nalabheema phalam - నలభీమఫలం
Various Recipes with Tomato
మనవాళ్లేమన్నా తక్కువ తిన్నారా?అంతకు అన్ని రకాలుగా టొమాటోలని
కుక్ చేసి, బేక్ చేసి, షేక్ చేసి, సూప్ చేసి, సాస్ చేసి...
పేస్ట్ చేసి, ఫ్రై చేసి, డ్రై చేసి... పచ్చడి పచ్చడి చేసి...
అప్పుడే అయిందా..!
ఆరబోసి, ఊరబోసి, కాచి వడబోసి, కవ్వంతో కుమ్మేసి...
అడ్డదిడ్డంగా ఎలా ట్రై చేసినా... అదో ఐటెమైపోతుంది!
కిచెన్ ఫ్రెండ్లీ, చికెన్ ఫ్రెండ్లీ, బ్యాచిలర్ ఫ్రెండ్లీ... టొమాటో!
విషయం అర్థమయిందిగా?!
వంట చేయడం రాకపోయినా...
టొమాటోనే మీకు వంట నేర్పిస్తుంది. ప్రేమగా తినిపిస్తుంది!
టొమాటో పులావ్ - Tomato Pulav
సన్నబియ్యం - 250 గ్రా; టొమాటోలు - 100 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 1/4 కప్పు; పచ్చిమిర్చి - 4; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి లేదా డాల్డా - టేబుల్ స్పూన్; ఏలకులు - 3; లవంగాలు - 5; దాల్చినచెక్క - చిన్నముక్క; షాజీరా- 1/2 టీ స్పూన్; ఉప్పు - తగినంత.
తయారి:
బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. టొమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి. అంటే పాత బియ్యమైతే గ్లాసుతో బియ్యం కొలుచుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి. అప్పుడు అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా కాకుండా ఉంటుంది. కొత్త బియ్యమైతే నీళ్లు తగ్గించాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి. టమాట నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి. అన్నం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఈ పులావ్‌ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు. కుర్మా లాంటి కూర లేదా పెరుగుపచ్చడితో సర్వ్ చేయాలి.
టొమాటో - ఎగ్ కర్రీ - Tomato Egg Curry
టొమాటోలు - 6; కోడిగుడ్లు - 3; ఉల్లిపాయ - 1; కరివేపాకు - 1 రెమ్మ; అల్లం వెల్లుల్లి ముద్ద - చిన్న చెంచాడు; పసుపు - 1/4 టీస్పూన్; కారంపొడి - 1 టీ స్పూన్; గరంమసాలా పొడి - 1/4 టీ స్పూన్; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు;
తయారి:
బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, కారం పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు కలిపి మూతపెట్టాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గి, మెత్తబడిన తర్వాత, బాగా కలిపి, కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్డు సగం ఉడికిన తర్వాత గరిటెతో మెల్లగా కలపాలి. దీనివల్ల గుడ్డు పెద్దపెద్ద ముక్కలుగా అవుతుంది. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా చల్లి దింపేయాలి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది.
టొమాటో గుత్తికూర - Tomato GuttikUra
టొమాటోలు - 250 గ్రా (గాట్లు పెట్టాలి); ఉల్లిపాయలు - 2; కొబ్బరిపొడి - 2 టేబుల్‌స్పూన్లు; జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్; మెంతిపొడి - 1/4 టీ స్పూన్; పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు; పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు; నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు పులుసు - 1/4 కప్పు; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; ధనియాల పొడి - టేబుల్ స్పూన్; అల్లం వెల్లుల్లి ముద్ద - టీస్పూన్; కరివేపాకు - 1 రెమ్మ; నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు (నూనె లేకుండా) కొద్దిగా వేయించి, పొడి చేసుకోవాలి. నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. మిక్సీలో... ముందుగా తయారుచేసి ఉంచుకున్న పొడి, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, గాట్లు పెట్టి ఉంచుకున్న టొమాటో లను మగ్గనివ్వాలి. తరవాత గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాలాపేస్ట్, కొద్దిగా నీరు కలిపి చిక్కగా చేసి ఈ టొమాటోల మీద పోసి కలిపి మూతపెట్టి, మంట తగ్గించాలి. నూనె తేలేవరకు ఉడికించి, కొత్తిమీర తో గార్నిష్ చేయాలి.
టొమాటో - పండుమిర్చి పచ్చడి - Tomato Red Chilli Chutney
టొమాటో ముక్కలు- 2 కప్పులు; పండుమిర్చి ముక్కలు - 1/2 కప్పు; జీలకర్ర పొడి - టీ స్పూన్; పసుపు - 1/4 టీస్పూన్; మెంతిపొడి - 1/4 టీ స్పూన్; ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ చొప్పున; కరివేపాకు - 1 రెమ్మ; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు;
తయారి:
మిక్సీలో టొమాటో ముక్కలు, పండుమిర్చి ముక్కలు వేసి మెత్తగా చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, రుబ్బిన టొమాటో, మిర్చి మిశ్రమాన్ని వేయాలి. మూతపెట్టి నిదానంగా ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయి, చిక్కబడుతున్నప్పుడు జీలకర్ర పొడి, మెంతిపొడి, కారం పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి. ఈ పచ్చడి మూడు రోజులు నిలువ ఉంటుంది.
