చలి ఒళ్లు విదుల్చుకుని ఇంటింటికీ వచ్చేసింది. ఇంట్లో కుంపటి ఎక్కి కూర్చుంది.
బద్దకం. అది వదలాలంటే వేడి వేడి స్నాక్స్ పడాలి.
రోటీకి కారం కారం కూర తగలాలి. అదీ మజా.
పనీర్ తీసుకురండి... వెజ్ షాంగ్రీలా చేయండి.
పనీర్‌తో వెజ్ మంచూరియా అదుర్స్. రోటీలో గార్డెన్ వెజ్ భళా...
చలిని ఎంజాయ్ చేయండి. ఈ మెనూతో రుచినీ ఎంజాయ్ చేయండి.
పనీర్‌ను పసంద్ చేసుకోండి..
వెజ్ షాంగ్రీలా
క్యారట్ తురుము - 10 గ్రా
బీన్స్ తరుగు - పావు కప్పు; పనీర్ - 10 గ్రా
బఠాణీ - 10 గ్రా; ఉప్పు - తగినంత
జీడిపప్పు పలుకులు - 10 గ్రా; బ్రెడ్ క్రంప్స్ - 50 గ్రా
చైనా సాల్ట్ - అర టీ స్పూను; మిరప్పొడి - అర టీస్పూను
మిరియాల పొడి - అర టీ స్పూను
వెల్లుల్లి పేస్ట్ - టీస్పూ; చిల్లీ సాస్ -టీ స్పూను
తయారి:
ఒక బౌల్ తీసుకుని అందులో అన్నిరకాల కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత మసాలా పదార్థాలు, బ్రెడ్ క్రంప్స్ వేసి కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. వీటిని వడల మాదిరిగా ఒత్తి ఒక్కోదానిమీద జీడిపలుకు అద్ది పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించి తీసేయాలి.
గార్డెన్ వెజ్
క్యారట్ - 10 గ్రా; బీన్స్ - 5 గ్రా
బంగాళదుంప - 10 గ్రా; పనీర్ - 10 గ్రా
పచ్చిబఠాణీ - 10 గ్రా; నూనె - తగినంత
పాలకూర పేస్ట్ - 100 గ్రా
జీడిపప్పు పలుకులు - 5 గ్రా
మిరప్పొడి - అర టీ స్పూను
జీలకర్ర పొడి - అర టీ స్పూను
మెంతిపొడి - అర టీ స్పూను
గ్రీన్ కలర్ - రెండు మూడు చుక్కలు
ఉప్పు - తగినంత
తయారి:
కూరలన్నిటినీ శుభ్రంగా కడిగి తొక్క తీసి క్యూబ్ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక బాణలిలో నూనె వేసి అందులో ఈ కూర ముక్కలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె, నెయ్యి వేసి కాగిన తరవాత అందులో పాలకూర పేస్ట్ వేసి బాగా వేయించాలి. తరవాత మిరప్పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, గ్రీన్ కలర్, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించుకున్న కూరముక్కలు వేసి బాగా కలిపిన తరవాత ఉప్పు వేసి మరోమారు కలిపి దానిని గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా చీజ్ తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి.
వెజ్ మంచూరియా
క్యారట్ - 20 గ్రా; బీన్స్ - 10 గ్రా క్యాబేజీ - 50 గ్రా; పనీర్ - 10 గ్రా
(వీటినన్నిటినీ తురుముకోవాలి) మైదా - 10 గ్రా
కార్న్‌ఫ్లోర్ - 20 గ్రా; చిల్లీసాస్ - టీ స్పూను
టొమాటో సాస్ - టీ స్పూను; నూనె - తగినంత
చైనా సాల్ట్ - అర టీ స్పూను
తెల్లమిరియాలపొడి - అర టీ స్పూను
పంచదార - అర టీ స్పూను; సోయాసాస్ - అర టీ స్పూను; ఉల్లికాడలు - కొద్దిగా; కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత; ఉల్లితరుగు - అరకప్పు
అల్లం తరుగు - టీ స్పూను; వెల్లుల్లి తరుగు - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
తయారి:
ఒక బౌల్‌లో తురుముకున్న కూరలు, మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. (ఇందులో నీరు చేర్చవలసిన అవసరం ఉండదు). బాణలిలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని బాల్స్ మాదిరిగా చేసుకుని నూనెలో వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. మరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి తరుగు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించాక కొద్దిగా నీరు పోసి మరిగించాలి. ఆ తరవాత చైనా సాల్ట్, తెల్లమిరియాల పొడి, పంచదార, చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ వేసి బాగా కలపాలి. తరవాత ముందుగా వేయించి ఉంచుకున్న మంచూరియాలను ఇందులోవేసి పూర్తిగా తడిపోయేవరకు వేయించాక, బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.
కడాయ్ పనీర్
నూనె - టీ స్పూను; పనీర్ - 100 గ్రా
బటర్ - 30 గ్రా; ఉల్లిపాయ పేస్ట్ - 100 గ్రా
జీడిపప్పు పేస్ట్ - 10 గ్రా; టొమాటో పేస్ట్ - 50 గ్రా
మిరప్పొడి - టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా
జీరాపొడి - అర టీ స్పూను
మెంతిపొడి - అర టీ స్పూను
పసుపు - అర టీ స్పూను
పంచదార - అర టీ స్పూను
రెడ్ కలర్ - రెండు చుక్కలు
ఉప్పు - తగినంత; నీరు - కొద్దిగా
తయారి:
స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పనీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. తరవాత అదే బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వే సి బాగా వేయించాలి. గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తరవాత అందులో మిరప్పొడి, జీరాపొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, రెడ్‌కలర్ చుక్కలు, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి. వీటన్నిటినీ బాగా ఉడికేదాకా ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగ వస్తుంది. ముందుగానే వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. కాసేపు కలిపాక అందులో నుంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి ఈ పదార్థాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

