Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

kashmIr kichen - కాశ్మీర్ కిచెన్

అటువైపు హిమశిఖరం
ఇటువైపు దాల్ లేక్
ఆ వైపు పూల కెరటం
ఈ వైపు ఆపిల్స్ వనం
కాశ్మీర్‌ను చూసే అదృష్టం అందరికీ దక్కదు
కాని కాశ్మీర్ రుచిని దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు
ఇక్కడ మెనూ చూడండి ఈ ఆదివారం వీటితో ఇంటిల్లిపాదీ కాశ్మీర్‌లో గడపండి


కాశ్మీరీ పులావ్

కావలసినవి :
బాస్మతి బియ్యం - పావు కిలో, పాలు - 100 మి.లీ.
పంచదార - టీస్పూను, ఏలకుల పొడి - అర టీ స్పూను
సోంపు పొడి - అర టీ స్పూను, పండ్లముక్కలు - కప్పుడు
నెయ్యి - 2 టీ స్పూన్లు, స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు
జీడిపప్పు పలుకులు - 20

తయారి:
బాస్మతి బియ్యాన్ని పలుకుగా (హాఫ్ బాయిల్డ్) ఉడికించి నీళ్లు వంపేసి ఆరబెట్టాలి (ఇలా చేయడం వలన బాస్మతి బియ్యానికి ఉండే సువాసన పోకుండా ఉంటుంది). ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక పంచదార, ఏలకులపొడి, సోంపుపొడి, పండ్లముక్కలు, జీడిపలుకులు, నెయ్యి వేసి బాగా కలపాలి.

ఇందులో హాఫ్ బాయిల్డ్ రైస్ వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. పాలు పూర్తిగా ఇంకిన తరవాత పులావ్‌ను బౌల్‌లోకి తీసి పైన స్వీట్‌క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.

కాశ్మీరీ నాన్

కావలసినవి :
మైదా - పావు కేజీ, పాలు - 100 మి.లీ, జామ్ - తగినంత,
పంచదార - టీ స్పూను, ఉప్పు - తగినంత, బటర్ - తగినంత
పనీర్‌తురుము - అర టీ స్పూను, పండ్లముక్కలు - కప్పుడు (పైనాపిల్, అరటిపండు, బొప్పాయి, ఆపిల్)
గార్నిషింగ్ కోసం: జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర

తయారి:
ఒక బౌల్‌లో మైదా, పాలు, పంచదార, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. తరవాత ఉండలు చేసి నచ్చిన ఆకారంలో నాన్‌ని ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి నాన్‌ని పచ్చిపచ్చిగా కాల్చి తీసేయాలి. దానికి ఒకవైపు జామ్ పూసి, దాని మీద పండ్లముక్కలు గట్టిగా అదిమి, మరోమారు పెనం మీద బటర్ వేసి రెండువైపులా కాల్చాలి. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర, పనీర్‌తురుములతో గార్నిష్ చేయాలి.

పాలక్ కాశ్మీర్ కోఫ్తా

కావలసినవి :
పాలకూర - 100 గ్రా., ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత,
జీలకర్ర - అర టీ స్పూను, మైదా - రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 50 గ్రా.
నీరు - తగినంత, ఏలకుల పొడి - అర టీస్పూను, స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు,
ధనియాలపొడి - టీ స్పూను, కసూరీ మేథీ - టీ స్పూను

తయారి:
ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు జత చేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పాన్‌లో టీ స్పూను నూనె కాగిన తరవాత అందులో జీలకర్ర వేసి దోరగా వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి కోఫ్తా(బాల్స్ మాదిరి)లా తయారుచేసుకోవాలి. పాన్‌లో నూనె కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను డీప్ ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పులో తగినంత నీరు పోసి పేస్ట్ (మరీ పల్చగా ఉండకూడదు) చేయాలి. ఒక పాన్‌లో ఈ పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఏలకులపొడి, ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి రెండు నిముషాలు ఉడికించితే గ్రేవీ తయారవుతుంది. ఇందులో పాలక్ కోఫ్తాలు వేసి ఐదునిముషాలు ఉంచితే పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ అయినట్లే.

నవరతన్ కుర్మా

కావలసినవి :
పండ్లముక్కలు (ఆపిల్, పైనాపిల్, చెర్రీ, టూటీఫ్రూటీ వంటివి) అన్నీ కలిపి - 50గ్రా, క్యారట్, బీన్స్, ఆలు (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి ఉడికించినవి) - 100 గ్రా, పచ్చికొబ్బరి తురుము - 50 గ్రా, స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు, జీడిపప్పు - 50 గ్రా, పసుపు - చిటికెడు, ఏలకుల పొడి - అర టీ స్పూను,పంచదార - టీ స్పూను, ధనియాలపొడి - టీ స్పూను, గసగసాలు - 10 గ్రా,
కసూరి మేథీ - టీ స్పూను, ఉప్పు - తగినంత

తయారి:
జీడిపప్పు, నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి కాగాక జీలకర్ర, ఉల్లితరుగు, జీడిపలుకులు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత పసుపు, ఏలకులపొడి, పంచదార, ధనియాలపొడి, పచ్చికొబ్బరితురుము, గసగసాలు, కసూరీ మేథీ, ఉప్పు వేసి ఉడికించిన తరవాత పండ్ల ముక్కలు, ముందుగా ఉడికించి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి సుమారు ఐదు నిముషాలు ఉడికించిన తరువాత స్వీట్‌క్రీమ్ వేసి కలిపి దింపేయాలి. ఇది రోటీలలోకి రుచిగా ఉంటుంది.