నిమ్మ - టొమాటో పచ్చడి - Lemon Tomato Pickle
టొమాటోలు - 250 గ్రా; నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు; పసుపు - 1/4 టీస్పూన్; కారంపొడి - టేబుల్‌స్పూన్; ఉప్పు - తగినంత; జీలకర్ర పొడి - టీస్పూన్; మెంతి పొడి - 1/4 టీస్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి - 2; ఆవాలు - 1/4 టీస్పూన్; జీలకర్ర - 1/4 టీస్పూన్; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - 1 రెమ్మ.
తయారి:
టొమాటోలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. (టొమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడనివ్వకూడదు). పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడులు వేసి మెల్లిగా కలిపి (గరిటతో కాకుండా పాన్‌నే మెల్లగా కదిపితే మంచిది) మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. చల్లారాక నిమ్మరసం వేయాలి. మొత్తం కలిపి ఓ గంటపాటు అలాగే ఉంచి ఆ తర్వాత వడ్డించవచ్చు.
టొమాటో బోండా - Tomato bONDA
చిన్న టొమాటోలు - 250 గ్రా; బంగాళదుంపలు - 3; పచ్చిమిర్చి - 3 (సన్నగా కట్ చేయాలి); కొత్తిమీర - చిన్నకట్ట; శనగపిండి - కప్పు; కారం - టీ స్పూన్; ధనియాల పొడి - టీస్పూన్; వంటసోడా - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత.
తయారి:
బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పొడిపొడిగా మెదిపి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. గట్టిగా ఉన్న టొమాటోలను పైన కొద్దిగా కట్ చేసి, లోపలి గుజ్జంతా తీసేయాలి. ఉడికించిన బంగాళదుంప మిశ్రమం కూరి, మూత పెట్టి, టూత్ పిక్‌తో విడిపోకుండా గుచ్చి పెట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, వంటసోడా, తగినంత నీరు వేసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. టొమాటోలను శనగపిండి మిశ్రమంలో మొత్తం పిండి అంటుకునేలా ముంచి, వేడినూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కో బోండాను సగానికి కట్ చేయాలి. మూడు రంగులతో ఆకర్షణీయంగా ఉంంది.
టొమాటో - Tomato...
ఇప్పుడు ఎన్నోరకాల టొమాటోలు అందుబాటులో ఉన్నాయి. టొమాటోలను పచ్చిగా కూడా తింటారు. వీటిని ఎన్నోరకాల కూరలకు జత చేసి వండుతారు. సాస్, సలాడ్, డ్రింక్ వంటివి తయారుచేస్తున్నారు. బొటానికల్‌గా వీటిని ‘పండు’ అని పిలిచినప్పటికీ, వీటిని కాయగూరగానే ఉపయోగిస్తాం. టొమాటోలో అధికంగా ఉండే లైకోపిన్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
సాధారణ వాతావరణంలోనే కాకుండా, చల్లటి వాతావరణంలో గ్రీన్ హౌసెస్‌లో కూడా వీటిని పెంచుతున్నారు. ఇవి నైట్ షేడ్ కుటుంబానికి చెందినవి. 1 - 3 మీటర్ల ఎత్తువరకు, అంటే పది అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. వీటి కాండం బలహీనంగా ఉంటుంది. ఈ చెట్లు... నేల మీద పాకుతాయి, తీగల్లాగ వేరే చెట్ల మీదకి అల్లుకుంటాయి.
టొమాటోలను ప్రపంచవ్యాప్తంగా వేలకొలదీ రైతులు పండిస్తున్నారు. రకరకాల సైజులలో లభ్యం అవుతున్నాయి. 5 మి.మీ. పరిమాణంలో ఉండే చెర్రీ టొమాటోలు మొదలు, 10 సెంటీ మీటర్ల పరిమాణం ఉండే బీఫ్‌స్టీక్ టొమాటోల వరకు లభిస్తున్నాయి. 5 సెం.మీ. పరిమాణంలో ఉండే టొమాటోలు అత్యధికంగా లభిస్తున్నాయి. ఇవి ఎరుపురంగులో మాత్రమే కాకుండా పసుపు, నారింజ, గులాబీ, పర్పుల్, అకుపచ్చ, తెలుపు రంగులలో కూడా దొరుకుతాయి. కొన్నికొన్ని ప్రాంతాలలో చారల టొమాటోలు కూడా దొరుకుతాయి.
టొమాటో ఉత్పత్తి చేసే దేశాలలో చైనాది ప్రథమస్థానం.

