటికెడు; శనగపిండి - 100 గ్రా.
వాము - చిటికెడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
పనీర్‌ను, బంగాళదుంపను తురుముకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు పసుపు, ఉల్లిపాయలు, జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని, బాల్స్ చేయాలి.
శనగపిండిలో వాము, చిటికెడు కారం, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కలపాలి.
తయారు చేసుకున్న పనీర్ బాల్స్‌ను శనగపిండిలో ముంచి, తీసి కాగుతున్న నూనెలో వేసి, వేయించాలి.
వేడి వేడిగా వడ్డించాలి.
పెసర పప్పు పకోడ
కావలసినవి:
కారం - చిటికెడు; పచ్చిమిర్చి తరుగు - టేబుల్‌స్పూన్; ఉప్పు - తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టీ స్పూన్;
జీలకర్రపొడి - చిటికెడు; నూనె - వేయించడానికి తగినంత
తయారి:
పెసరపప్పును ఓ గంట సేపు నానబెట్టి, నీటిని వడకట్టాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లిపాయ తరుగు, కారం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీలకర్రపొడి పెసరపిండిలో వేసి కలపాలి.
పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాల్స్ చేయాలి.
ఈ బాల్స్‌ని నూనెలో వేసి వేయించాలి.
పుదీనా చట్నీతో పెసరపప్పు పకోడీలను వేడి వేడిగా వడ్డించాలి.
మకాయి పకోడ
కావలసినవి:
ఉల్లిపాయ తరుగు - 50 గ్రా.; కొత్తిమీర తరుగు - టీ స్పూన్
పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు తరుగు - టీ స్పూన్
జీలకర్ర పొడి - టీ స్పూన్; శనగపిండి - 100 గ్రా.;
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
నూనె -వేయించడానికి తగినంత
తయారి:
ఒక బేసిన్‌లో శనగపిండి, మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కరివేపాకు, జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కొద్దిగా నీళ్లు కలిపి ముద్దలా చేయాలి.
కడాయిలో నూనె పోసి, కాగిన తర్వాత, కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని నూనెలో వేయించాలి.
గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, టొమాటో సాస్‌తో వేడి వేడిగా వడ్డించాలి.

