కబుర్లు, ముచ్చట్లే...కార్తీక భోజనాలు!
రెస్టారెంట్లో వెయిటర్ వచ్చేలోగా, ఐటమ్స్ ఏంటా అని మెనూ చూస్తాం.
వనభోజనాలకు వెళ్లినప్పుడు మాత్రం అలా ఉండదు!!
ఏమున్నాయని కాకుండా, ఎవరెవరు వచ్చారా అని చూస్తాం.
అన్నీ ఉన్నాయా అని కాకుండా, అంతా వచ్చేశారా అని చూస్తాం.
పెద్దవాళ్లు ఉసిరిచెట్టు కోసం... (శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించడానికి)
ఆడవాళ్లు పలకరింపుల కోసం...(ఒకరికొకరు సాయం చేసుకోవడానికి)
పిల్లలు తమ జట్లకోసం... (పరుగులు తీస్తూ ఆడేందుకు)... చూస్తారు!
వెన్నెల రోజుల్లో, చిరు చలిగాలుల్లో, లేలేత ఎండల్లో...
ఒకపూట చేసే వనభోజనం కూడా ఏడాదంతా గుర్తుండిపోయేది అందుకే.
కలిసి కూర్చోవడం, కలిసి వడ్డించుకోవడం...
కలిసి భుజించడం, కలిసి మాట్లాడుకోవడం... ఓ ఫెస్టివల్.
ఆ ఫెస్టివల్‌కి ఈ రుచులను మేళవించండి చాలు, ఫీస్ట్‌ఫుల్ అయిపోతుంది!
దాల్పూరీ - dAl Puri
పెసరపప్పు - అరకప్పు; మినప్పప్పు - అర కప్పు; గోధుమపిండి - ఒక కప్పు + పావుకప్పు; లవంగాలు - 4; మిరియాలు - 8; ఏలకులు - 3; జీలకర్ర - అర టీ స్పూను; నెయ్యి - 3 టీ స్పూన్లు (డీప్ ఫ్రైకి సరిపడా); ఉప్పు - తగినంత
తయారి:
పెసరపప్పు, మినప్పప్పులను ముందురోజు రాత్రి నానబెట్టాలి
మరుసటిరోజు మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి
మిక్సీలో లవంగాలు, మిరియాలు, ఏలకులు, జీలకర్ర వేసి మెత్తగా పొడి చేయాలి
బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి వేడయ్యాక, మెత్తగా చేసిన మసాలా, రుబ్బి ఉంచుకున్న పప్పుల పిండి, ఉప్పు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి
గోధుమపిండిలో రెండు టీ స్పూన్ల నెయ్యి, నీరు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి ఉండలుగా చేసుకోవాలి
ఒక్కో ఉండ తీసుకుని చేతితో ఒత్తి, కొద్దిగా పప్పుల ముద్దను ఉంచి అంచులు మూసేయాలి
అప్పడాల పీట మీద పొడి పిండి వేసి ఒక్కో ఉండను పూరీలా ఒత్తుకోవాలి
బాణలిలో నెయ్యి కాగాక ఒక్కో పూరీ వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
జీరా వాటర్ -jIrA water
వేయించిన జీలకర్ర పొడి - 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - టీ స్పూను; ఉప్పు - చిటికెడు; సోడా - 8 గ్లాసులు; పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను; ఐస్ క్యూబ్స్ - 8
తయారి:
మిక్సీలో జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు వేసి పేస్ట్ చేయాలి
ఒక పాత్రలో నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర + కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలపాలి
ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసి ఒక్కో గ్లాసులో వేయాలి
మిశ్రమం మీద సోడా పోయాలి
ఐస్‌క్యూబ్స్ జత చేసి, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి (గ్లాసు అంచులకు జీలకర్ర + కొత్తిమీర పేస్ట్ పూయాలి).
