పోగో చానల్(Pogo channel) చూసేటప్పుడు పిల్లల్ని గమనించండి. కళ్లప్పగించేస్తారు.
వాళ్లకు ఈ లోకమే పట్టదు. వినోదం పంచే రుచి అలాంటిది.
మరి జిహ్వకు నచ్చే రుచి? తినిపిద్దామని ప్రయత్నించే తల్లులను పరిగెత్తించకుండా నోరప్పగించి వారు తినాలంటే ఏం చేయాలి?
ఇవిగో ఈ పేజీలో వడ్డించిన స్నాక్స్ తయారు చేయాలి.
ప్లేట్ చూడగానే టేస్టీ చానల్ చూసినట్టుగా అనిపిస్తే పిల్లలు లొట్టలు వేయడం ఖాయం. సంతోషంతో తల్లుల కడుపు నిండడం ఖాయం...
స్ప్రింగ్ రోల్స్(Spring Rolls)
మెదా - 4 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నీరు - తగినంత, స్టఫింగ్ కోసం, క్యాబేజీ తురుము - అర కప్పు, క్యారట్ తురుము - అర కప్పు; ఉల్లికాడలు - రెండు టీ స్పూన్లు; సెలిరీ తురుము - రెండు టీ స్పూన్లు; నూనె - తగినంత; ఉప్పు - రుచికి సరిపడా; పంచదార - అర టీ స్పూను; సోయా సాస్ - ఒకటిన్నర టీ స్పూను; చిల్లీ సాస్ - టేబుల్ స్పూను; టొమాటో సాస్ - టేబుల్ స్పూను
తయారి:
ఒకపాత్రలో మైదా, ఉప్పు, నీరు పోసి చిక్కటి మజ్జిగలా బాగా కలుపుకోవాలి. గుండ్రంగా ఉన్న ఒక మందపాటిపాత్రను స్టౌ మీద ఉంచి అందులో చిన్న గరిటెడు పిండి అంచులవరకు అంటేలా పోయాలి. సుమారు రెండునిముషాలు కొద్దిగా కాగిన తరువాత అది రోల్ చేయడానికి వీలుగా అవుతుంది. దానిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక బౌల్‌లో కూరగాయల తురుములను వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు అయిన తరవాత అందులో సోయాసస్, టొమాటోసాస్, ఉప్పు, పంచదార వేసి రెండుమూడు నిముషాలు అలాగే ఉంచాలి.
ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదాతో తయారయిన చపాతీ వంటి దానిలో ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్ చేసి రెండువైపులా మూసేసి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె బాగా కాగిన తరువాత వీటిని ఒకటొకటిగా నూనెలో జారవిడుస్తూ దోరగా వేగనివ్వాలి. సర్వ్ చేసే ముందు వీటిని రెండుగా కట్‌చేయాలి. వీటిని టోమాటోసాస్‌తో తీసుకుంటే రుచిగా ఉంటాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్(French Fries) / చిప్స్(Chips)
పెద్ద బంగాళదుంప: (ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం) పొడుగ్గా కొద్దిగా మందంగా తరగాలి; (చిప్స్ కోసం సన్నగా, పలచగా గుండ్రంగా త రగాలి); ఆలివ్ ఆయిల్: 2 టేబుల్ స్పూన్లు; రుచికోసం: ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, వెల్లుల్లి పొడులలో ఏదో ఒకటి.
తయారి:
తరిగిన బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలిపిన వీటి మీద నీరు పోసి అరగంటసేపు నానిన తరవాత నీరు ఒంపేసి తడిపోయే దాకా ఆరబెట్టాలి. (ఇలా చేయటం వలన వేయించినప్పుడు కరకరలాడతాయి) అరగంట తరవాత వీటిని 400 డిగ్రీలకు ప్రీ హీట్ చేసుకోవాలి.
టిప్ : క్యారట్ లేదా చిలకదుంపతో కూడా పైన చెప్పిన విధంగా చిప్స్, ఫ్రైస్ చేసుకోవచ్చు.
పానీ పూరీ(PAnI pUrI)
పూరీ - తగినన్ని; గ్రీన్ పీస్ - 1 కప్పు; ఆలుగడ్డ - 1; చింతపండుగుజ్జు - 1 టీస్పూను; కారం - 1 టీస్పూను; ఉప్పు -తగినంత; ఛాట్ మసాలా - అరటీస్పూను; కొత్తిమీర - 1 కట్ట
తయారి:
గ్రీన్‌పీస్, ఆలుగడ్డ ఉడికించాలి. వీటిని మెత్తగా చేసి కారం, ఉప్పు, ఛాట్‌మసాలా కొత్తిమీర కలిపి వుంచుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని చింతపండు గుజ్జు పావు టీస్పూను కారం, ఉప్పు చిటికెడు కలుపుకోవాలి. పూరీని మధ్యలో నొక్కితే గుంట పడుతుంది. అందులో కొద్దిగా గ్రీన్ పీస్ మిశ్రమం పెట్టి తయారుచేసి వుంచుకున్న నీటిలో ముంచి తీసుకోవాలి.
పూరీ తయారి:
కావలసినవి:
బొంబాయి రవ్వ - 1 కప్పు, గోధుమపిండి - 2 టీస్పూన్లు, మైదా - 2 టీస్పూన్లు, నూనె - వేయించేందుకు తగినంత, ఉప్పు - చిటికెడు
తయారి:
బొంబాయి రవ్వ, గోధుమపిండి, మైదాలో 2 టీస్పూన్లు నూనెవేసి బాగా కలుపుకోవాలి. చిన్న ముద్దతీసుకుని చిన్న పూరీ చేసి నూనెలో వేసుకోవాలి. వీటిని ఎర్రగా వేయించి తీయాలి. ఇవి వారం పాటు నిలవ ఉంటాయి. వీటిని పానిపూరీకి, దహీ పూరీకి వాడుకోవచ్చు.
హైదరాబాదీ సమోసా(HyderabadI samOsA)
గోధుమపిండి - పావుకిలో, ఉప్పు - చిటికెడు, ఉల్లితరుగు - కప్పు, ఉల్లిపరక తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - 5, క్యాబేజీ, క్యారట్ తురుము - పావుకప్పు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, నూనె - 2 టీ స్పూన్లు
తయారి:
గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక కొత్తిమీర వేసి దింపేయాలి. పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతీ సైజులో ఒత్తుకోవాలి. పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి. ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి. వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.

