మంచి తిండి, మంచి బట్ట, మంచి నివాసం, మంచి ఆరోగ్యం...
కాని-
ఎదుటివారికి కూడా ఇవన్నీ దక్కాలనే గుణం కూడా.
అప్పుడే లోకం ప్రియమైనదిగా మారుతుంది.
సాటి మనిషి ఆప్తుడవుతాడు. అభిమానం అనుబంధం అవుతుంది.
2012 కు స్వాగతం పలకండి సాటివారితో కలిసి.
ఇక్కడ చక్కటి భోజనానికి కావలసిన మెనూ ఇస్తున్నాం.
వండండి... వడ్డించండి... మీ ఆతిథ్యమే మీ సంతోషాలకు ATM
చాక్లెట్ మేకింగ్(chocolate making)
ఇంట్లో చాక్లెట్ తయారుచేసుకోవటానికి కావలసిన మరికొన్ని వస్తువులు ప్లాస్టిక్‌మౌల్డ్స్, వేడిని తట్టుకోగలిగిన గాజుపాత్రలు, వెడల్పాటి రబ్బర్‌స్పూన్, రాపింగ్‌ఫాయిల్.
డబుల్ బాయిలింగ్ పద్ధతి
ఒక వెడల్పాటి పాత్రలో తగినంత నీరు తీసుకొని మరగనివ్వాలి. ఇంకో పాత్రలో చాక్లెట్‌ను ముక్కలుగా తుంచి వేసుకోవాలి. మరుగుతున్న నీటిపాత్రలో, చాక్లెట్ ముక్కలను వేసిన పాత్ర పెట్టి... చాక్లెట్ కరిగిపోయే దాకా రబ్బరు స్పూనుతో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ‘కరిగిన చాక్లెట్’ ఉన్న గిన్నెను పక్కకు తీసుకుని రెండు మూడు నిమిషాలపాటు కలపాలి. ఈ మిశ్రమాన్ని రౌండ్‌గా ఉండే మౌల్డ్స్‌లో పోసి చల్లటి ప్రదేశంలో ఆరనివ్వాలి. (ఫ్రిజ్‌లో పెట్టకూడదు). గట్టి పడిన తరవాత నచ్చిన రాపింగ్‌ఫాయిల్‌తో కవర్ చేస్తే చాక్లెట్ రెడీ.
దహీ వడ(dahI vaDa)
మినప్పప్పు - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి సరిపడా,
దహీకి కావలసినవి
పెరుగు - లీటరు, వేయించిన జీరాపొడి - టీ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం తురుము - టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట
తయారి
ముందురోజు రాత్రి మినప్పప్పును నానబెట్టాలి. మరుసటి రోజు గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఈ పిండిని చిన్నచిన్న గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించి తీసి నీళ్లలో వేసి ఒక నిముషం నాననిచ్చి తీసేయాలి. ఒక పాత్రలో పెరుగు వేసి చిక్కగా చిలకరించి, అందులో ఉప్పు, పంచదార, జీరాపొడి, మిరప్పొడి వేసి కలిపి, వేయించి ఉంచుకున్న గారెలను ఇందులో వేయాలి. కొత్తిమీర తరుగు, అల్లం తురుములను పైన చల్లాలి. చివరగా చింతపండు చట్నీ, పుదీనా చట్నీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
కాజు బర్ఫీ(kAju barfI)
జీడిపప్పు - పావు కేజీ, పంచదార - 200 గ్రా, నెయ్యి - 50 గ్రా, సిల్వర్ ఫాయిల్ - ఒక షీట్ (ఇష్టమైతే వాడవచ్చు, లేకపోయినా పరవాలేదు)
తయారి
జీడిపప్పులను తగినంత నీటిలో రెండు గంటలపాటు నానబెట్టాలి. తరవాత నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీరు పోయవచ్చు). ఒక పెద్ద బాణలిలో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టౌ మీద ఉంచి సన్నని సెగ మీద బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. చివరగా నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అంతటా సమంగా పరుచుకునేలా చేయాలి. (సిల్వర్ ఫాయిల్ వాడేట్లయితే ఈ మిశ్రమం మీద కొద్దిగా నెయ్యి పూసి పైన ఫాయిల్ అతికించాలి). కొద్దిగా చల్లారాక డైమండ్ ఆకారంలో కట్‌చేసుకోవాలి. రెండు గంటలు పూర్తిగా ఆరిన తరవాత కట్ చేసిన ముక్కలను తీసి డబ్బాలో భద్రపరచుకోవాలి.