దమ్ ఆలూ కాశ్మీరీ

కావలసినవి :
బేబీపొటాటో (చిన్నబంగాళదుంపలు)- పావుకేజీ, నూనె - 100 గ్రా, పాలు - 15 మి.లీ,
జీడిపప్పు - 50 గ్రా, వెన్న - రెండు టీ స్పూన్లు
ఉల్లితరుగు - పావు కప్పు, జీలకర్ర - కొద్దిగా
పెరుగు - పావు కప్పు, కాశ్మీరీ మిర్చిపొడి - నాలుగు టీ స్పూన్లు, అల్లం తురుము - టీ స్పూను, జీడిపప్పు పలుకులు - 20, పండ్లముక్కలు - పావు కప్పు, కసూరిమేథీ - అర టీ స్పూను, ధనియాలపొడి - అర టీ స్పూను
పనీర్ తురుము - అర టీ స్పూను, పంచదార - టీ స్పూను, ఉప్పు - తగినంత

తయారి:
ముందుగా పొట్టు తీసిన బంగాళ దుంపలకు చిన్న చిన్న గాట్లు పెట్టి ఉప్పునీటిలో 20 నిముషాలు ఉంచాలి. పాన్‌లో నూనె కాగిన తరవాత దుంపలను నూనెలో వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. పెరుగులో కాశ్మీరీమిర్చిపొడి, అల్లం తురుము, ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి బాగా కలిపాక వేయించి ఉంచుకున్న బంగాళదుంపలను ఇందులో వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పు, పాలు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. (ఈ మిశ్రమం చిక్కగా ఉండాలి). పాన్‌లో వెన్న కాగాక ఉల్లితరుగు, జీలకర్ర, జీడిపలుకులు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత ఇందులో జీడిపప్పు పేస్ట్ వేయాలి. మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీరు పోస్తే గ్రేవీలా తయారవుతుంది.

గ్రేవీ బాగా ఉడికిన తరవాత అందులో పండ్లముక్కలు, పెరుగులో నానబెట్టి ఉంచుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. చివరగా కసూరీమేథీ, ధనియాలపొడి, పనీర్ తురుము, పంచదార, ఉప్పు వేసి మరోమారు కలిపి అయిదారు నిముషాలు ఉడికించి దింపేయాలి. అది అన్నం, రోటీ, నాన్‌లలోకి రుచిగా ఉంటుంది.


స్వీట్‌క్రీమ్ లేదా మిల్క్‌మెయిడ్‌ను కాశ్మీరీ వంటకాలలో ఎక్కువగా వాడతారు. దీనిని ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. అర కప్పు పాలపొడి, అరకప్పు పంచదార, 50 గ్రా. ఉప్పు లేని బటర్, మూడు నాలుగు టీ స్పూన్ల గోరువెచ్చని నీరు... వీటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే మిల్క్‌మెయిడ్ తయారవుతుంది.

కసూరీ మేథీ ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. దీన్ని ఇంటిదగ్గరే తయారుచేసుకోవచ్చు. మెంతి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి వంటకంలోనూ వాడవచ్చు. దీనివల్ల వంటకానికి రుచి రావడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇలా చేయండి...
కాశ్మీరీలు వంటకాల తయారీలో పెరుగును ఎక్కువగా ఉపయోగిస్తారు.

కాశ్మీరు ఆపిల్స్‌కి ప్రసిద్ధి అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వారి వంటకాలలో కూడా ఆపిల్, పైనాపిల్, గ్రీన్ గ్రేప్స్, డ్రైఫ్రూట్స్... వీటిని వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువలన వంటకాల రుచి రెండింతలు ఇనుమడిస్తుంది.

సువాసన కోసం ఇంగువ, శొంఠి వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వంటల తయారీలో ఆవనూనె ఎక్కువ ఉపయోగిస్తారు.

రోటీలలోకి ముల్లంగి, గుమ్మడికాయ, డ్రైఫ్రూట్స్ వంటివాటితో చేసిన చట్నీలను ఇష్టపడతారు.

కాశ్మీరీలు అల్లం, వెల్లుల్లి తినరు. అయితే కాలానుగుణంగా ఆ అలవాటును మానుకున్నారు.

నాన్, రోటీల వంటివి మృదువుగా రావడం కోసం పిండి కలిపేటప్పుడు అందులో పాలు, అరటిపండు, కోడిగుడ్డు, పంచదార వంటి వాటిని వాడతారు.

నాన్‌ల వంటివాటిని చేసుకునేటప్పుడు... నాన్‌లను పచ్చిపచ్చిగా కాల్చిన తరవాత పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్ గట్టిగా అదిమి రెండువైపులా కాల్చి, ఆ తరవాత బటర్ అప్లై చేస్తారు.

కాశ్మీరీ మిరపకాయలు ప్రత్యేకించి సూపర్‌మార్కెట్‌లో దొరుకుతాయి. అవి చూడటానికి ఎరుపురంగులో లేకపోయినా, కారం మాత్రం మంచి ఎరుపులో ఉండి, కమ్మగా ఉంటుంది.

మిల్క్‌మెయిడ్‌తో తయారుచేసే వంటకాలలో కుంకుమపువ్వు వాడితే రంగు, రుచి బావుంటాయి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html