మెంతి రైస్ - Fenugreek Rice
బాస్మతి బియ్యం - 2 కప్పులు; మెంతి ఆకులు - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను; లవంగాలు - 3; ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క; పచ్చిమిర్చి - 3; గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - తగినంత
తయారి:
బాస్మతి బియ్యం ఉడికించి పక్కన ఉంచాలి
స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, మెంతి ఆకులు వేసి వేయించాలి
లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా జతచేసి వేయించి పక్కన ఉంచాలి
ఒక పెద్ద పాత్రలో అన్నం, వేయించి ఉంచుకున్న మసాలా వేసి బాగా కలిపి సైడ్ డిష్‌తో సర్వ్ చేయాలి.
నేతి బీరకాయ పచ్చడి - nEti bIrakAya chutney
నేతిబీరకాయ - 1; పచ్చిమిర్చి - 6; కొత్తిమీర - కొద్దిగా; నూనె - 3 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; జీలకర్ర - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; మెంతులు - టీ స్పూను; ఎండుమిర్చి - 6; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - కొద్దిగా; చింతపండు - కొద్దిగా
తయారి:
నేతిబీరకాయను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి
చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టాలి
బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి నేతిబీరకాయ ముక్కలు వేసి వేయించాలి పచ్చిమిర్చి జత చేసి మరికాసేపు వేయించి తీసి పక్కన ఉంచాలి
అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి
మిక్సీలో ముందుగా పోపు వేసి పొడి చేయాలి
నేతిబీరకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు జతచేసి మెత్తగా చేయాలి
చివరగా ఇంగువ వేసి కలపాలి.
సీతాఫలం షేక్ - custard apple shake
పాలు - లీటరు; కండెన్స్‌డ్ మిల్క్ - చిన్న టిన్ (స్వీట్ మిల్క్); పచ్చి కోవా - అరకప్పు; సీతాఫలాలు - మూడు (గింజలు వేరు చేసి గుజ్జు తీసి ఉంచుకోవాలి); వెనిలా ఎసెన్స్ - 5 చుక్కలు;
తయారి:
సన్ననిమంట మీద పాలు చిక్కగా అయ్యేవరకు కాచాలి. మీగడ కట్టగానే పక్కకు జరుపుతుండాలి
కండెన్స్‌డ్ మిల్క్, పచ్చికోవా, వెనిలా ఎసెన్స్ జత చేయాలి
మిశ్రమం చిక్కబడ్డాక దించి చల్లారనివ్వాలి
తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని గ్లాసులలో వేసి, సీతాఫలం గుజ్జు పైన వేసి వెంటనే సర్వ్ చేయాలి.
కందిపొడి - Redgram power
కందిపప్పు - అర కప్పు; పెసరపప్పు - అర కప్పు; శనగపప్పు - అర కప్పు; ఎండుమిర్చి - 15; జీలకర్ర - టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; ఉప్పు - తగినంత
తయారి:
బాణలిలో నూనె లేకుండా కందిపప్పు వేసి బాగా వేయించి పక్కన ఉంచాలి
పెసరపప్పు వేసి అది కూడా వేయించి తీసేయాలి
శనగపప్పు వేయించి పక్కన ఉంచాలి
ఎండుమిర్చి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
పప్పులన్నీ చల్లారాక అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి బాగా మెత్తగా పొడి చేయాలి కారం, ఉప్పు, ఇంగువ, జీలకర్ర జతచేసి మళ్లీ మిక్సీ పట్టాలి
(ఇష్టపడేవారు వెల్లుల్లి జత చేసుకోవచ్చు)
పొడి బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
కమ్మటినెయ్యి లేదా నువ్వుపప్పు నూనెతో అన్నంలో సర్వ్ చేయాలి. (ఉల్లిపాయ పులుసు కాంబినేషన్‌తో చాలా బావుంటుంది)
Tags - టాగ్లు: ఫెస్టివల్, రెస్టారెంట్లో, జీరా వాటర్, కందిపొడి, Festival, restaurant