Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Festival (full of plate) - పండగ (ప్లేటు నిండుగా)

Festival (full of plate) - పండగ (ప్లేటు నిండుగా)

SankrAnti / Pongal Special

అరిసెను, గరిసెను... ఈ రెండిటినీ
చూస్తే ఒకే ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది?
సంక్రాంతి నాడు!
ఆ రోజున ధాన్యంతో గరిసె పండుతుంది.
అరిసెతో ప్లేటు నిండుతుంది.
కొరికేందుకు స్మూతే... అంతమాత్రాన చిట్టిగారె... రుచికి గట్టిది కాదని అనగలమా!
రుచులు నాలుకపై అష్టాచెమ్మా ఆడుతున్నాయంటే అది స్వీట్ గవ్వల వల్లనేమో!
ప్లేట్లో గులాబీ గుత్తులు పూస్తాయా...?
జంతికల కరకర, కాజా బాజాల మోత...
ఇవన్నీ ఉన్నాయంటే... ష్యూర్ అది సంక్రాంతే!


అరిసెలు

కావలసినవి
బియ్యం - కిలో
బెల్లం - ముప్పావు కిలో
నువ్వులు - 100 గ్రా.
నూనె - వేయించడానికి సరిపడినంత

తయారి
బియ్యాన్ని ఒకరోజు ముందు నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు పూర్తిగా వడ కట్టేసి, బియ్యాన్ని మెత్తగా పిండి పట్టి జల్లించి పెట్టుకోవాలి. (ఈ పిండి తడిగా, మెత్తగా ఉండాలి. పిండి ఆరకముందే పాకం తయారుచేసుకోవాలి.) ఒక పెద్ద పాత్రలో తరిగిన బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి కరగనివ్వాలి. దీనిని నలకలు, పుల్లలు లేకుండా వడకట్టుకుని, మళ్లీ స్టౌ మీద ఉంచాలి. ఉండపాకంలా వచ్చిన తరవాత దించి, కొద్దికొద్దిగా తడిపిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతుండాలి. అప్పుడు చలిమిడిలా తయారవుతుంది. అది కొద్దిగా చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకుని, నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద మరీ పలుచగా, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకుని, పైన నువ్వులు అద్ది నూనెలో వేయాలి. వేగిన అరిసెలను అరిసెల పీట మీద పెట్టి గట్టిగా ఒత్తి నూనె తీసేయాలి. ఈ అరిసెలను విడివిడిగా పరిచి చల్లారనివ్వాలి. (ఒకదాని మీద ఒకటి ఉంటే అంటుకుంటాయి.)

స్వీట్ గవ్వలు

కావలసినవి
మైదా లేదా గోధుమపిండి - కప్పు, బొంబాయిరవ్వ - టేబుల్ స్పూను, బెల్లం తురుము - అర కప్పు, నెయ్యి - టేబుల్ స్పూను, నూనె - వేయించడానికి సరిపడేంత

తయారి
ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాత నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనిని అరగంటసేపు నాననివ్వాలి. నానిన ముద్దను చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి ముదురుపాకం వచ్చాక, వేయించిన గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి.

చిట్టి గారెలు

కావలసినవి
మినప్పప్పు - అరకప్పు, బియ్యప్పిండి - రెండు కప్పులు, వాము - అర టీ స్పూను, ఉప్పు, కారం - తగినంత, నూనె - వేయించడానికి సరిపడినంత

తయారి:
మినప్పప్పుని రెండుగంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో బియ్యప్పిండి, వాము, ఉప్పు, కారం వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కుంకుడుకాయ పరిమాణంలో చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక తడి బట్ట మీద ఈ ఉండలను దూరందూరంగా పెట్టి, మరో తడిబట్టతో కప్పేయాలి. చెంబుతో కాని ఏదైనా బరువైన వస్తువుతో గాని ఈ ఉండల మీద గట్టిగా అదమాలి. దీని వలన ఉండలు గుండ్రంగా, పలుచగా వస్తాయి. వీటిని జాగ్రత్తగా తీసి కాగుతున్న నూనెలో వేయించాలి. (బట్ట తడిగా ఉండేలా జాగ్రత్తపడాలి. లేకపోతే పిండి... బట్టకు అతుక్కుపోయి సరిగ్గా ఊడిరావు.)

కారం కాజా

కావలసినవి
గోధుమ పిండి - కప్పు, పుట్నాలపప్పు - పావుకప్పు (మిక్సీలో వేసి మెత్తగా పిండిచేసుకోవాలి), పసుపు - పావు స్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు, కారం - తగినంత, నూనె - వేయించడానికి తగినంత

తయారి
ఒక పాత్రలో గోధుమపిండి, పుట్నాలపిండి, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, గరిటెడు నూనె వేసి బాగా కలపాలి. ఇంగువ నచ్చనివారు జీలకర్ర లేదా వాము వేసుకోవచ్చు. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీముద్దలా కలుపుకుని అరగంట నానిన తరవాత ఉండలుగా చేసుకుని గోధుమపిండి అద్దుతూ పూరీలా ఒత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె కాగాక, ఈ ముక్కలను అందులో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.

గులాబీ గుత్తులు

కావలసినవి
బియ్యప్పిండి - ఒకటి ముప్పావు కప్పులు, మైదా - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, నెయ్యి - టేబుల్ స్పూను, ఏలకులపొడి - అర టీ స్పూను, నూనె - వేయించడానికి తగినంత

తయారి:
నూనె కాకుండా మిగతా పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో పోసి బాగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ దోసెలపిండిలా జారుగా కలిపి పదినిముషాలు నానబెట్టాలి. వేయించడానికి సరిపడేంత నూనె బాణలిలో పోయాలి. గులాబిపువ్వుల అచ్చును నూనెతో పాటు కాగనివ్వాలి. నూనె కాగిన తరవాత, అచ్చును బయటకు తీసి పిండి మిశ్రమంలో ముప్పావు వంతు భాగం ముంచాలి. (పూర్తిగా ముంచితే గులాబిగుత్తులు ఊడిరావు). పిండి నుంచి అచ్చును తీసి కాగుతున్న నూనెలో అరనిముషం సేపు ఉంచి కొద్దిగా కదిలిస్తే అచ్చు నుండి పువ్వు బయటికి వచ్చేస్తుంది. రాకపోతే ఫోర్క్‌తో కొద్దిగా కదిలించాలి. ఈ పువ్వును రెండువైపులా దోరగా వేయించి తీసేయాలి. (ఇద్దరు ఉంటే చేయటం తేలిక.)

మినప జంతికలు

కావలసినవి
బియ్యం - 3 కప్పులు, మినప్పప్పు - కప్పు, వాము - టీ స్పూను, ఉప్పు, కారం - తగినంత, నూనె - వేయించడానికి తగినంత

తయారి
మినప్పప్పును గోధుమరంగు వచ్చేవరకు వేయించి, చల్లారాక బియ్యంతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, వాము, గరిటెడు నూనె వేసి కలపాలి. తగినంత నీరు పోసి ముద్దలా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి, కాగుతున్న నూనెలో జంతికల మాదిరి ఒత్తుకోవాలి. రెండువైపులా దోరగా వేగాక తీసేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html