జీరా పులావ్(jIrA pulAv)
బాస్మతి బియ్యం - కప్పు, నీరు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూను, నెయ్యి - టేబుల్ స్పూను, నూనె -టేబుల్ స్పూను, బిరియానీ ఆకు - 1, ఏలకులు - 4, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, ఉప్పు - రుచికి సరిపడినంత, కొత్తిమీర తరుగు - టీస్పూను, ఉల్లిచక్రాలు - 6
తయారి
బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి సుమారు ఒక గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, బిరియానీ ఆకు, ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేసి వేగాక, బియ్యం, ఉప్పు వేసి బాగా కలిపి నీరు పోయాలి. మూత పెట్టి, సన్నని సెగ మీద ఉడికించి దింపేయాలి. కొత్తిమీర తురుము, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
వెజిటబుల్ కుర్మా(vegetable kurmA)
క్యారట్ - 2, బంగాళదుంపలు - 6 (మీడియం సైజువి), బీన్స్ - 6, పచ్చిబఠాణీ - అర కప్పు, క్యాలీఫ్లవర్ - కొద్దిగా (పువ్వులుగా కట్‌చేసినవి 6), పచ్చికొబ్బరి తుమురు - 150 గ్రా., గసగసాలు - 25 గ్రా., జీడిపప్పు - 25 గ్రా., నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు - 3 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి తరుగు - మూడు టీస్పూన్లు, టొమాటో తరుగు - పావుకప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, మిరప్పొడి - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు, జీరా పొడి - టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఏలకులు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, లవంగాలు - నాలుగు, కొత్తిమీర - చిన్నకట్ట, గరంమసాలాపొడి - అర టీ స్పూను, గసగసాలు - టీ స్పూను
తయారి:
పచ్చికొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కూరగాయముక్కలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, మసాలా దినుసులు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరాపొడి, మిరప్పొడి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేగాక, ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసి నూనె తేలేవరకు వేయించాలి. తరవాత కొద్దిగా నీరు, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరవాత ఉడికించుకున్న కూరముక్కలు, ఉప్పు, గరంమసాలా వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
గోబీ మంచూరియా(gObhI manchUriyA)
ఉడికించిన క్యాలీఫ్లవర్ - 200గ్రా. (పెద్దవిగా కట్ చేసుకోవాలి), కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, మైదా - రెండు టేబుల్ స్పూన్లు, రిఫైన్డ్ ఆయిల్ - టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, సోయాసాస్ - రెండు టీ స్పూన్లు , ఎండుమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, తెల్లమిరియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పెద్దది - 1 (సన్నగా తరుగుకోవాలి), వెల్లుల్లి రేకలు - 8, అల్లం తురుము - టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు, టొమాటో సాస్ - టీ స్పూను
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లికాడల తరుగు - పావు కప్పు (గార్నిషింగ్ కోసం)
తయారి:
ఒక బౌల్‌లో క్యాలీఫ్లవర్ తరుగు, టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, మైదా, టీ స్పూను సోయాసాస్, టీ స్పూను ఎండుమిర్చిపేస్ట్, ఉప్పు, కొద్దిగా నీరు పోసి బాగా కలపాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరవాత, ముందుగా తయారుచేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ మిశ్రమం వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక అందులో వెల్లుల్లిరేకలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా వేగిన తరవాత ఉల్లితరుగు, టీ స్పూను ఎండుమిర్చి పేస్ట్, టీ స్పూను సోయాసాస్, టొమాటో సాస్ వేసి కలపాలి. తరవాత మిరియాలపొడి వేసి మరోమారు కలిపాక, వేయించి ఉంచుకున్న గోబీ మంచూరియాలను వేయాలి. చిన్న గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి గోబీ మంచూరియాల మీద పోస్తూ కలపాలి. పైన కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. ఉల్లికాడలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

